Begin typing your search above and press return to search.

టార్గెట్ బాబు...పవన్ విషయంలో అలా...?

వైసీపీ అధినేత నోటి వెంట పాపం పవన్ అన్న మాట రావడం అంటే రాజకీయంగా కొంత చర్చకు తావిస్తోంది.

By:  Tupaki Desk   |   15 Sep 2024 3:40 AM GMT
టార్గెట్ బాబు...పవన్ విషయంలో అలా...?
X

వైసీపీ అధినేత నోటి వెంట పాపం పవన్ అన్న మాట రావడం అంటే రాజకీయంగా కొంత చర్చకు తావిస్తోంది. జగన్ తన టార్గెట్ ని చంద్రబాబు మీదనే మళ్ళించారు అని అంటున్నారు. టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని నమ్ముతున్నట్లుగా వైసీపీ అధినాయకత్వం తీరు ఉంది.

అందుకే జనసేనను పెద్దగా విమర్శించకుండా వ్యూహాత్మకమైన వైఖరితో ముందుకు సాగాలని అనుకుంటోందని అంటున్నారు. టీడీపీకి బలమైన సామాజిక వర్గం నుంచి కానీ పవన్ నుంచి కానీ మద్దతు లేకపోతే ఈ విజయం అసలు లభించదని కూడా వైసీపీ నేతలు అంటున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం పవన్ విషయంలో ఏమీ అనవద్దని పార్టీకి కూడా సూచనలు కూడా వెళ్ళాయని అంటున్నారు. పిఠాపురం వెళ్ళిన జగన్ పవన్ మీద గట్టిగానే విమర్సలు చేస్తారని అంతా భావించారు. ఎందుకంటే పిఠాపురం పవన్ సొంత నియోజకవర్గం. పైగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.

మామూలుగా అయితే వైసీపీ పవన్ ని కూడా గట్టిగా టార్గెట్ చేసేదే. ఎందుకంటే గత ఎన్నికల ముందు అదే తీరు కనిపించేది. పైగా చంద్రబాబు కంటే కూడా పవన్ నే పట్టుకుని అనేక విమర్శలు చేసేది. ఇపుడు సాక్షాత్తు అధినేత జగన్ పిఠాపురం వెళ్ళినా పవన్ ని పల్లెత్తు మాట అనకపోగా పాపం పవన్ అని సానుభూతి చూపించడంలో పరమార్ధం ఏమై ఉంటుంది అన్నదే చర్చగా ఉంది.

అయితే రాజకీయంగా బాబుని ఒంటరిని చేసే మాస్టర్ ప్లాన్ లో ఇది భాగమని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో బీజేపీని పక్కన పెట్టి ఒక్క టీడీపీనే వైసీపీ విమర్శించేది. చివరికి టీడీపీ బీజేపీల మధ్య కటీఫ్ అయింది దాని ఫలితంగా వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చింది.

ఇపుడు కూడా అదే రకం స్ట్రాటజీని ప్లే చేయాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. అయితే జనసేన మాత్రం టీడీపీతోనే ఉంటుంది అని అంటున్నారు. పవన్ కి రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యమని కూడా అంటున్నారు. కానీ ఇది ఫక్తు రాజకీయం. ఎవరెన్ని చెప్పినా పరిస్థితులు ఇవాళ ఉన్నట్లుగా రేపు ఉండవు. అందువల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. పైగా కూటమిలో బీజేపీ కూడా ఉంది. టీడీపీ బీజేపీల మధ్య ఏమైనా గ్యాప్ వచ్చినా కూడా దాని ప్రభావం కచ్చితంగా జనసేన మీద కూడా పడుతుంది అని అంటున్నారు.

మొత్తానికి వైసీపీ అయితే ఒక క్లారిటీతో ఉంది అని అంటున్నారు. పవన్ మీద విమర్శలు చేయకూడదు అన్నదే ఆ స్పష్టత. ఇప్పటికే మోడీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీని కానీ వైసీపీ ఏమీ అనకుండా జాగ్రత్త పడుతోంది. జనసేనను అలాగే ఉంచి టీడీపీని చంద్రబాబునే టార్గెట్ చేసుకోవాలని ఏపీ పాలనలో జరిగే లోపాలు ఆ తప్పులు తడకలూ అన్నీ కూడా బాబు ఖాతాలోనే వేయాలని వైసీపీ నిర్ణయించుకుంది అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ఎత్తులకు టీడీపీ పై ఎత్తులు ఎలా ఉంటాయో.