జగన్ మాస్ డైలాగ్స్ తో రచ్చ చేస్తున్నారా ?
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తన సహజ ధోరణికి వ్యతిరేకంగా ఈ మధ్య మాస్ ని ఎట్రాక్ట్ చేసేందుకు చూస్తున్నారు.
By: Tupaki Desk | 8 March 2025 4:00 PM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తన సహజ ధోరణికి వ్యతిరేకంగా ఈ మధ్య మాస్ ని ఎట్రాక్ట్ చేసేందుకు చూస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా యుగం కాబట్టి తాను అన్న మాటలు వైరల్ అయ్యే విధంగా జగన్ చూసుకుంటున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. మాస్ ని ఫుల్ గా ఆకర్షించేలా జగన్ చూస్తున్నారు అని అంటున్నారు.
అదే సమయంలో జగన్ కి సంబంధించిన కంటెంట్ రైటర్ ఏమైనా మారారా అన్న చర్చ కూడా సాగుతోంది. పవన్ ని పట్టుకుని మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యావని అనడం, జీవిత కాలంలో ఇదే మొదటిసారి అని సెటైర్లు పేల్చడంతో అవి జనంలోకి వెళ్ళి బాగానే పేలాయని అంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ 2019లో సొంతంగా పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు. అలా ఒంటరిగా బరిలోకి దిగితే గెలిచే సత్తా లేదని భావించే 2024 ఎన్నికల్లో కూటమి కట్టి పవన్ తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. తాను కూడా మొదటిసారి అలా ఎమ్మెల్యే అయ్యారు.
ఏపీలో రెండు బలమైన సామాజిక వర్గాలను ఒక చోట చేర్చి కమ్మ కాపు కాంబినేషన్ ని రాజకీయ తెర మీదకు తెచ్చి పవన్ కళ్యాణ్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. నిజానికి ఈ కాంబినేషన్ అరుదైనది అని చెప్పాలి. అది వర్కౌట్ అయ్యేలా చేసి జగన్ ని మట్టికరిపించారు కూడా.
మరో వైపు చూస్తే జగన్ 2024 ఎన్నికల్లో పవన్ ని గట్టిగానే టార్గెట్ చేశారు. దాని వల్ల పవన్ వెనక ఉన్న బలమైన కాపు సామాజిక వర్గం అంతా వైసీపీకి యాంటీ అయిపోయారు. వారంతా కలసి టీడీపీ కూటమికి ఓట్లు అన్నీ గుద్ది పారేశారు.
ఇపుడు చూస్తే వైసీపీ ఓటమి చెంది దాదాపుగా పది నెలలు దగ్గర అవుతోంది. పవన్ విషయంలో జగన్ తన వ్యూహాన్ని మార్చారా అన్నది కూడా కొత్తగా చర్చకు వస్తోంది. పవన్ వెనక ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఆయనకు దూరం చేయడం, ఆ సామాజిక వర్గంలో ఆయనను చెడ్డ చేయడం వంటివి చేయాలని చూస్తున్నారు.
ఇటీవల పవన్ అసెంబ్లీలో మాట్లాడుతూ టీడీపీ కూటమి ఏపీలో మరో పదిహేనేళ్ళ పాటు అధికారంలో ఉండాలని బలంగా కోరుకున్నారు. దీని అర్ధం ఏపీలో టీడీపీతో కలసి ఓట్లూ సీట్లూ పంచుకుని ముఖ్యమంత్రి పీఠం మాత్రం టీడీపీకే వదిలేయాలన్నది పవన్ ఆలోచనగా ఉందని కాపులకు చెప్పడమే వైసీపీ వ్యూహం కావచ్చు అని అంటున్నారు
అంటే మరో 15 ఏళ్ళ పాటు కాపు సామాజికవర్గం టీడీపీ మీదనే ఆధారపడి రాజకీయం చేయాలన్నది పవన్ చెప్పకనే చెబుతున్నారు అన్నది వైసీపీ జనంలోకి తీసుకెళ్ళాలని అనుకుంటోంది. వైసీపీలో అయితే పవన్ ని జగన్ టార్గెట్ చేయవద్దు అని అంటున్నా సరే ఆయన చేస్తూనే ఉన్నారు.
అయితే జగన్ తొమ్మిది పది నెలలు ఆగిన తరువాతనే పవన్ మీద విమర్శలు మొదలెట్టారు. దానికి కారణం కూడా ఉందని అంటున్నారు. ఈ మధ్య కాపులలో కూడా కొంత మార్పు వచ్చిందని అంటున్నారు. పవన్ కూడా అధికారం కోసం టీడీపీని చంద్రబాబుని పొగుడుతూ వస్తున్నారని అంటున్నారు. టీడీపీ పెద్దన్న వైఖరికి పవన్ తలొగ్గుతున్నారని కూడా విమర్శలు కాపు సామాజిక వర్గంలో వినిపిస్తున్నాయి.
ఈసారి ఏపీలో టీడీపీ రావడం వెనక పవన్ తో పాటు బలమైన కాపు సామాజిక వర్గం కూడా ఉంది. మరి వారి ఆశలు తీర్చేలా ముఖ్యమంత్రి పదవి షేరింగ్ లో అయినా దక్కితే వారిలో అసంతృప్తి ఉండదు. అలా కాకుండా జూనియర్ పార్టనర్ గా జనసేన కూటమిలో ఉంటే మాత్రం కాపులలో ఆలోచనలు మారుతాయనే అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జగన్ కూడా మారుతున్న రాజకీయ సామాజిక సమీకరణలను ఆసరాగా చేసుకునే పవన్ మీద విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.
ఏదో విధంగా పవన్ ని కూటమి నుంచి వేరు చేయడమే లక్ష్యంగా చేసుకుని వైసీపీ పనిచేస్తోందని అంటున్నారు. అది సాధ్యపడితే వైసీపీకి పొలిటికల్ ఫ్యూచర్ అదుర్స్ అన్నట్లుగా ఉంటుంది. అలా కాకపోయినా కాపులలో అసంతృప్తిని రెచ్చగొట్టినా కూడా తమకు అంతా అనుకూలిస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే కనుక జగన్ ఫుల్ మాస్ డైలాగ్స్ తో పవన్ ని అయినా టీడీపీ కూటమిని అయినా ఎదుర్కోవాలని చూస్తున్నారు.