Begin typing your search above and press return to search.

చంద్రబాబు నీ పోలీస్ సెక్యూరిటీ తగ్గించేస్తా.. : మాజీ సీఎం జగన్ హెచ్చరిక

గుంటూరు మిర్చియార్డులో మాజీ ముఖ్యమంత్రి జగన్ రైతులను పరామర్శించారు. అయితే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న తనకు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదని ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు.

By:  Tupaki Desk   |   19 Feb 2025 9:46 AM GMT
చంద్రబాబు నీ పోలీస్ సెక్యూరిటీ తగ్గించేస్తా.. : మాజీ సీఎం జగన్ హెచ్చరిక
X

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించేందుకు వెళ్లిన తనకు సెక్యూరిటీ ఇవ్వకపోవడంపై జగన్ మండిపడ్డారు. ఎళ్లకాలం టీడీపీ కూటమి అధికారంలో ఉండదని, తాము అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించేస్తానని హెచ్చరించారు. మిర్చిరైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపించారు. గుంటూరు మిర్చియార్డులో రైతులతో మాట్లాడిన జగన్.. అనేక విషయాలపై వైసీపీ ప్రభుత్వానికి కూటమి సర్కారుకు మధ్య తేడాను వివరించారు.

గుంటూరు మిర్చియార్డులో మాజీ ముఖ్యమంత్రి జగన్ రైతులను పరామర్శించారు. అయితే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న తనకు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదని ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. తన పర్యటనలో పోలీసులు ఎక్కడా కనిపించలేదని, భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని, ప్రభుత్వం కావాలనే తన సెక్యూరిటీపై నిర్లక్ష్యం చేస్తోందని మాజీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతుల సమస్యలను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సివుంటుందని కూడా హెచ్చరించారు. జగన్ పర్యటనతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.

కాగా, రైతు సమస్యలపై మాజీ సీఎం జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో క్వింటా మిర్చికి రూ.21 వేల నుంచి రూ.27 వేల ధర పలికేదని గుర్తు చేశారు. కేవలం ఏడాది సమయంలోనే ధర సగానికి సగం పడిపోయిందని, ప్రస్తుతం క్వింటా మిర్చికి రూ.12 వేలు మాత్రమే పలుకుతోందని చెప్పారు. మరోవైపు పంట దిగుబడి తగ్గిపోవడం, సాగు వ్యయం పెరిగిపోవడం వల్ల రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో ఆర్బీకే విధానం ద్వారా రైతులకు మెరుగైన సౌకర్యాలు అందజేశామని, ప్రస్తుతం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల దళారులు పెరిగిపోయారని ఆరోపించారు. ఎరువులు, విత్తనాలను బ్లాక్ చేస్తున్నారని, ప్రైవేటు వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారని, ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి, సచివాలయానికి దగ్గరలోనే మిర్చియార్డు ఉన్నా రైతుల సమస్యలను ఇబ్బందులను చూడటానికి రాలేదని నిష్టూరమాడారు.

రైతు సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన పెట్టుబడి సాయం రూ.20 వేలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి జగన్ వరుస పర్యటనలు వైసీపీలో నూతన ఉత్సాహాన్ని తెస్తున్నాయి. నిన్న విజయవాడ, ఈ రోజు గుంటూరుల్లో జగన్ పర్యటించారు. జగన్ వస్తున్నారని తెలిసి గుంటూరు మిర్చియార్డుకు వేలాదిగా ఆయన అభిమానులు తరలివచ్చారు. దాదాపు తొమ్మిది నెలలు తర్వాత జగన్ సమస్యలపై పోరాటానికి ప్రజల్లోకి రావడం, ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడం ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మిర్చి రైతుల సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు నిర్ణయించిందని సమాచారం.