Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్ర రిపేర్లలో జగన్ బిజీ

ఉత్తరాంధ్ర కు చెందిన మూడు కీలక జిల్లాలకు చెందిన పార్టీ నేతలను ఆయన పిలిచి సమీక్షా సమావేశం నిర్వహించారు.

By:  Tupaki Desk   |   20 Sep 2024 2:30 AM GMT
ఉత్తరాంధ్ర రిపేర్లలో జగన్ బిజీ
X

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఉత్తరాంధ్ర కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. దాంతో వైసీపీ అధినేత జగన్ పోయిన చోటనే వెతుక్కోవాలని ఆలోచంతో రిపేర్లు మొదలెట్టారు. ఉత్తరాంధ్ర కు చెందిన మూడు కీలక జిల్లాలకు చెందిన పార్టీ నేతలను ఆయన పిలిచి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష్యులు పార్లమెంటరీ పార్టీ పరిశీలకుల పదవులను కూడా వైసీపీ అధినేత భర్తీ చేశారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా మరోసారి ధర్మాన క్రిష్ణదాస్ కే జగన్ చాన్స్ ఇచ్చారు. క్రిష్ణదాస్ వైసీపీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా అత్యధిక కాలం పనిచేసిన నేతగా ఉన్నారు. పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆయనకే పగ్గాలు దక్కుతూ ఉన్నాయి.

మధ్యలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మాత్రం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, అలాగే తమ్మినేని సీతారాం కి చాన్స్ ఇచ్చారు. ఇపుడు మరోసారి క్రిష్ణదాస్ కే పట్టం కట్టారు. జగన్ అంటే అత్యధిక ప్రేమాభిమానాలు విధేయత చూపించే క్రిష్ణదాస్ అంటే జగన్ అదే తీరున రియాక్ట్ అవుతారు. సౌమ్యుడిగా ఉంటూ అందరినీ కలుపుకుని పోయే క్రిష్ణదాస్ వైసీపీతోనే తన రాజకీయ జీవితం అని చెప్పేసారు. జగన్ కూడా ధర్మాన సోదరుల ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చినా క్రిష్ణదాస్ కి మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి స్పెషాలిటీ చూపించారు.

ఇక రానున్న అయిదేళ్లూ శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మీద పోరాటం చేస్తూ పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత క్రిష్ణదాస్ దే. ఇక పార్టీలోనే అందరూ ఉండేలా చురుకుగా పనించేసేలా చూసే బిగ్ టాస్క్ ఆయనదే. అంతేకాదు తన సోదరుడు ప్రసాదరావు తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యేలా చూడాల్సింది ఆయనే.

మరో వైపు శ్రీకాకుళం జిల్లా కార్పొరేషన్ కి ఎన్నికలు వేరేగా వస్తాయా లేక 2026లో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో వస్తాయా అన్నది తెలియదు కానీ వైసీపీ జెండా కార్పోరేషన్ మీద ఎగరేయాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉంది.

ఇక విజయనగరం జిల్లా పగ్గాలు మరోసారి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు జగన్ అప్పగించారు. ఆయన దూకుడు కలిగిన నేతగా జగన్ గుర్తించారు. అంతే కాదు బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ప్లస్ పాయింట్. వీటికి మించి జగన్ పట్ల విధేయత మరో ప్లస్ పాయింట్. సో ఆయనకే పగ్గాలు అందిస్తే ఫ్యాన్ పార్టీ సేఫ్ గా ఉంటుందని భావించారు అని అంటున్నారు.

ఇక పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా శత్రుచర్ల పరీక్షిత్ రాజుని నియమించారు. ఈయన మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి భర్త. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు కుమారుడు. ఆయనకే గతంలో కూడా పార్టీ పగ్గాలు అప్పగించారు. ఇపుడు ఆయననే కంటిన్యూ చేస్తున్నారు. పీడిక రాజన్న దొరకు ఈ బాధ్యతలు ఇస్తారని అనుకున్నా యువ రక్తం కోసం పార్టీ ఈ డెసిషన్ తీసుకుంది అని అంటున్నారు. మరి పీడిక రాజన్న దొర సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటారు అన్నది చూడాలి

విశాఖ, అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాల అధ్యక్షులను కూడా నియమించాల్సి ఉంది. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లేదా మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇదారూ ఓసీ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో వీరిలో ఎవరికి ఇస్తారు అన్నది చూడాలి.

అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కరణం ధర్మశ్రీ ఉంటున్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యే. ఆయన ప్లేస్ లో మాడుగులకు చెందిన మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడుకు ఇస్తారని అంటున్నారు. ఆయన వెలమ సామాజిక వర్గం నేత. బీసీ నాయకుడు. దాంతో ఆయన వైపు పార్టీ మొగ్గు చూపుతోంది అని అంటున్నారు. అల్లూరి జిల్లాకు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె ప్లేస్ లో మార్పు చేస్తే మరో ఎవరికి ఈ పదవి దక్కుతుందో చూడాల్సి ఉంది. అరకు లేదా పాడేరు ఎమ్మెల్యేల పేర్లు కూడా జిల్లా ప్రెసిడెంట్ పదవికి పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు.