డెడ్లీ కాంబోతో జగన్ కి అధికారం చిక్కేనా ?
ఈ ముగ్గురికీ ఉన్న సొంత ఇమేజ్ అలాగే రాజకీయ వ్యూహాలు సామాజిక బలాలు ఇతర అండదండలు అన్నీ కలసి కూటమిని ఎంతో బలోపేతం చేస్తున్నాయి.
By: Tupaki Desk | 2 Dec 2024 10:30 PM GMTకలసి ఉంటే కలదు సుఖం అని కూటమిలోని మూడు ప్రధాన పార్టీలూ ఆలోచన చేస్తున్నాయి. నరేంద్ర మోడీ, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ పొలిటికల్ గా చూస్తే ఏపీలో డెడ్లీ కాంబో గానే అంతా చూస్తున్నారు. ఈ ముగ్గురికీ ఉన్న సొంత ఇమేజ్ అలాగే రాజకీయ వ్యూహాలు సామాజిక బలాలు ఇతర అండదండలు అన్నీ కలసి కూటమిని ఎంతో బలోపేతం చేస్తున్నాయి.
కూటమిలో మోడీ బాబు పవన్ కాంబోని ఓడించడం కష్టమన్నది జగన్ కి రెండు సార్లు అర్థం అయింది. 2014, 2024 ఎన్నికల్లో అదే జరిగింది. 2019లో మాత్రమే విజయం దక్కింది. దానికి కారణం ఈ ముగ్గురూ విడిగా పోటీ చేయడం వల్లనే అని అంటున్నారు.
ఆనాడు మోడీకి బాబుకు మధ్య గ్యాప్ పెంచడంలో వైసీపీ సక్సెస్ అయింది. అలాగే పవన్ కూడా విడిగా పోటీ చేస్తే గెలుస్తామని ఆశించారు. ఇపుడు అంతా సర్దుకున్నారు. కలసి ఉంటేనే భారీ లాభమని కూడా గ్రహించారు. చంద్రబాబు అయితే తమ కాంబో ఎవర్ గ్రీన్ అంటున్నారు. ఎప్పటికీ ఇలాగే అని కూడా చాలా గట్టిగా చెబుతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ సైతం టీడీపీతోనే ఉంటూ బలం పెంచుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికిపుడు సీఎం అయిపోవాలన్న ఆశలు అయితే ఆయన పెట్టుకోవడం లేదని అంటున్నారు. మోడీకి కేంద్రంలో అధికారం ముఖ్యం. అంతే కాదు ఎన్డీయేకి ఏపీ నుంచి అత్యధిక శాతం మంది ఎంపీల మద్దతు కూడా అవసరం అని అంటున్నారు. ఏపీలో మరో టెర్మ్ కూడా అధికారం కోసం బీజేపీ చూడడం లేదు. బీజేపీ ఆలోచనలు అన్నీ తెలంగాణా మీదనే ఉన్నాయని అంటున్నారు.
సో అలా ఎవరి ఆలోచనలు అవసరాలు కూడా కూటమి మరింతగా గట్టి పడడానికి కారణం అవుతున్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ వెంట అపరిమితమైన అభిమాన గణం ఉంది. పైగా ఏపీలో బలమైన సామాజిక వర్గం ఉంది.వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తే ఆ పార్టీదే అధికారం అని కూడా ఎన్నో సార్లు రుజువు అయింది.
వారికి పవన్ సీఎం ఎప్పటికైనా అవుతారని ఆశ ఉంది. అందుకే రాజకీయంగా పవన్ ని వారు అట్టేబెట్టుకునే ఉంటారని అంటున్నారు. ఆ సామాజిక వర్గంలో పవన్ కి మించిన నేత కూడా లేరని అంటున్నారు. సో పవన్ కి అది అతి పెద్ద బలంగా ఉంటుంది.
తెలుగుదేశం పార్టీది నాలుగు దశాబ్దాల చరిత్ర. గ్రాస్ రూట్ లెవెల్ వరకూ విస్తరించి ఉన్న పార్టీ అది. ఆ పార్టీకి ఉన్న అతి పెద్ద బలం క్యాడర్. టీడీపీని క్యాడర్ బేస్డ్ పార్టీ అంటారు. టీడీపీ నుంచి ఎంతో మంది బిగ్ షాట్స్ బయటకు వెళ్లినా కూడా పార్టీ చెక్కుచెదరక పోవడానికి అదే కారణం. బీసీలు అత్యధిక శాతం ఈ రోజుకీ టీడీపీ వెన్నంటే ఉండడం మరో బలంగా ఉంది.
ఇక నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో పవర్ ఫుల్ ఇమేజ్ ఉన్న వారు. బలమైన నేతగా గుర్తింపు ఉంది. ఆయన కేంద్ర స్థాయిలో ఉంటూ కూటమిలో బీజేపీ ఉంటే కూటమి బలం వేయింతలు పెరుగుతుందని అంటారు. ఇది రెండు సార్లు ఇప్పటికి రుజువు అయింది. దాంతో 2029లో జరిగే ఎన్నికల్లో కానీ దాని కంటే ముందు జరిగే జమిలి ఎన్నికల్లో కానీ కూటమి ఒక్కటిగానే ముందుకు వస్తే మాత్రం 2024 ఫలితాలే రిపీట్ అవుతాయా అన్న సందేహం అందరిలో ఉంది.
ఎందుకంటే పార్టీలకు ఉన్న సామాజిక దన్ను, రాజకీయ సమీకరణలు అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి అంటున్నారు. అలా కాదని వైసీపీ వైపు టర్న్ తీసుకోవాలీ అంటే టీడీపీ కూటమి పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావాల్సిందే అని అంటున్నారు. మరి అది అలా ఇలా కాదు ఏకంగా సునామీ రేంజిలో రావాలి. అటువంటి పరిస్థితి ఉంటేనే తప్ప జగన్ కి చాన్స్ రాదని కూడా అంటున్నారు. మరి అంత తేలికగా కూటమి జగన్ కి చాన్స్ ఇస్తుందా అన్నది చూడాలి.
అంటే అన్నేసి తప్పులు చేసే విధంగా పాలన చేస్తుందా అన్నదే చర్చ. చంద్రబాబు వైఖరి చూస్తే ఆయన గతంలో మూడు సార్లు చేసిన నాటికీ ఇప్పటికీ బాగానే మారిపోయారు. ఆయనలో చాలా వరకూ రాజీతత్వం కనిపిస్తోంది. ఆయన టీడీపీ ఫ్యూచర్ ని చూస్తూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి బాబు గతంలో చేసిన తప్పులు చేయరనే అంటున్నారు. ఇక పవన్ అయితే వైసీపీని మళ్లీ ఓడించడం ద్వారా ఏపీలో ఆ పార్టీని పునాదులలో లేకుండా చూడాలని కసి మీద ఉన్నారు. మోడీకి అయితే కూటమి గెలవాలన్నదే టార్గెట్ అని అంటున్నారు. సో అలా అందరూ కలసి పట్టుదలగా ఉంటే మాత్రం వైసీపీకి సీట్లూ ఓట్లూ పెరగవచ్చేమో కానీ వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కుతుందా అన్నది ఒక పెద్ద చర్చగా ఉంది.