అనుంగు అనుచరుడికి జగన్ ఝలక్ ?
విశాఖ జిల్లాలో జగన్ కి అనుంగు అనుచరుడు ఎవరు అంటే ఠక్కున చెప్పే పేరు కేకే రాజు అని.
By: Tupaki Desk | 27 Sep 2024 3:42 AM GMTవిశాఖ జిల్లాలో జగన్ కి అనుంగు అనుచరుడు ఎవరు అంటే ఠక్కున చెప్పే పేరు కేకే రాజు అని. ఆయన విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి వైసీపీ లీడర్ గా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన ఉంటూ బిగ్ షాట్ గా ఎదిగారు. ఆయనను తెచ్చి 2019 ఎన్నికల్లో జగన్ ఉత్తరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా దింపారు.
ఆయనకు పోటీగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిలిచారు. జనసేన కూడా పోటీలో ఉండడంతో ట్రయాంగిల్ జరిగి మూడు వేల ఓట్ల తేడాతో కేకే రాజు ఓటమి పాలు అయ్యారు. అయితే 2024 కి వచ్చేసరికి మాత్రం సీన్ రివర్స్ అయింది. భారీ మెజారిటీతో కేకే రాజు ఓటమి పాలు అయ్యారు. అది కూడా బీజేపీ అభ్యర్థి చేతిలో.
కూటమి కట్టడంతో పాటు టీడీపీ జనసేన బీజేపీకి పూర్తి స్థాయిలో సహకరించడంతో విష్ణు కుమార్ రాజు రెండోసారి ఎమ్మెల్యే అయిపోయారు. అలా కేకే రాజు ద్వితీయ ప్రయత్నం విఫలం అయింది. అయితే ఆయనకు మూడో చాన్స్ లేదని జగన్ తేల్చేశారు.
తాజాగా చేసిన మార్పు చేర్పులలో విశాఖ ఉత్తరం నియోజకవర్గానికి ఇంచార్జి గా మళ్ల విజయప్రసాద్ ని నియమించారు. ఆయన 2009లో కాంగ్రెస్ నుంచి విశాఖ పశ్చిమ నుంచి గెలిచి వచ్చిన వారు. ఆయనకు 2019లో విశాఖ పశ్చిమ టికెట్ ఇచ్చినా ఓటమి పాలు అయ్యారు. ఇపుడు ఆయనను విశాఖ నార్త్ కి షిఫ్ట్ చేశారు జగన్.
విశాఖ నార్త్ లో కాపులు వెలమలు క్షత్రియులు ఎక్కువగా ఉంటారు. గవర సామాజిక వర్గానికి చెందిన మళ్ళను ఇంచార్జిగా చేయడం వెనక ఏ రాజకీయ లెక్కలు ఉన్నాయో తెలియదు కానీ జగన్ అనుంగు శిష్యునికి మాత్రం ఝలక్ తగిలింది అని ప్రచారం అవుతోంది.
అయితే ఎన్నికల తరువాత విశాఖ ఉత్తరంలో యాక్టివిటీస్ ని రాజు తగ్గించేశారు అని అందుకే ఆయనను పక్కన పెట్టారు అని అంటున్నారు. ఇక రాజు తననుగానే రాజకీయ వైరాగ్యానికి లోను అయ్యారని, అందుకే ఆయన తప్పుకునారు అని కూడా టాక్ వినిపిస్తోంది.
వ్యాపారాలు ఉన్న వారు ఎవరూ ఇపుడు వైసీపీలో కీలక పదవులలో ఉండేందుకు ఇష్టపడటం లేదు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఇలా వచ్చి అలా ఎగిసిపడిన కేకే రాజు రాజకీయ జీవితం ఎమ్మెల్యే అన్న కోరిక తీరకుండానే ఆగిపోయింది అని అంటున్నారు.
అంగబలం అర్ధం బలం అన్నీ ఉండి కూడా అదృష్టం లేకపోవడం వల్లనే ఆయన అసెంబ్లీ దాకా వెళ్ళలేకపోయారు అని అంటున్నారు. ఇక మరి కొన్ని చోట్ల ఇంచార్జిల మార్పు చేర్పులకు జగన్ సిద్ధపడతారు అని అంటున్నారు. విశాఖ తూర్పులో కూడా తొందరలోనే మార్పులు ఉంటాయని చెబుతున్నారు ఏది ఏమైనా ఎన్ని మార్పులు చేసినా వైసీపీని వేవ్ అంటూ రాకపోతే ఈ సైలెన్స్ ని బద్దలు కొట్టడం కష్టమే అని అంటున్నారు.