పొలిటికల్ హీట్.. ఒకే వేదికపైకి జగన్, షర్మిల!
జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు ఈసారి సంచలనాలకు నిలయంగా మారబోతున్నాయని టాక్ నడుస్తోంది.
By: Tupaki Desk | 3 July 2024 9:38 AM GMTజూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు ఈసారి సంచలనాలకు నిలయంగా మారబోతున్నాయని టాక్ నడుస్తోంది. ఆ రోజు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇద్దరూ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తమ తండ్రికి నివాళులు అర్పించనున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ వైఎస్సార్ జయంతి వేడుకలను భారీ ఎత్తున జరిపి ఆయన లెగసీని కొనసాగించేది తామేనని నిరూపించుకోవాలనుకుంటోంది. వైఎస్సార్ కు ప్రజల్లో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఇమేజ్ ను జగన్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు.
మరోవైపు వైఎస్ షర్మిల మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే చాలాచోట్ల వైసీపీ ఓటు బ్యాంకుకు కాంగ్రెస్ పార్టీ చిల్లు పెట్టడంతో టీడీపీ, జనసేన అభ్యర్థులకు లాభం చేకూరింది.
షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చింది కూడా వైఎస్సార్ కుమార్తెగా ఉన్న గుర్తింపుతోనే. ఈ నేపథ్యంలో తన తండ్రి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరపడానికి ఆమె సిద్ధమయ్యారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితర మంత్రులను స్వయంగా కలసి విజయవాడలో వైఎస్సార్ జయంతి వేడుకలకు హాజరుకావాలని కోరారు.
అంతేకాకుండా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కూడా షర్మిల కలిశారు. ఆయనను కూడా వైఎస్సార్ జయంతి వేడుకలకు రావాలని ఆహ్వానించారు. తద్వారా వైఎస్సార్.. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మాత్రమే అని చూపడానికి షర్మిల సిద్ధమవుతున్నారు.
అలాగే వైఎస్సార్ కు బడుగు, బలహీనవర్గాల్లో ఉన్న ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకు తన తల్లి విజయమ్మను కూడా షర్మిల విజయవాడకు తీసుకొస్తున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగా జూలై 8న ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద వైసీపీ అధినేత జగన్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నివాళులు అర్పిస్తారు. ఎవరికి వారుగానే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఆ తర్వాత షర్మిల విజయవాడకు వచ్చి వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.
ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసినా మరోసారి అన్నాచెల్లెలు మధ్య పొలిటికల్ హీట్ తప్పేలా లేదని అంటున్నారు. ఎన్నికల ముందు షర్మిల వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. తన అన్న జగన్ ను కూడా విడిచిపెట్టలేదు. వదిన భారతిపైనా విమర్శలు చేశారు. తన బాబాయి వివేకాను చంపినవారిని జగన్ వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు జగన్ సైతం షర్మిల పేరు ఎత్తకుండానే ఘాటు విమర్శలు చేశారు. తన చెల్లెళ్లు (షర్మిల, సునీత) తనపైన విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు పంచన చేరి.. ఆయన కుట్రలో భాగస్వాములయ్యారని మండిపడ్డారు. కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు చీలుస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందన్నట్టు ఎన్నికల్లో అటు జగన్, ఇటు షర్మిల ఇద్దరూ నష్టపోయారు.. టీడీపీ లాభపడింది. ఇప్పుడు మరోసారి తన తండ్రి 75వ జయంతి వేడుకగా జగన్, షర్మిల చేస్తున్న రాజకీయం ఎన్ని మలుపులకు కారణమవుతుందో వేచిచూడాల్సిందే.