షర్మిల సీరియస్.. జగన్ లైట్.. జనాల మాటేంటి ..!
అయితే.. పార్టీ అధినేత జగన్ మాత్రం షర్మిల వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నారు. ఆమెను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆయన ఉన్నారు.
By: Tupaki Desk | 15 Nov 2024 4:30 PM GMTకాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీరియస్‌గానే రాజకీయాలు చేస్తున్నారు. తన అన్న, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను తీవ్ర పదాలతో విమర్శిస్తున్న విషయం తెలిసిందే. చాలా సూటి పోటి మాటలు కూడా అంటున్నారు. ఈ మాటలు సామాన్య ప్రజల్లోకి చాలా వేగంగా చేరిపోతున్నాయి. ముఖ్యంగా అభివృద్ది చేయకపోవడం, అప్పులు చేయడం వంటి వాటిపై ఇటీవల కాలంలో సూటిగా ప్రశ్నించారు. ఇక, ఎన్నికలకుముందు బాబాయి వివేకానందరెడ్డి హత్యను నిశితంగా ప్రశ్నించారు.
తాజాగా జగన్ అండ్ కో అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని కూడా.. షర్మిల చాలా తీవ్రంగా ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడాన్ని ఆమె తప్పుబడుతున్నారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు సభ్యత్వం ఎందుకు రాజీనామాలు చేయండి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ సామాన్య ప్రజలకు వెంటనే చేరిపోతున్నాయి. వీటిలో ఎక్కడా శషభిషలు లేకుండా సాధారణ ప్రజలు చర్చించుకునేలా కూడా ఉన్నాయి.
ఈ వ్యాఖ్యలతో వైసీపీకి మరింత డ్యామేజీ ఏర్పడడం ఖాయమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతు న్నారు. అయితే.. పార్టీ అధినేత జగన్ మాత్రం షర్మిల వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నారు. ఆమెను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆయన ఉన్నారు. ''కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడతాం అబ్బా.. ఆ పార్టీ గురించి మాట్లాడి టైం వేస్ట్'' అని ఒక్క మాటతో తేల్చేశారు. అంతేకాదు.. షర్మిల గురించి అసలు మాట్లాడేందుకు కూడా ఆయన ఇష్టపడడం లేదు.
అంతేకాదు.. 1.7 శాతం ఓటు బ్యాంకు ఉందంటూ.. కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. ఓకే.. ఇదంతా నిజమే కావొచ్చు.. కానీ, ఆ పార్టీ ఎదగకపోయినా.. ఆ పార్టీ వల్ల వైసీపీకి జరుగుతున్న భారీ నష్టాన్ని, ముఖ్యంగా జగన్ ఇమేజ్ దారుణంగా పడిపోతున్న తీరును మాత్రం జగన్ గుర్తించే ప్రయత్నం చేయడం లేదని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షర్మిలను కట్టడి చేసేందుకు ప్రయత్నించకపోగా.. ఆమెను లైట్ తీసుకునే ప్రయత్నం మంచిది కాదని.. ఆమె చేస్తున్నవిమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయాలన్నది వారి మాట. కానీ, జగన్ ఎవరి మాటా వినని సీతయ్య కదా!!