Begin typing your search above and press return to search.

మళ్లీ నోరు జారిన జగన్‌!

తాజాగా విజయవాడ రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను పరామర్శించిన జగన్‌ నోరు జారారు.

By:  Tupaki Desk   |   5 Sep 2024 7:44 AM GMT
మళ్లీ నోరు జారిన జగన్‌!
X

ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. వై నాట్‌ 175 అంటూ ఊరూవాడా వెలుగెత్తిన ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ తన పార్టీ కేవలం 11 స్థానాలకే కుదేలు కావడంతో ఒక పట్టాన జీర్ణించుకోలేకపోయారు. ఈవీఎంల మోసాల వల్లే తాము ఓడిపోయామంటూ సరికొత్త పల్లవిని అందుకున్నారు. 2019లో 151 సీట్లతో తాను గెల్చినప్పుడు తన ఘనత అని గొప్పగా చెప్పుకుని.. 2024లో ఓడిపోతే ఈవీఎంలపైకి నెపాన్ని నెట్టేయడంపై జగన్‌ పై విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు మరోసారి వైఎస్‌ జగన్‌ విమర్శలపాలయ్యారు. ట్రోలర్స్‌ కు లక్ష్యంగా మారారు. విజయవాడలో వరద బాధితులను పరామర్శించిన ఆయన ట్రోలర్స్‌ కు చిక్కారు. బుడమేరు కాలువను బుడమేరు నది అని జగన్‌ పేర్కొనడం విశేషం. సీఎం చంద్రబాబు తన ఇల్లు మునగకుండా బుడమేరు నది గేట్లు ఎత్తారని జగన్‌ అన్నారు. దీంతో జగన్‌ కు నదికి, కాలువకు తేడా తెలియదని టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అలాగే బుడమేరుకు గేట్లు లేవని.. ఆ సంగతి కూడా తెలియకుండా జగన్‌ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసింది. అలాగే ట్రోలర్స్‌ సైతం బుడమేరును జగన్‌ నది అని పేర్కొనడంపై ట్రోల్‌ చేస్తున్నారు.

ఇది చాలదన్నట్టు జగన్‌ మరోసారి టంగ్‌ స్లిప్‌ అయ్యారు. తద్వారా మరోసారి ట్రోలర్స్‌ కు చిక్కారు. తాజాగా విజయవాడ రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను పరామర్శించిన జగన్‌ నోరు జారారు.

మే 13న ఎన్నికల ఫలితాలు వచ్చాయని.. అప్పటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని జగన్‌ వ్యాఖ్యానించారు. ఆయన పాలనలో తీవ్రంగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. దీంతో జగన్‌ ట్రోలర్స్‌ కు చిక్కారు.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న వచ్చాయి. జూన్‌ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జగన్‌ మే 13నే ఎన్నికల ఫలితాలు వచ్చాయని.. అప్పటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీతోపాటు ట్రోలర్స్‌ జగన్‌ ను లక్ష్యం చేసుకున్నారు.

విజయవాడ వరదలు ముమ్మాటికి మానవ తప్పిదమేనని జగన్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట దగ్గర చంద్రబాబు నివాసం మునిగిపోకుండా ఉండటానికి బుడమేరు వరదలు తెప్పించారని జగన్‌ ఆరోపిస్తున్నారు. దీంతో విజయవాడలోని పల్లపు ప్రాంతాలు మునిగాయని ఆయన విమర్శిస్తున్నారు. ఆయన ఆరోపణలను టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. భారీ వర్షాలతో కృష్ణానదికి, ఇతర వాగులు, వంకలకు భారీ నీటి ప్రవాహం రావడం వల్లే వరదలు వచ్చాయని చెబుతోంది.