రేర్ పిక్ : జగన్ పవన్ కలిసిన వేళ !
రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు. కానీ ఏపీ రాజకీయాల్లో అవి హద్దులు దాటి వ్యక్తిగతానికి తెచ్చుకున్నారు.
By: Tupaki Desk | 22 Jun 2024 9:45 AM GMTరాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు. కానీ ఏపీ రాజకీయాల్లో అవి హద్దులు దాటి వ్యక్తిగతానికి తెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలో ఒకరి ముఖాలను మరొకరు చూడలేని పరిస్థితిని కూడా కోరి తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో పదేళ్ళుగా ఎదురు నిలిచి పోరాడుతున్నా వైసీపీ అధినేత జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసిన సందర్భం అయితే ఒక్కటీ లేదు.
ఇది నిజంగా రాజకీయాల్లోనే విచిత్రం. రాజకీయ పార్టీల నేతలు అన్నాక సభలూ సమావేశాల పేరుతో ఎక్కడో ఒక చోట కలుస్తూ ఉంటారు. కానీ ఏపీలో ఆ దృశ్యాలు ఎపుడూ కనిపించలేదు. దాంతో అసెంబ్లీ వరకూ చంద్రబాబు జగన్ ఎదురెదురు పడినా పవన్ విషయంలో అదీ లేకుండా పోయింది.
ఈ నేపధ్యంలో ఈసారి మాత్రం ఈ ఇద్దరు నేతలూ కలుసుకునే ఒక అరుదైన సందర్భమే కనిపించింది. మీడియా హైలెట్ చేయని ఒక రేర్ పిక్ అయితే ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొత్త శాసన సభ సమావేశాలకు అధికార కూటమి తరఫున చంద్రబాబు పవన్ సహా అంతా హాజరయ్యారు. ఇక విపక్షం నుంచి జగన్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ నేపధ్యంలోనే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. జగన్ పవన్ ఇద్దరూ కలిసారు పవన్ తాజా ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. దాంతో ఆయనను జగన్ ప్రత్యేకంగా అభినందించిన పిక్ అయితే చక్కర్లు కొడుతోంది.
ఇది జగన్ సభకు వస్తున్నపుడు జరిగిందా లేక సభలో ప్రమాణం తరువాత పవన్ తో భేటీ అయ్యారా తెలియదు కానీ ఈ సీన్ మాత్రం రేర్ నే అంటున్నారు. రాజకీయంగా ఈ ఇద్దరూ బద్ధ శతృవులుగా మెలిగారు. పవన్ విషయంలో వైసీపీ పర్సనల్ ఎటాక్ చేస్తూ పోతే జగన్ సర్కార్ ని పాతాళానికి తొక్కేస్తాను అని పవన్ భీషణ ప్రతిన చేశారు.
అందుకోసం ఈసారి ఎన్నికల్లో పవన్ రచించిన వ్యూహాలు ఫలించాయి 2014 నాటి కాంబినేషన్ ని ఆయన సెట్ చేశారు. దాని కోసం తానుగా ఎంత తగ్గాలో తగ్గారు. ఆ విధంగా టీడీపీ కూటమికి భారీ విజయాన్ని అందించడంతో పవన్ పాత్ర అత్యంత కీలకంగా మారింది.
అదే టైం లో జగన్ ఓటమిలో ప్రధాన పాత్ర పవన్ దే అని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కి జగన్ కి మధ్య ఏమీ లేకపోయినా 2014లో టీడీపీకి పవన్ మద్దతుగా నిలవడంతో ఆయను ప్రత్యర్థిగా వైసీపీ భావించింది. 2019లో విపక్ష ఓట్లను చీల్చేందుకే పవన్ ఒంటరిగా పోటీ చేశారు అని అనుమానించింది. ఇక 2019లో అప్రతిహత విజయం వైసీపీ సొంతం చేసుకునేసరికి పవన్ ని లైట్ తీసుకుని మాట్లాడింది.
పవన్ కి ఉన్న అపారమైన సినీ క్రేజ్. బలమైన సామాజిక వర్గం. ఆయన పట్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో ఉన్న ఆశలు ఆకాంక్షలు అన్నీ కూడా వైసీపీ లెక్కవేసుకోలేకపోయింది. ఫలితంగా 2014 కంటే కూడా ఘోర ఓటమిని కొని తెచ్చుకుంది. మొత్తం మీద పవన్ పేరుని తన నోటితో పలకడానికి సైతం ఇష్టపడని జగన్ పవన్ తో భేటీ కావడం రాజకీయంగా సెన్సేషన్ అనే చెప్పాలని అంటున్నారు.
జగన్ పవన్ కలుసుకున్న సందర్భంలో పవన్ కి జగన్ శుభాకాంక్షలు చెప్పారు. పాత వైరాన్ని మరచి మరీ పవన్ తో కరచాలనం చేశారు. ఇపుడు ఇదే సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. అయితే పవన్ జగన్ కలవడం అన్నది మామూలు విషయం కాదు. ఇది మీడియా మొత్తం హైలెట్ చేయాల్సిన మ్యాటర్. కానీ అలా ఏమీ జరగలేదు. అంటే దీనిని మార్ఫింగ్ చేసి ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టారా అన్న చర్చ కూడా సాగుతోంది.
నిజానికి జగన్ సభలో ఉన్నదే చాలా తక్కువ. ఆ తరువాత ఆయన కొద్ది సేపు చాంబర్లో కూర్చుని వెళ్ళిపోయారు. మరి ఏ టైం లో జగన్ పవన్ కలిశారు అన్నది మాత్రం తెలియడం లేదు. ఇదే నిజమైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ రేర్ పిక్చర్ ని క్యాప్చర్ చేయకుండా ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద చూస్తే ఈ భేటీ జరిగిందా లేదా అన్నది సస్పెన్స్ గానే ఉంది. కానీ జరిగితే బాగుండును అని అటూ ఇటూ అనుకునే వారే సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి ఇలా పెట్టారా అన్నది కూడా ఇపుడు అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది.