Begin typing your search above and press return to search.

నాయ‌కుల మార్పు కాదు.. ముందు వీరి సంగ‌తి చూడాలి జ‌గ‌న్ ..!

ఏపీలో వైసీపీ పుంజుకునేందుకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   26 Oct 2024 9:30 AM GMT
నాయ‌కుల మార్పు కాదు.. ముందు వీరి సంగ‌తి చూడాలి జ‌గ‌న్ ..!
X

ఏపీలో వైసీపీ పుంజుకునేందుకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవ‌ల ఉమ్మ‌డి జిల్లాల‌ను ఆరుగా విభ‌జించి.. నాయ‌కుల‌కు ఇంచార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో పార్టీ పుంజుకుంటుంద‌ని.. పార్టీ నిల‌బ‌డుతుంద‌ని.. నాయ‌కులు నిల‌బ‌డ‌తార‌ని పెద్ద ఎత్తున ఆయ‌న ఆశించారు. ఇది త‌ప్పుకాదు. కానీ, అస‌లు మార్చాల్సిన వారు.. మారాల్సిన వారు వేరే ఉన్నార‌ని సొంత పార్టీ నాయ‌కులే చెబుతున్నారు.

"మా మీడియాలో ఏముంది.. నా బాడిద‌.."` అని ఇటీవ‌ల వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు మీడియా ముందే వ్యాఖ్యానించారు. నిత్యం మీడియా ముందే ఉండే ఆయ‌న అంత అస‌హ‌నం వ్య‌క్తం చేశాడంటే.. రీజ‌నేంటి ? అనేది ఆలోచ‌న చేయాలి. అదేవిధంగా వారం కింద‌ట సీమ‌కు చెందిన కీల‌క రెడ్డి నాయ‌కుడు మీడియా తో మాట్లాడేందుకురెడీ అయ్యారు. వైసీపీ నాయ‌కుడు కావ‌డంతో వైసీపీ మీడియా వ‌చ్చేసింది. కానీ, ఆయ‌న మీటింగు ప్రారంభించ‌లేదు.

దీనికి కార‌ణం.. ఆయ‌న‌కు వైసీపీ మీడియా కంటే కూడా.. ప్ర‌త్య‌ర్థి మీడియానే బ‌లంగా ఉంద‌న్న అభిప్రాయం ఏర్ప‌డ‌డం. ఉన్న‌ది వైసీపీలోనే అయినా.. జ‌గ‌న్‌నే ప్రేమిస్తున్నా.. సొంత మీడియా బ‌ల‌హీన‌త‌ల‌ను ఆయా నాయ‌కులు ప‌సిగ‌ట్టారు. అందుకే.. సొంత మీడియాపై వారికి న‌మ్మ‌కం స‌న్న‌గిల్లింది. ఇక‌, ఇప్పుడు ప్ర‌తిపక్షంలో ఉన్నాం కాబ‌ట్టి.. టీడీపీ అనుకూల మీడియా ఏమీ చేయ‌ద‌ని అనుకుంటే పొర‌పాటే. గ‌త నాలుగు మాసాలుగా జ‌రిగిన ప్ర‌తి విష‌యం వెనుక‌.. వైసీపీని ఏకేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో వైసీపీని నిల‌బెట్టాల్సిన‌.. వ్య‌తిరేక మీడియాకు బ‌లంగా స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త‌.. వైసీపీ మీడియాపైనే ఉంది. అది సాక్షి పేప‌ర్ కావొచ్చు.. సాక్షిమీడియా కావొచ్చు. సోష‌ల్ మీడియా కావొచ్చు. కానీ, ఆదిశ‌గా అడుగులు వేస్తున్న వారు క‌నిపించ‌డం లేద‌న్న‌ది నాయ‌క‌లే చెబుతున్న మాట‌. ఈ నేప‌థ్యంలో బ‌ల‌మైన గ‌ళం వినిపించాల‌న్నా.. బ‌ల‌మైన కౌంట‌ర్లు ప‌డాల‌న్నా.. మీడియాను బ‌లోపేతం చేసుకోవాల‌ని.. బ‌ల‌మైన వారిని నియ‌మించ‌డం ద్వారా ప్ర‌త్య‌ర్థుల‌పై శ‌త‌ఘ్నులు పేల్చేలా సిద్ధం కావాల‌ని వైసీపీ నేత‌లే చెబుతున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.