జగన్ టార్గెట్ గా పవన్...అందుకే అలా !
ఏపీ పాలిటిక్స్ లో వైసీపీనే జనసేన మొదటి నుంచి లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Nov 2024 5:32 PM GMTవైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని అధికారంలో ఉంటూ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరపుతున్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ లో వైసీపీనే జనసేన మొదటి నుంచి లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీకార రాజకీయాలకు తావు లేదని పవన్ ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అలా నాలుగైదు నెలలు పవన్ మౌనంగానే ఉన్నారు. నిజానికి అధికారంలోకి వచ్చిన మొదట్లోనే వైసీపీ మీద పవన్ ఎటాక్ స్టార్ట్ చేస్తారు అని అంతా అనుకున్నారు, అయితే అది జరగలేదు.
కానీ అదే సమయంలో పవన్ సంయమనంతో వ్యవహరించారు. కానీ వైసీపీ అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయతీ కాస్తా బయటకు వచ్చింది. అది అన్నా చెల్లెళ్ల వివాదంగా మారింది. ఆస్తులలో వాటాలు అంటూ దాని మీద అతి పెద్ద చర్చ సాగింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి సరస్వతి పవర్ ప్రాజెక్ట్ మీద పడింది. ఇది బాపట్ల జిల్లా మాచవరం మండలంలో ఉంది.
ఇక్కడ పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తామని చెప్పి 2009లో వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న టైం లో వైఎస్ జగన్ కి చెందిన సరస్వతి పవర్ ప్రాజెక్ట్ కి కేటాయించారు. అప్పట్లో 1500 వందల ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. అయితే నాటి నుంచి నేటి వరకూ అక్కడ ప్రాజెక్ట్ కార్యకలాపాలు ఏవీ జరగలేదు.
మరో వైపు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి రైతుల నుంచి కారు చౌకగా భూములు తీసుకున్నారని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం రాజకీయంగా అతి పెద్ద సంచలనంగా చూడాల్సిందే.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన అనంతరం కీలక వ్యాఖ్యలే చేశారు. జగన్ సీఎం అయ్యాక 50 ఏళ్లకు ఆ లీజుని పొడిగించుకున్నారు అని అన్నారు సిమెంట్ ఫ్యాక్టరీ అంటే భూములు ఇవ్వరని పవర్ ప్లాంట్ గా చెప్పి తీసుకున్నారని ఆయన అంటున్నారు. ఈ భూములలో అటవీ భూములు ఉన్నాయని అంటున్నారు. చెప్పిన ప్రకారం పరిశ్రమ ఏర్పాటు చేయనందుకు ఎందుకు ఈ భూములు తీసుకోకూడదని ఆయన ప్రశ్నిస్తున్నారు.
అసలు ఎంత భూమి ఉంది ఎంత అసైండ్ ల్యాండ్ ఉంది, ఎంత అటవీ భూమి ఉంది అన్నది ఈ జిల్లా కలెక్టర్ సమగ్రమైన దర్యాప్తు చేయాలని ఆయన ఆదేశించారు. చెరువులు గుంటలు కూడా ఇందులో ఉన్నాయని పవన్ చెప్పారు. లేని పరిశ్రమకు క్రిష్ణా జలాలను కూడా ఈ భూముల కోసం కేటాయించేసుకున్నారని అన్నారు. ఈ భూముల పేరుతో క్రిష్ణా జలాలను ఢక్కన్ సిమెంట్ కంపెనీకి 196 కోట్ల లీటర్ల క్రిష్ణా జలాలు ఇచ్చేశారని ఆయన ఆరోపించారు.
లేని పక్షంలో లీజుని రద్దు చేసే విషయం ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. కేబినెట్ లో కూడా ఈ విషయం ప్రస్తావిస్తామని పవన్ చెప్పారు. రైతులకు పరిహారం ఈ రోజుకీ రాలేదు, అడిగిన వారి మీద దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసులు కూడా ఈ విషయంలో బాధితులకు అండగా నిలబడాలని కోరారు.
మొత్తం మీద చూస్తే పవన్ తనదైన రాజకీయంతో వైసీపీ అధినాయకత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. మొత్తానికి ఇది అన్నా చెల్లెళ్ల ఆస్తి కాదని రైతులు పరిశ్రమల కోసం ఇచ్చిన భూమి అని ఆయన చెప్పడం బట్టి చూస్తూంటే ఈ భూముల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ పూర్తి సీరియస్ గా ఉన్నారని అర్ధం అవుతోంది.
నిజానికి వైసీపీ అధినాయకత్వం తమ కుటుంబ వివాదాలను బయట వేసుకోవడం వల్లనే ఇపుడు ఒక ఆయుధం కోరి ఇచ్చినట్లు అయింది అని అంటున్నారు. రానున్న రోజులలో సరస్వతి భూముల విషయంలో కూటమి ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. అయితే పవన్ అన్న దాంట్లో ఒక మాట కూడా గమనించాలి. మాట ఇచ్చినట్లుగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇబ్బంది లేదు అని అన్నారు.
ఉపాధిని యువతకు ఇస్తే ఫరవాలేదు కానీ అలా కాకుండా భూములను తీసుకుని ఏమీ చేయకుండా పంచుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ కి సరైన సమయంలో పవన్ ఝలక్ ఇచ్చారని అంటున్నారు.