పోసానికి మద్దతు వెనుక.. జగన్ వ్యూహం ఇదేనా ..!
సినీ నటుడు, వైసీపీ మాజీ నాయకుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు.. తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే.. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది.
By: Tupaki Desk | 28 Feb 2025 1:00 PM ISTసినీ నటుడు, వైసీపీ మాజీ నాయకుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు.. తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే.. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. పోసాని అరెస్టు అనంతరం.. ఆయన సతీమణితో జగన్ సంభాషించారు. పార్టీ అండగా ఉంటుందన్నారు. న్యాయపరంగా నే కాకుండా.. అన్ని విధాలా తాము అండగా ఉంటామన్నారు. ఇదేసమయంలో కూటమి సర్కారుపైనా ఆయన నిప్పులు చెరిగారు. నిరంకుశ పాలన సాగుతోందన్నారు.
ఇక, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నాయకులతో జగన్ ఫోన్‌లో సంభాషించారు. పోసానికి అన్ని విధాలా సాయం అందించాలని ఆయన సూచించారు. దీంతో ఆయా జిల్లాలకు చెందిన ఇద్దరేసి నాయకులు హుటాహుటిన కడపకు చేరుకుని పోసానికి సాయం అందించే కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అయితే.. ఇతర నాయకుల విషయంలో ఇంత వేగంగా స్పందించని జగన్.. పోసాని విషయంలో అందు నా.. తాను వైసీపీకి సహా రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని ప్రకటించిన తర్వాత.. ఇంత ఇంట్రస్ట్ చూపించడం చర్చకు దారితీసింది.
ఇలా పోసాని విషయంలో జగన్ ఇంట్రస్ట్ చూపించడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.
1) కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు వ్యవహరించడం.
2) టాలీవుడ్‌లో తనకు మద్దతుఇస్తున్న వారిని కాపాడుకునే ప్రయత్నాలు చేయడం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీ అరెస్టు అయ్యారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ విషయంలో జగన్ ఒకటి రెండు రోజులు లేటుగా స్పందించారు. జైలుకు వెళ్లి పరామర్శించారు. అయినా.. వెంటనే స్పందించలేదన్న విమర్శలు వచ్చాయి.
దీనిని సరిచేసుకునేందుకు పోసాని అరెస్టుపై వెంటనే స్పందించారు. తన వారిని రంగంలోకి దింపి సాయం చేసేందుకు ప్రయత్నించారు. తద్వారా.. తనకు కమ్మ సామాజిక వర్గానికి మధ్య గ్యాప్ తగ్గించే ప్రయత్నం చేసినట్టు అయింది. ఇక, టాలీవుడ్లో ఉన్న వారిలో అందరూ.. జగన్ దాదాపు దూరమయ్యారు. అలీ నుంచి విజయ్ చందర్ దాకా వైసీపీకి దూరమయ్యారు. పోసాని కూడా అదే బాటపట్టారు. దీంతో ఇప్పుడు జగన్ గురించి ఆలోచించే వారు లేకుండా పోయారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ను మచ్చిక చేసుకు నేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారన్న చర్చ సాగుతోంది. మరి ఈ ప్రయత్నం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.