జగన్ టూర్ లో బొత్స మిస్ ?
మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయనగరం జిల్లా పర్యటన చేశారు. ఆయన చాలా కాలం తరువాత జిల్లాకు వచ్చారు.
By: Tupaki Desk | 25 Oct 2024 3:55 AM GMTమాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయనగరం జిల్లా పర్యటన చేశారు. ఆయన చాలా కాలం తరువాత జిల్లాకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మొదట్లో జిల్లాకు వచ్చిన జగన్ ఇపుడు 2024 ముగుస్తున్న నేపధ్యంలో మరోసారి వచ్చారు. గుర్ల మండలంలో అతిసార వ్యాధితో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించడానికి జగన్ ఈ టూర్ పెట్టుకున్నారు.
జగన్ జిల్లా పర్యటనకు వచ్చినపుడు ఆయన వెంట జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ మజ్జి శ్రీనివాసరావు తో పాటు ఇతర నాయకులు ఉన్నారు. అయితే జిల్లాకే పెద్ద దిక్కు శాసనమండలిలో విపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ మాత్రం కనిపించకపోవడం గమనార్హం అని అంటున్నారు.
జగన్ తన సొంత జిల్లాకు వస్తే బొత్స ఎందుకు పక్కన లేరు అన్నదే అంతా చర్చించుకుంటున్నారు. బొత్స ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయ్యారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని జగన్ ఇచ్చారు. ఆ తరువాత కేబినేట్ ర్యాంక్ హోదా కలిగిన మండలి అపొజిషన్ లీడర్ గా కూడా చాన్స్ ఇచ్చారు.
బొత్స కూడా తరచూ మీడియా సమావేశాలు పెడుతూ టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక బొత్సను జగన్ ఉభయగోదావరి జిల్లాలకు రీజనల్ కో ఆర్డినేటర్ గా కూడా నియమించారు. మరి జగన్ టూర్ లో ఆయన ఎందుకు లేరు అన్నదే చర్చకు వస్తోంది.
ఉత్తరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డిని నియమించడం పట్ల బొత్స అసంతృప్తిగా ఉన్నారు అని అంటున్నారు. అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ జగన్ టూర్ లో ఎక్కడా బొత్స కనిపించలేదు. అంతే కాదు జగన్ విశాఖ పర్యటనలో సైతం మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆయనను కలిశారు కానీ అక్కడ కూడా బొత్స కనిపించకపోవడం పట్ల చర్చ అయితే సాగుతోంది. దాంతో అసలు వైసీపీలో ఏమి జరుగుతోంది అన్నది కూడా పెద్ద చర్చగానే ఉందిపుడు.
బలమైన సామాజిక వర్గానికి చెందిన బొత్స ఉత్తరాంధ్రా జిల్లాలలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయనది మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం. ఆయనను అందుకే జగన్ వైసీపీలో గౌరవించి అయిదేళ్ల పాటు మంత్రిగా ఉండేలా చూశారు. పార్టీ ఒడింది, ఎందరో నాయకులకు పదవులు లేకుండా పోయాయి. కానీ బొత్సకు మాత్రం ఎమ్మెల్సీ రూపంలో పదవి దక్కింది. మరి బొత్సకు పార్టీకి మధ్య ఏదైనా గ్యాప్ ఉందా అన్నదే కూడా అంతా అనుకుంటున్నారు. ఏది ఏమైనా అధినేత జిల్లాకు వచ్చినపుడు బొత్స మిస్ కావడం మాత్రం హాట్ టాపిక్ గా ఉంది అని అంటున్నారు.