Begin typing your search above and press return to search.

పుంగనూరుకు జగన్...ఏం జరగనుంది...?

ముక్కుపచ్చలారని ఒక పసి బాలికను ఇంత దారుణంగా హత్య చేసి సమ్మర్ స్టోరేజి ట్యాంకులో ఎవరు పడవేశారు.

By:  Tupaki Desk   |   6 Oct 2024 4:39 PM GMT
పుంగనూరుకు జగన్...ఏం జరగనుంది...?
X

వైసీపీ అధినేత మాజీ సీఎం ఈ నెల 9న చిత్తూరు జిల్లా పుంగనూరు టూర్ పెట్టుకున్నారు. పుంగనూరులో కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక అస్పియా అంజుమ్ సమ్మర్ స్టోరేజి ట్యాంకులో శవమై తేలడం అన్న సంఘటన ఏపీ మొత్తంలో అతి పెద్ద సంచలనంగా మారింది. ముక్కుపచ్చలారని ఒక పసి బాలికను ఇంత దారుణంగా హత్య చేసి సమ్మర్ స్టోరేజి ట్యాంకులో ఎవరు పడవేశారు. మరీ ఇంత కర్కశంగా పగలు ఉంటాయా అన్నది అంతా షాక్ తినేలా సాగింది.

ఈ ఘటన తరువాత వైసీపీకి చెందిన మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి వెళ్ళి బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనలో ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని దర్యాప్తు చేయలేదని కూడా వారు మండిపడ్డారు. జగన్ ఈ నెల 9న పుంగనూరు వచ్చి పరామర్శిస్తారు అని ప్రకటించారు.

ఇక జగన్ ఈ నెల 9న బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో పుంగనూరు కి వచ్చి బాలిక కుటుంబాన్ని పరామర్శిస్తారు అని కూడా వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే పుంగనూరు ఘటన విషయంలో వైసీపీ నేతల కామెంట్స్ ని చూసిన మీదట టీడీపీ అలెర్ట్ అయింది. ఆదివారం హోం మంత్రి అనిత ఇతర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఫరూక్ వెళ్లారు.అక్కడికి స్వయంగా వెళ్ళి బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. అంతే కాదు, బాలిక కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు ఫోన్ ద్వారా పరామర్శించారు.

అంతేకాదు ఈ ఘటనలో నిందితులను కూడా గుర్తించామని ఈ కేసుని చేదిస్తామని చంద్రబాబు హోం మంత్రి అనిత చెప్పారు. ఈ వ్యవహారంలో ఐదుగురు అనుమానితులను గుర్తించామని వెల్లడించారు. అంతే కాదు వైసీపీ ఎపుడూ రాజకీయాలు మాత్రమే చేస్తుందని కూడా ఫైర్ అయ్యారు.

మొత్తం మీద చూస్తే ఈ కేసు విషయంలో నిందితులను గుర్తించడం తో పాటు తొందరగా కేసుని ఒక కొలిక్కి తెచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టింది. దీంతో జగన్ పుంగనూరు టూర్ మీద ఇపుడు సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.

జగన్ కూడా బాధిత కుటుంబాన్ని కలుస్తారు. వారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. అయితే అప్పటిలోగా నిందితులను కూడా మీడియా ముందు పెట్టడానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంటున్నారు. మొత్తానికి వైసీపీకి ఏ ఒక్క చాన్స్ ఇవ్వడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు అని అంటున్నారు.

అయితే జగన్ పుంగనూరు టూర్ లో టీడీపీ కూటమి ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతారని వరసబెట్టి నాలుగు నెలలలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తారని అంటున్నారు. జగన్ గత నెల చివరిలో తిరుమల టూర్ పెట్టుకున్నారు. అయితే ఆయన టూర్ నేపధ్యంలో నిరసనలు వ్యక్తం కావడంలో ఆగిపోయారు. ఇపుడు పుంగనూరు టూర్ విషయంలో ఏమి జరుగుతుంది అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి వైసీపీ వర్సెస్ టీడీపీ గా ఏపీలో ఏ చిన్న ఘటన జరిగినా ఇష్యూ అవుతోంది అని అంటున్నారు.