వలంటీర్లందరూ ఇక వైసీపీ ఉద్యోగులే... జగన్ షాకింగ్ డెసిషన్..!
ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ కార్యక్రమాలు సహా.. ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య అనుసంధాన కర్తలుగా వలంటీర్ల వ్యవహారం స్థిరపడిపోయింది.
By: Tupaki Desk | 6 Oct 2024 4:34 PM GMTవైసీపీ హయాంలో తొలి ఆరు మాసాల్లో ఏర్పాటు చేసిన వ్యవస్థ 'వలంటీర్లు'. 2019లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. సెప్టెంబరు -అక్టోబరు నాటికి వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ కార్యక్రమాలు సహా.. ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య అనుసంధాన కర్తలుగా వలంటీర్ల వ్యవహారం స్థిరపడిపోయింది. ఇది ప్రజలకు చాలా శ్రమను తగ్గించిన మాట వాస్తవం.
చిన్నపాటి వివాదాలు, రాజకీయ విమర్శలు మినహా వలంటర్ల విషయంలో పెద్దగా చర్చించాల్సిన అవస రం లేదన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగింది. ప్రజలకు ఏ అవసరం ఉన్నా.. వారు వలంటీర్లకే ఫోన్లు చేసేవారు. వారికే చెప్పుకొనేవారు. అయితే.. ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు వలంటీర్ల వ్యవస్థ రాజకీయ దుమారం కావడంతోపాటు.. ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉండిపోయింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వలంటీర్లను కొనసాగిస్తామన్నారు.
కానీ, ఆయన అధికారంలోకి వచ్చి నాలుగు మాసాలు అయిపోయిన.. వలంటీర్ల ప్రస్తావన తీసుకురావడం లేదు. మరోవైపు .. వారిని కొనసాగిస్తారో.. లేదో కూడా సందేహంగానే మారిపోయింది. ఇవన్నీ ఇలా ఉంటే.. గత నాలుగు మాసాలుగా వలంటీర్లకు జీతాలు(గౌరవ వేతనం) కూడా ఇవ్వకపోవడంతో వలంటీర్ల వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఈ పరిణామాలపై తాజాగా స్పందించిన వైసీపీ అధినేత జగన్ వలంటీర్ల ను ఓన్ చేసుకునేందుకు రెడీ అయ్యారు.
``మనం తీసుకువచ్చిన వ్యవస్థ. మనమే కాపాడుకోవాలి. ఎక్కడెక్కడ వలంటీర్లు ఉన్నారో.. అందరినీ పిల వండి. వారికి భరోసా నింపండి. మనం ఉన్నామని చెప్పండి`` అని జగన్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే వారికి వచ్చే నెల నుంచి పార్టీ తరఫున రూ.5000 లను అందించే ప్రాతిపదికన.. నిర్ణయం తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.గతంలో సర్కారు తరఫున ఎలా అయితే వలంటీర్లు పనిచేశారో.. ఇప్పుడు వైసీపీ తరఫున పనిచేసేలా వారిని మలిచే ఆలోచన ఉందని సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియాకు చెప్పడం గమనార్హం.