హెలిప్యాడ్ వద్ద డీఎస్పీకి జగన్ వార్నింగ్?
జగన్ సమీప బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు పులివెందులలో జరిగాయి.
By: Tupaki Desk | 13 Jan 2025 4:56 AM GMTమాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం ఎలా ఉంటుందన్న విషయాన్ని తాజాగా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ స్వయంగా చూశారు. వైసీపీ నేతలు.. కార్యకర్తల విషయంలో డీఎస్పీ దూకుడు ప్రదర్శిస్తున్నారని.. ఆయన తీరుపై కంప్లైంట్ చేసిన నేపథ్యంలో జగన్ స్పందించారు. జగన్ సమీప బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు పులివెందులలో జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు.
తిరుగు ప్రయాణంలో భాగంగా హెలిప్యాడ్ కు చేరుకున్నారు. వివిధ కేసుల విచారణల్లో డీఎస్పీ దూకుడు ప్రదర్శిస్తున్నారని.. ఆయన తీరు ఏ మాత్రం బాగోలేదంటూ వైసీపీ నేతలు జగన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తన వద్దకు డీఎస్పీ మురళీ నాయక్ ను పిలిచారు. దీంతో.. ఇద్దరు ఇన్ స్పెక్టర్లతో కలిసి జగన్ వద్దకు వెళ్లిన ఆయన్ను.. ‘ఈ ప్రభుత్వం రెండు లేదా నాలుగు నెలల్లో మారిపోవచ్చు. ఆ తర్వాత మీ కథ ఉంటుంది’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.జాగ్రత్తగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
జగన్ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేస్తున్న వేళ.. డీఎస్పీతో పాటు మిగిలిన అధికారులు ఎవరూ కూడా మాట్లాడలేదు. మౌనంగా వింటూ ఉండిపోయారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి 41ఏ నోటీసు ఇచ్చి పలుమార్లు విచారించటం.. వీరిని డీఎస్పీ విచారిస్తూ వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేయటంపై వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. జగన్ సీరియస్ వ్యాఖ్యల నేపథ్యంలో అందరి ఎదుట ఈ బెదిరింపులు ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తమకు వ్యక్తిగతంగా ఎవరి మీదా ఎలాంటి కోపాలు ఎందుకు ఉంటాయని వారు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమ బాధ్యతలు నిర్వర్తిస్తుంటే.. ఇలాంటి వ్యాఖ్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.