మమత-శరద్-హేమంత్ సరసన.. జగన్ కూడా!!
అలానే..ఇప్పుడు కూడా.. జగన్ వ్యవహరించే అవకాశం ఉందన్నది చర్చ.
By: Tupaki Desk | 21 Oct 2024 9:30 PM GMTఔను.. పొలిటికల్‌గా ఇప్పుడు ఈ చర్చే సాగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర కురువృద్ధ నాయకుడు శరద్ పవార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ సహా పలువురు నేతల సరసన వైసీపీ అధినేత జగన్ కూడా చేరుతున్నారా? అనేది కీలక అంశం. ఎందుకంటే.. ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితి, భవిష్యత్తులో నాలుగు సంవత్సరాలకు పైగానే కాలాన్ని గడపాల్సిన పరిస్థితిని తలుచుకుంటే.. ఆయనకు జాతీయస్థాయిలో దన్నుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్ పార్టీతో పోరు పెట్టుకుని.. బయటకు వచ్చి.. సొంత కుంపటి పెట్టుకున్న కీలక నాయకుల మాదిరిగానే జగన్ వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయాల్లో ఏదీ కొత్తకాదు. ఏదీ పాతకాదు. అవసరం-అవకాశం.. అనే రెండు పట్టాలపైనే ఎవరి రాజకీయాలైనా ముందుకు సాగుతాయి. అలానే..ఇప్పుడు కూడా.. జగన్ వ్యవహరించే అవకాశం ఉందన్నది చర్చ. మమతా బెనర్జీ ఒకప్పుడు కరడు గట్టిన కాంగ్రెస్ వాది. పార్లమెంటులోనూ దుమ్ము రేపారు.
ఆ తర్వాత.. పశ్చిమ బెంగాల్‌లో వచ్చిన విభేదాలతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీగా వేరు పడ్డారు. ఇక, మహారాష్ట్రకు చెందిన శరద్ పవార్.. ఇందిరమ్మ హయాం నుంచి కాంగ్రెస్‌తోనే ఉన్నారు. కేంద్రం లో మంత్రి పదవులు కూడా చేశారు. సోనియా గాంధీతో వచ్చిన విభేదాల కారణంగా ఆయన బయటకు వచ్చిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్ సీపీ)ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక, జార్ఖండ్ అదికార పార్టీ జేఎంఎం ఒకప్పటి అధినేత శిబు సొరేన్ కూడా.. ఇందిరమ్మ హయాంలో కాంగ్రెస్ నాయకుడు. రాష్ట్ర విభజన కోసం పోరాడి.. తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు.
అయితే.. కాంగ్రెస్‌తో ఇలా విభేదించి బయటకు వచ్చిన వారంతా.. ఇప్పుడు ఆ పార్టీతోనే చేతులు కలిపిన విషయం తెలిసిందే. కూటమిగా ఏర్పడ్డారు. కాబట్టి.. రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా ఇలానే మారినా ఆశ్చర్యం లేదన్నది పరిశీలకుల మాట. కాంగ్రెస్ పార్టీ తనకు సీఎం సీటు ఇవ్వలేదని, ఓదార్పు యాత్రలు చేయనివ్వలేదని అలిగి బయటకు వచ్చిన జగన్.. సొంత కుంపటి పెట్టుకున్నారు. అయితే.. కాల మాన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీతోనే లోపాయికారీగా చేతులు కలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.