శతృవులను పెంచుకోవడంలో ఆయనకు సాటి లేరా ?
శత్రువులు ఎవరికైనా ఉంటారు. అజాత శత్రువు అన్న వారు ఈ కాలంలో లేరు. కానీ ఎంతో కొంతమంది నమ్మిన వారు పక్కన ఉంటారు.
By: Tupaki Desk | 8 Feb 2025 3:30 AM GMTఎవరైనా వివాదాలకు దూరంగా ఉండాలని చూస్తారు. అలాగే సాధ్యమైనంత వరకూ పొగిడేవారు పక్కన లేకపోయినా తిట్టేవారు బయట ఉండకూడనుకుంటారు. చిత్రమేంటో కానీ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మాత్రం శత్రువులను పెంచుకోవడంలోనే ఎపుడూ చూస్తారా అన్నది ఒక సెటైర్ గా ఉంది.
శత్రువులు ఎవరికైనా ఉంటారు. అజాత శత్రువు అన్న వారు ఈ కాలంలో లేరు. కానీ ఎంతో కొంతమంది నమ్మిన వారు పక్కన ఉంటారు. జగన్ విషయంలో మాత్రం పక్కన ఉన్న వారే ఎదురుగా నిలబడతారు. సవాల్ చేస్తారు. ఆయన గురించి అసలైన శత్రువులు ప్రత్యర్ధులు అనని మాటలు కూడా అంటారు. ఇది నిజంగా బాధాకరమని వైసీపీ వారంతా బాధపడుతూంటారు.
నిజానికి చూస్తే తెలుగు రాజకీయాలే కాదు దేశ రాజకీయాల్లోనూ జగన్ మాదిరిగా బహుశా అత్యధిక ప్రత్యర్ధులు ఉన్న వారు అలాగే ఆయన మాదిరిగా ఎక్కువగా విమర్శలకు గురి అయిన వారూ ఎవరూ ఉండరనే అంటారు ఆయన రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి విమర్శకులే ఎక్కువ. ఆయన వెంట ఉన్న వారు సైతం అదే బాట పట్టడమే రాజకీయ విచిత్రం.
అయితే దీనిలో జగన్ వైఖరి అన్న పాత్ర కూడా ఉందని అంటారు. ఆయన కూడా తనదైన శైలిలో పాలిటిక్స్ చేస్తూంటారు. దాంతో పాటుగా ఆయనతో వచ్చిన గ్యాప్ నా లేక ఆయన సరిదిద్దలేని గ్యాప్ నా లేక కోరి తెచ్చుకున్న కష్టాలా తెలియదు కానీ సన్నిహితులే శత్రువులుగా మారి చెవిలో జోరీగ మాదిరిగా విమర్శల వర్షం కురిపిస్తూంటారు.
జగన్ సొంత చెల్లెలు షర్మిల ఎదురు నిలిచి అన్నను అంతలా బదనాం చేస్తుందని ఎవరైనా కలలో ఊహించారా. కానీ అది జరిగిపోయింది. రాజకీయాల్లో ఇలాంటివి సహజం అని ఎంత అనుకున్నా జగన్ విషయంలో జరిగినవి చూస్తే రాజకీయాలే ఆశ్చర్యపోయే సందర్భం అని అంటారు. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వైసీపీలో ఉన్నపుడు ప్రత్యర్ధుల మీద ఎంత పదునుగా పనిచేసిందో అందరికీ ఎరుకే.
అటువంటి ఆయన ట్విట్టర్ ఇపుడు తొలిసారి జగన్ మీదకు మళ్ళింది. సున్నితంగానే అయినా ఘాటుగా ధాటీగా విజయసాయిరెడ్డి తొలి ట్వీట్ చేసి జగన్ కి షాక్ ఇచ్చారు. మరి రాబోయే రోజులలో ఆ ట్విట్టర్ కి మరెంత పని చెబుతారో చూడాల్సి ఉంది. ఇక పోతే జగన్ సైతం మీడియా సమావేశంలో కొంత అచీ తూచీ మాట్లాడాల్సి ఉందని అంటున్నారు.
మిగిలిన రాజకీయ నాయకుల మాదిరిగా విజయసాయిరెడ్డిని లెక్కించడం తప్పు అని కూడా అంటున్నారు. పైగా విజయసాయిరెడ్డి పార్టీని వీడినా జగన్ మేలు కోరుకుంటున్నట్లుగానే మంచిగా చెబుతూ వచ్చారు. అలాంటి నేపథ్యంలో ఆయన విషయంలో సున్నితంగానే డీల్ చేసి ఉండాల్సింది అని అంటున్నారు. హార్ష్ గా మీడియాతో ఈ విషయంలో జగన్ రియాక్ట్ కావడం వల్లనే విజయసాయిరెడ్డి ట్విట్టర్ కి పని చెప్పాల్సి వచ్చిందని అంటున్నారు.
అయినా ఉన్న శత్రువులు చాలకనా కొత్త వారిని ఆహ్వానించడం అన్న చర్చ కూడా ఉంది. జగన్ ఇపుడు రాజకీయంగా ఇబ్బందులలో ఉన్నారు. పార్టీని చక్కబెట్టుకోవాలి. ఎవరు పార్టీని వీడినా వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అందువల్ల అన్నీ కరెక్ట్ అనలేరు, అలాగని తప్పు అని కూడా చెప్పలేరు.
ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వరకూ లౌక్యంగా సౌఖ్యంగా మీడియా ముందు మాట్లాడితే ఈ తరహా ఇబ్బందులు రావని అంటున్నారు. అలాగే సొంత చెల్లెలితో సన్నిహితులతో మాటలు పడడం వారినే శత్రువులుగా చేసుకోవడం జగన్ కి ఎలా ఉందో కానీ ఆయనను అభిమానించే వారు మాత్రం తెగ ఫీల్ అవుతున్నారు. జగన్ కి ఉన్న శత్రువులు చాలని వారితోనే పోరాడడానికి సమయం సరిపోవదం లేదని కొత్త వారిని ఎందుకు తెచ్చుకోవదం అన్న చర్చ అయితే సాగుతోంది.