జగన్ మరో "మహా" అడుగు... స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్!
404.35 కోట్ల రూపాయలు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలు... అంతకంటే ప్రధానంగా చేయాలనే పట్టుదల, నిర్మించాలనే ధృడ సంకల్పం.
By: Tupaki Desk | 19 Jan 2024 4:22 PM GMT18.18 ఎకరాలు.. ప్రత్యేకంగా అందమైన గార్డెన్.. మ్యూజికల్ ఫౌంటేన్స్, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ చేసుకోవటానికి స్థలం.. మొత్తం భవనం 30 మీటర్ల లోతులో 539 పిల్లర్లతో నిర్మాణం.. ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్.. 125 అడుగులు విగ్రహం.. 81 అడుగుల ఎత్తైన పీఠం.. 404.35 కోట్ల రూపాయలు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలు... అంతకంటే ప్రధానంగా చేయాలనే పట్టుదల, నిర్మించాలనే ధృడ సంకల్పం. ఇవే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టీస్ వెనుక ఉన్న చరిత్ర!
ఎన్నికలు సమీపించినప్పుడు మాత్రమే బడుగు, బలహీన వర్గాలపై ఎనలేని ప్రేమ చూపిస్తూ.. ఎన్నికలు అయిన అనంతరం "తోకలు కత్తిరిస్తా" అని మాట్లాడే రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో... మాటల్లోనూ, చేతల్లోనూ... "నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ" అని చెప్పుకునే నాయకుడు జగన్! ఈ క్రమంలోనే సామాజిక సాధికారతకు కంకణం కట్టుకున్న ఆయన... ఏ విషయంలోనూ మాటలకు పరిమితం కాలేదు.. ఆయన చేతల మనిషి!
శాసన మండలిలో 29 మంది సభ్యులు బలహీన వర్గాలకు చెందిన వారే.. ఎనిమిది మందిని రాజ్యసభకు పంపింతే అందులో సగం ఎస్సీ, బీసీలే.. 13 జడ్పీ ఛైర్మన్లలో 9 మంది బలహీన వర్గాల వారే.. ఇక మంత్రులు, ఉపముఖ్యమంత్రులు.. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిర్ణయాలు తీసుకునే అధికారం, శాసనాలు చేసే శక్తి లేక ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండిపోయిన బహుజనుల ఆశాజ్యోతిగా జగన్ నిలిచారు. వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నారు!
ఈ సందర్భంగా... ఆకాశమంతటి వ్యక్తిత్వంతో దేశగతిన మార్చిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేడ్కర్ అని రాజ్యాంగ నిర్మాతని ప్రశంసించిన జగన్... పెత్తందార్ల భావాలపై తిరుగుబాటుకు స్పూర్తి ఇచ్చేలా.. అంబరాన్ని తాకేలా.. ఈ సమాజిక న్యాయ మహాశిల్పం ఏర్పాటు అయిందని వ్యాఖ్యానించారు. అందరినీ ఒక్కతాటిపై నిలబెట్టామంటే అది అంబేద్కర్ స్పూర్తితోనే.. ఈ మహా విగ్రహం అందరికీ స్పూర్తినిస్తుందని జగన్ తెలిపారు.
అవును... దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇంత ఎత్తైన ఆయన విగ్రహం మరొకటి లేదని చెప్పుకునే స్థాయిలో విజయవాడ నగరానికి ఒక శాశ్వత చిరునామాగా.. అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం ఉన్న స్వరాజ్ మైదానం ఇప్పుడు స్వేచ్చకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలవబోతుంది. ఈ సందర్భంగా దళితజాతికి, బహుజనులకు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. ఈ విగ్రహం పేదలకు, రాజ్యాంగం అనుసరించే వారికి నిరంతరం స్ఫూర్తినిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా అంటరాని తనం తన రూపం మార్చుకుందని చెప్పిన జగన్... "పేదలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదని కోరుకోవడం కూడా అంటరానితనమే.. అమరావతిలో పేదలకు చోటు లేకుండా చేయాలనుకోవడం అంటరానితనమే.. పథకాల అమల్లో కూడా వివక్ష చూపడం అంటరానితనమే.. పేదలు ఎప్పటికీ పేదవాళ్లుగానే ఉండాలట.. పేద కులాల వారు ఎప్పటికీ తమ సేవకులుగానే ఉండాలట.. పెత్తందార్ల కళ్లు తెరిపించడం కోసమే ఈ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు" అని జగన్ పునరుధ్ఘాటించారు.
ఇదే సమయంలో... రాజ్యాంగ హక్కులు, న్యాయాల ద్వారా మనల్ని నిరంతరం కాపాడే ఒక మహా శక్తిగా ఆయన మనందరికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు.. ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు ధైర్యాన్ని ఇస్తుంది.. మహా శక్తిగా తోడుగా నిలబడుతుంది.. అని చెప్పిన జగన్... గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేద్కర్.. పోరాటానికి రూపమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉందని విన్నాం.. ఇక స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ పేరు మారుమోగుతుంది అని సగర్వంగా ప్రకటించారు.
ఏది ఏమైనా... జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం పెత్తందార్లకు షాకిచ్చే స్థాయిలో సక్సెస్ అయ్యింది. సామాజిక సాధికారతే తన లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్న జగన్ మరో "మహా" అడుగు వేశారనే ప్రసంశలను సొంతం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా జగన్ చిరకాలం గుర్తుండిపోయే కీర్తిని సంపాదించుకున్నారు.. అది.. పేదలకు అత్యంత అందుబాటులో.. పెత్తందార్లకు అందనంత ఎత్తులో!