Begin typing your search above and press return to search.

బాబు తప్పులు చేయాలని వైసీపీ చూస్తోందా ?

వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకుని రావడం అన్నది ఆ పార్టీ అధినేత జగన్ ప్రథమ కర్తవ్యం అన్నది తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Feb 2025 9:30 AM GMT
బాబు తప్పులు చేయాలని వైసీపీ చూస్తోందా ?
X

వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకుని రావడం అన్నది ఆ పార్టీ అధినేత జగన్ ప్రథమ కర్తవ్యం అన్నది తెలిసిందే. ఆయన ఇందుకోసం ఏమి చేస్తున్నారు అన్నది అటు పార్టీ వర్గాలతో పాటు ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా నిశితంగానే గమనిస్తున్నారు. వైసీపీకి మంచి క్యాడర్ ఉంది. అలాగే జగన్ కి జనంలో క్రేజ్ ఉంది. అయితే ఈ రెండూ సరిపోతాయా ఇంకా ఏమి కావాలా అంటే వైసీపీ అధినాయకత్వం మనోగతం చూస్తే కనుక అయిదేళ్ళకు ఒక మారు ఎటూ ఏపీలో ప్రభుత్వాన్ని ప్రజలు మారుస్తారు కాబట్టి ఆ విధంగా తమకు 2029లో చాన్స్ ఉండొచ్చు అని భావిస్తున్నట్లుగా ఉంది అని అంటున్నారు.

లండన్ పర్యటన తరువాత పార్టీ సీనియర్లతో జగన్ తాడేపల్లిలో నిర్వహించిన పార్టీ కీలక సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే వైసీపీ పూర్తిగా చంద్రబాబునే నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసే తప్పులతో యాంటీ ఇంకెంబెన్సీ పెరిగి ప్రజలు 2029 నాటికి వైసీపీకే పట్టం కడతారు అని అంచనా వేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

అందుకే జగన్ కూడా చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని జనంలోకి వెళ్ళి పార్టీ నాయకులు ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పమని అంటున్నారు. చంద్రబాబు పేదల వ్యతిరేకి అన్న దానిని జనంలో ఎస్టాబ్లిష్ చేయమని కోరుతున్నారు. సరే అధికారంలో ఉన్న పార్టీ మీద విపక్షం విమర్శలు చేయడం సహజం. అంతే కాదు, అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపడమూ సహజం.

కానీ అక్కడితో వైసీపీ ఒడిలో అధికారం పడుతుందా అంటే చెప్పలేమనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎదుటి పక్షం బలహీనతలు ఎంతో కొంత మేలు చేయవచ్చు కానీ అదే సమయంలో వైసీపీ సొంతంగా తానుగా బలోపేతం కావాల్సిన అవసరం కూడా ఉందని అంటున్నారు.

పార్టీని ముందు విశ్వాసంలోకి తీసుకోవాల్సి ఉందని కూడా అంటున్నారు. పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి పూర్తి స్థాయిలో పునర్ నిర్మించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. అంతే కాదు, ఏపీలో చాలా విధానపరమైన అంశాల మీద వైసీపీ తన స్టాండ్ ఏమిటి అన్నది ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని అంటున్నారు.

మళ్ళీ జగన్ వస్తే అమరావతి లేకుండా చేస్తారని టీడీపీ నేతలు ఇప్పటికీ అంటున్నారు. ఏపీకి సంబంధించినంతవరకు రాజధాని అన్నది ప్రజల సెంటిమెంట్ గా ఉంది. అమరావతి ఏపీకి రాజధాని అని అయిదు కోట్ల ప్రజానీకం పూర్తిగా భావిస్తున్నారు. అందువల్ల వైసీపీ కూడా అమరావతినే రాజధానిగా తాము అంగీకరిస్తున్నామని కచ్చితంగా చెబితేనే జనాలలో నమ్మకం పెరుగుతుంది.

అదే విధంగా చంద్రబాబు అభివృద్ధి అజెండాలో సంపద సృష్టి అన్నది ఉంది. అది జనాలకు ఎట్రాక్ట్ చేసేలా. ఉంది. వైసీపీ కూడా ఏపీని ఏ విధంగా అభివృద్ధి పధంలోకి తీసుకుని పోతామన్న దాని మీద తనదైన ఒక మోడల్ ని జనంలో ఉంచాల్సి ఉంది. ఏపీలో అన్నీ టైర్ టూ సిటీస్ ఉన్నాయి. వాటిని ఎలా డెవలప్ చేయవచ్చు. తమ వద్ద ఉన్న ప్లాన్స్ ఏమిటి అన్నది చెప్పాల్సి ఉంది.

ఇక ఏపీలో నిరుద్యోగ సమస్యకు వైసీపీ వద్ద ఉన్న పరిష్కారాలు ఏమిటి అన్నది కూడా చెప్పాలి. సచివాలయాలను ఏర్పాటు చేసి లక్షా పాతిక వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబితే సరిపోదు, దాని కంటే కూడా ప్రభుత్వ ఖాళీల భర్తీ కానీ టీచర్లు పోలీసు ఉద్యోగాలు, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇలా చాలా ఉన్నాయి. వాటి విషయంలో కూడా ఏమి చేస్తామన్నది చెప్పాలి.

ఏపీలో వివిధ రంగాల మీద వైసీపీ ఏమి చేయబోతోంది అన్నది వివరించాల్సి ఉంది. ఏపీలో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి. వాటి కోసం ఏమి చేస్తామన్నది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అన్నింటికంటే ముందు గడచిన అయిదేళ్ళ పాలనలో మంచి పనులు చేశామని వైసీపీ అంటోంది. వాటిని జనాలు ఎటూ గుర్తుంచుకుంటారు. కానీ తప్పులు చేశామని అంగీకరించి వాటి మీద ఒక సమీక్ష చేసుకుని ఇక మీదట తాము చేసేది ఏమిటి అన్నది కూడా చెబితేనే జనాదరణ దక్కే చాన్స్ ఉంటుందని అంటున్నారు. అంతే తప్ప చంద్రబాబు తప్పులు చేస్తే తమకే అధికారం అన్న విధానం అయితే మాత్రం జనాలు మళ్ళీ వైసీపీని ఆదరిస్తారా అంటే చూడాల్సిందే అంటున్నారు.