నాడు జయ.. నేడు జగన్.. స్టోరీలో చిన్న మార్పు!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది ఎవరూ చెప్పలేరు. కొందరు పైకి కనిపిస్తారు.. మరికొందరు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. తద్వారా జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోతాయి.
By: Tupaki Desk | 27 Jan 2025 9:30 AM GMTరాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది ఎవరూ చెప్పలేరు. కొందరు పైకి కనిపిస్తారు.. మరికొందరు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. తద్వారా జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోతాయి. ఇది పార్టీలకు నష్టమూ కావొచ్చు.. కాదంటే కష్టమూ కావొచ్చు. ప్రస్తుతం ఏపీ లోవైసీపీ పరిస్థితి దిన దిన గండంగా మారిపోయింది. పార్టీకి మూలస్తంభంగా ఉన్న విజయసాయిరెడ్డి వెళ్లిపోయిన దరిమిలా.. వైసీపీలో ఇంకెన్ని ఔట్లు పేలుతాయో.. ఇంకెంత మంది జగన్‌కు గుడ్‌బై చెబుతారో అన్న చర్చ తెరమీదికి వచ్చింది.
అయితే.. ఇది యాదృచ్ఛికం కాదు. ఒకప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్‌ను ఎదిరించి సొంత పార్టీ పెట్టుకున్నంత ఈజీగా బీజేపీతో జగన్ రాజకీయాలు చేయలేడన్న కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. రాజకీయంగా ఎంత బలంగా ఉన్నా.. తగ్గాల్సిన చోట తగ్గక తప్పదన్న సూత్రం ఒక్క ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కళ్లకు కట్టిన వాస్తవం. ఈ విషయంలోనే జగన్ వేసిన తప్పటడుగు(ఆయన దృష్టిలో మంచిదే కావొచ్చు) ఇప్పుడు పార్టీకి పెను శాపంగా పరిణమించిందని అంటున్నారు పరిశీలకులు.
తమిళనాడులో ఒకప్పుడు అప్రతిహతంగా చక్రం తిప్పిన జయలలితను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేసిన బీజేపీ.. ఈ విషయంలో విఫలమైంది. తర్వాత కాలంలో జయలలిత పరిస్థితి ఎలాంటి టర్న్‌లు తీసుకుందో అందరికీ తెలిసిందే. అంతేకాదు.. పార్టీని రెండు ముక్కలు చేయడంలోనూ కమల నాథుల హస్తం ఉందని పరిశీలకులు చెబుతారు. తెలంగాణలో అధికార చక్రం తిప్పిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఇంచు మించు అలానే ఉందన్నది జగమెరిగిన సత్యం. ఇలా.. తాను అడుగులు వేయాలని అనుకున్న చోట కమల నాథులు తమ దైన శైలిలో రాజకీయాలు చేస్తారు.
ఇప్పుడు ఆ పరిస్థితి జగన్‌కు వచ్చిందనేది పరిశీలకులు చెబుతున్న మాట. గత ఏడాది ఎన్నికలకు ముందు వరకు జగన్ తో చెలిమి కోసం బీజేపీ తహతహలాడిన మాట వాస్తవం. కానీ, మైనారిటీ ఓటు బ్యాంకు కదల బారుతుందన్న బాధతో ఆ పార్టీకి అప్రకటిత మద్దతుకే పరిమితమయ్యారు జగన్. ఇది.. ఎన్నికల్లో ఓటమికి మాత్రమే పరిమితం కాలేదు... ఇప్పుడు పార్టీకే ఎసరు వచ్చే పరిస్థితి వచ్చిందని జాతీయ రాజకీయ వర్గాల మాట. బీజేపీ నేతలతో అవినాభ సంబంధాలు కొనసాగిస్తున్న సాయిరెడ్డిని వైసీపీ నుంచి తప్పించడం వెనుక కమల నాథులు ఉన్నారన్నది అందరూ చెబుతున్న మాటే.
ఇక, ఈ పోకలు కొనసాగితే.. పార్టీ మనుగడకే ప్రమాదమన్న విషయాన్ని జగన్ గుర్తించకపోతే.. పెను ఉప ద్రవం.. తన్నుకొచ్చేందుకు రెడీగానే ఉందని చెబుతున్నారు. తాను చేయాలని అనుకున్న పనిని.. బీజేపీ తన ప్రమేయం లేకుండానే చేయిస్తుంది. ఈ విషయంలో ఆర్జేడీ నుంచి బీజేడీ వరకు..అనేక పార్టీలకు అనుభవంలో ఉన్నదే. సో.. ఇప్పుడు వైసీపీలోనూ.. ఇలాంటి కలకలమే రేగింది. అయితే.. జయలలిత పార్టీ అంత కాకపోయినా.. రమారమి.. భవిష్యత్తులో అంత ఉపద్రవం తప్పకపోవచ్చని పరిశీలకుల అంచనా. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే.. జగన్‌కు ఇక నుంచి మరో ఎత్తుగా రాజకీయాలు మారనున్నాయని చెబుతున్నారు.