ఓవర్ టూ ఢిల్లీ : మోడీతో జగన్....అమిత్ షా తో బాబు
ఏపీ రాజకీయాలు ఓవర్ టూ ఢిల్లీ అన్నట్లుగా మారాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు.
By: Tupaki Desk | 8 Feb 2024 9:43 AM GMTఏపీ రాజకీయాలు ఓవర్ టూ ఢిల్లీ అన్నట్లుగా మారాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళారు. ఇపుడు సడెన్ గా జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆయన గురువారం సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు.
గురువారం రాత్రి జగన్ ఢిల్లీలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఈ భేటీ సందర్భంగా ప్రధానితో పోలవరం ప్రాజెక్ట్ కి రావల్సిన నిధులు, విభజన హామీల గురించి తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన నిధుల బకాయిల గురించి ముఖ్యమంత్రి చర్చిస్తారు అని అంటున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సవరించిన అంచనాల నిధులు కూడా రావాల్సిన అవసరం గురించి కూడా ప్రధానిని ముఖ్యమంత్రి కోరనున్నారు అని చెబుతున్నారు. ఇక షెడ్యూల్ 9 లో ఉన్న విభజన ఆస్తులు నిధుల పంపకాలు కూడా జరగక గత పదేళ్ళుగా అలాగే ఉన్నాయని అంటున్నారు. వీటి మీద కూడా ప్రధానితో చర్చిస్తారు అని అంటున్నారు.
సరే ఇవన్నీ సర్వ సాధారణమైన విషయాలు మామూలే అనుకున్నా జగన్ ఈ కీలక సమయంలో ఢిల్లీ వెళ్ళడమే రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకోంది అని అంటున్నారు. ఏపీలో బీజేపీ టీడీపీ జనసేనల మధ్యకొత్త పొత్తులు పొడుస్తున్న వేళ జగన్ ఢిల్లీ వెళ్ళడంతో రాజకీయంగా దీనిని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. చూడబోతే గడచిన అయిదేళ్ళుగా ఢిల్లీలోని మోడీ ప్రభుత్వంతో జగన్ సఖ్యత నెరిపారు. వైసీపీ బీజేపీల మధ్య జాతీయ స్థాయిలో అయితే అంతా సాఫీగా సాగుతున్న వ్యవహారంగా ఉంది.
బయటకు చెప్పకపోయినా ఎన్డీయేకి తెర వెనక మిత్రుడిగా జగన్ ఉన్నారని అంటారు. అలా సాగిన జగన్ బీజేపీ బంధం ఈ పొత్తులతో బీటలు వారుతుందా అలా జరిగే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయి అన్నది ఆసక్తికరంగా ఉంది. అంతే కాదు ఏపీలో బీజేపీ టీడీపీతో జత కట్టడం వల్ల జగన్ కి రాజకీయంగా కలిగే లాభాలు నష్టాలు ఎంతవరకూ ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తోంది.
వీటిని బేరీజు వేసుకుంటూనే జగన్ బీజేపీ పెద్దలతో వీటి మీద కూడా మాట్లాడుతారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ఇపుడు జగన్ ఢిల్లీ వెళ్ళి ప్రధానితో భేటీ సందర్భంగా ఏపీకి సంబంధించిన విభజన అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చిస్తారని కూడా అంటున్నారు.మోడీతో పాటుగా అమిత్ షాను కూడా జగన్ కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
పొత్తుల విషయంలో బీజేపీ కీలక దశలో చర్చలు ఉన్న నేపధ్యంలో జగన్ ఢిల్లీకి సడెన్ గా టూర్ పెట్టుకోవడం మాత్రం సంచలనంగా ఉంది. ఏది ఏమైనా జగన్ తనదైన రాజకీయాన్ని ఢిల్లీలో ఈ విధంగా చూపిస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఢిల్లీ తెర పైన ఏ రాజకీయం ఆవిష్కృతం కానుందో.