జగన్ పక్కన చోటున్నది ఎవరికి ?
వైసీపీ అధినేత జగన్ కి సన్నిహితులు ఎవరు అన్నది కూడా మరో చర్చగా ముందుకు వస్తోంది. తన తాత తండ్రి కాలం నుంచి తనతో పాటు నడచిన విజయసాయిరెడ్డి వీడిన తరువాత మరో ప్రశ్న
By: Tupaki Desk | 14 March 2025 5:00 AM ISTజగన్ వైఎస్సార్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సమయంలో వైఎస్సార్ ని ఆయనలో చూసుకున్నారు. వైఎస్సార్ ని ఎంతగానో అభిమానించే వారు అంతా జగన్ తోనే తమ రాజకీయ జీవితం అనుకున్నారు. అయితే ఆ తరువాత చాలా మంది దూరం అయ్యారు కూడా. వైఎస్సార్ వేరు జగన్ వేరు అనుకున్న వారు కూడా ఉన్నారు. నిజానికి ఏ తండ్రీ కొడుకుల మధ్య పోలికలు పూర్తిగా ఉండాలని లేదు. ఎవరి స్టైల్ వారిది. అయితే వైఎస్సార్ తో ఉన్న వారు అంతా ఆయన సమకాలీనులు.
ఆయన వయసు కలిగి ఉన్న వారు అందువల్ల వారికి జగన్ తో కలసి ముందుకు సాగడం కూడా కొంత ఇబ్బందిగా కావచ్చు. అందుకే వారంతా కాంగ్రెస్ లోనే ఉన్నారు. లేని వారు తమ సమకాలీనుడు అయిన బాబుతో టీడీపీతో పొలిటికల్ ట్రావెల్ ని సాగించారు. ఇదిలా ఉంటే ఏ నాయకుడికి అయినా పక్కన నెంబర్ టూ అనో లేక తమ కోటరీ అనో నేతలు ఉంటారు.
వీరినే సన్నిహితులు అని కూడా అంటారు. అలా ఏ రాజకీయ పార్టీకైనా నాయకులు కొందరు అధిపతుల వెనకాల ఉంటారు. మరి వైసీపీలో చూస్తే జగన్ పక్కన అలాంటి నాయకులు ఉన్నారా అసలు జగన్ పక్కన చోటు వారికి ఉందా నంబర్ టూ అన్నది వైసీపీలో అచ్చి వస్తుందా రాదా అన్నది కూడా చర్చగా ఉంది.
ఇదంతా ఎందుకంటే జగన్ కి తలలో నాలుకగా వ్యవహరించిన వారు విజయసాయిరెడ్డి. ఆయన నంబర్ టూగానే ఒక వెలుగు వెలిగారు. ఆయన వైసీపీ నుంచి బయటకు వస్తారని ఎవరూ కలలో కూడా అనుకోని ఉండరు. అలాంటిది విజయసాయిరెడ్డి బయటకు రావడం అంటే రాజకీయాలు ఇలాగే ఉంటాయని అనిపించకమానదు. అదే సమయంలో వైసీపీలో ఏమి జరుగుతోంది అన్న కొత్త చర్చ కూడా ఏర్పడకమానదు.
వైసీపీ అధినేత జగన్ కి సన్నిహితులు ఎవరు అన్నది కూడా మరో చర్చగా ముందుకు వస్తోంది. తన తాత తండ్రి కాలం నుంచి తనతో పాటు నడచిన విజయసాయిరెడ్డి వీడిన తరువాత మరో ప్రశ్న ఏంటి అంటే జగన్ ని అట్టిపెట్టుకొని ఉండేవారు ఎవరూ లేరా అన్నది. విజయసాయిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. వివాహ బంధాలే తెగిపోతున్న ఈ రోజులలో తమ బంధాలు ఏపాటివి అని.
కానీ అంతకంటే దృఢంగా బంధాలు పెనవేసుకున్నవి కూడా ఎన్నో ఉన్నాయి. దశాబ్దాల తరబడి వైఎస్సార్ కేవీపీల మధ్య బంధం అలాగే నిలిచింది అని గుర్తు చేస్తున్న వారు ఉన్నారు. అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా కలసిమెలసి పోయే నాయకులు దేశంలో చాలా మంది ఉన్నారు. బీజేపీలో వాజ్ పేయ్ అద్వానీ, మోడీ అమిత్ షాల మధ్య స్నేహ బంధం ఎంతో గొప్పది అని అంతా అంటారు.
ఇక్కడ బంధాలు నిలవాలి అంటే రెండు వైపులా బాధ్యత ఉండాలి. దాని కంటే ముందు అధినాయకుడికే ఎక్కువ బాధ్యత ఉండాలని కూడా అంటారు. ఆ విధంగా చూస్తే తన పక్కన చోటిచ్చి నిలుపుకోలేకపోవడం జగన్ వైపు నుంచి ఉన్న బలహీనత అన్నది కూడా చర్చకు వస్తోంది. తన ఆలోచనతోనే ట్యూనప్ అయిన వారిని సాగినంత కాలం కొనసాగించడం తేడా వస్తే వారు వెళ్ళిపోయినా చూసీ చూడనట్లుగా ఉండడం ఏ నాయకుడికి అయినా తగని పని అని అంటున్నారు.
ఇక వైసీపీ విషయంలో నంబర్ టూ వద్దు అని అంటున్న వారూ ఉన్నారు. నంబర్ టూ అంటే ఏదో నాటికి తలుపులు తెరచుకుని బయటకు పోవడమే అని అంటున్నారు. దానికి ఎంతో మందిని ఉదహరిస్తున్నారు. జగన్ వైపు నుంచి చూస్తే ఆయన ఆంతరంగీకులు అన్న వారు నంబర్ టూ దాకా వస్తున్నారా లేక నంబర్ టెన్ తరువాత ప్లేస్ లోనే ఉంటున్నారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు.
రాజకీయాలు అంటే జనంతో చేసేవి. జనాలు అన్నీ గమనిస్తూంటారు. వారికి మంచి పాలన అందించినా నాయకుడి గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటారు. దివంగత నాయకుడు ఎన్టీఆర్ విషయంలో ఆయన ద్వితీయ వివాహం విషయంలో ఎంత రచ్చ మూడు దశాబ్దాల క్రితం జరిగిందో అంతా చూశారు. అది చివరికి ఆయన పదవికీ ఆయన నిండు జీవితానికి ఎసరు తెచ్చింది అని గుర్తు చేస్తున్నారు.
అంతే కాదు ఎన్టీఆర్ అందరినీ నమ్మేస్తారని ఆయనకు అందుకే జీవితంలో రెండు సార్లు వెన్నుపోట్లు జరిగాయని కూడా అప్పటికీ ఇప్పటికీ సెటైరికల్ గా చెప్పుకుంటారు. గుడ్డిగా నమ్మడం ఎన్టీఆర్ బలహీనత అయితే అందరినీ పూర్తిగా నమ్మక పోవడం జగన్ బలహీనతగా ఉందా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఏది ఏమైనా మరోసారి విజయసాయి రెడ్డి మీడియా ముందుకు రావడంతో ఏపీలో పాలిటిక్స్ లో జగన్ కి సరికొత్త ప్రత్యర్థిగా ఆయన కూడా ఉంటారా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి.