Begin typing your search above and press return to search.

ఉద్యోగుల గురించి జగన్ అంతలా ఆలోచించారా...?

అటు ప్రభుత్వం మీద భారం పడకుండా ఇటు ఉద్యోగులు నష్టపోకుండా ఉండేలా తాము జీపీఎస్ ని తీసుకుని వచ్చామని అన్నారు.

By:  Tupaki Desk   |   21 Aug 2023 3:14 PM GMT
ఉద్యోగుల గురించి జగన్ అంతలా ఆలోచించారా...?
X

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు అన్నది రాజకీయ పార్టీలకు చాలా అవసరం. వారే ప్రభుత్వం యంత్రాంగం, కళ్లూ ముక్కూ చెవులు. వారి అండ ఉంటేనే ప్రభుత్వలు వస్తాయి. సాఫీగా కొనసాగుతాయి. మరో ఏడెనిమిది నెలలలో ఎన్నికలు ఉన్న నేపధ్యంలో జగన్ ఏపీ ఎన్జీవోల సభలో చాలా విషయాలు చెప్పారు.

తమది ఉద్యోగుల బాగు కోరుకునే ప్రభుత్వం అన్నారు. ఉద్యోగులకు తాము చేసినంత మేలు మరే ప్రభుత్వం చేసి ఉండలేదని అన్నారు. కావాలంటే సరిపోల్చుకోండి అని అన్నారు. ఉద్యోగులను తమ ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. వారి మర్యాదను కాపాడడమే ప్రభుత్వం ఆలోచనగా పేర్కొన్నారు.

ఉద్యోగులను అవినీతిపరులు లంచగొండులుగా తాము ఎన్నడూ అనలేదని, గత టీడీపీ పెద్దలకు మంచి ఉద్యోగులు చెడ్డ ఉద్యోగులు అన్న విభజన ఉందని, తమకు మాత్రం అందరూ సమానమే అని భావన ఉందని అన్నారు. ఇక జగన్ సీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అంటూ ఉద్యోగులు పెట్టిన అతి పెడ్డ డిమాండ్ విషయంలో చాలా కాలం ఆలోచించామని చెప్పడం విశేషం.

అటు ప్రభుత్వం మీద భారం పడకుండా ఇటు ఉద్యోగులు నష్టపోకుండా ఉండేలా తాము జీపీఎస్ ని తీసుకుని వచ్చామని అన్నారు. ఒక రూపాయి ఉద్యోగులకు ఎక్కువ ఇవ్వాలన్నదే తమ తాపత్రయం అన్నారు. అయితే కరోనా అనంతర పరిస్థితుల వల్ల ఆర్ధిక ఇబ్బందుల వల్ల తమకు పెద్దగా ఖజానా సహకరించలేదని అన్నారు. ఉద్యోగులకు పూర్తి న్యాయం చేసేది తమ ప్రభుత్వమే అన్నారు.

తాను వారి కోసం ఓపీఎస్ కోసం ఇప్పటిదాకా ఏ సమస్య విషయంలో ఆలోచించనంత ఎక్కువగా ఆలోచించానని జగన్ చెప్పడమూ విశేషం. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడంతో పాటు పదివేల మంది కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మనెంట్ చేశామని ఆయన వివరించారు. సచివాలయాలు పెట్టి ప్రతీ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులను నియమించిన చరిత్ర వైసీపీది అని ఆయన అన్నారు.

తమ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని, వారికి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. అవన్నీ పేదలకు ఠంచనుగా అందుతున్నాయంటే అది ఉద్యోగుల గొప్పతనమే అన్నారు. రిటైర్మెంట్ వయసుని అరవై రెండేళ్ళకు పెంచామని కూడా చెప్పుకొచ్చారు. ఈ దసరాకు ఒక డీఏను విడుదల చేస్తామని జగన్ వరాన్ని ప్రకటించారు.

మొత్తానికి ఉద్యోగులను మంచి చేసుకునే దిశగా ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది. మరి ఏపీ ఎన్జీవోలు వైసీపీకి మద్దతుగా నిలుస్తారా అనంది చూడాలి. జగన్ చెప్పిన విషయాలలో మరి కొన్ని కూడా ఉన్నాయి. ఉద్యోగుల మీద వత్తిడి లేకుండా పనిభారం పెంచకుండా తమ ప్రభుత్వం పాలన చేస్తోందని అన్నారు. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు గతంలో కాంగ్రెస్ అంటే ఇష్టపడేవారు. మధ్యలో విభజన నేపధ్యమో అనివార్య పరిస్థితులలో వారంతా టీడీపీకి మద్దతుగా నిలిచారు.

అయితే ఆకస్మిక తనిఖీలు పేరుతో అర్ధరాతి వరకూ రివ్యూస్ ఇతర మీటింగ్స్ పేరుతో గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని అంటూంటారు. ఈ నేపధ్యంలో వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు పని వత్తిడి అన్నది పెద్దగా లేదనే మాట ఉంది. వారి డిమాండ్ల విషయంలో కాస్తా అటూ ఇటూ అయినా న్యాయం చేస్తున్న సందర్భాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు దాంతో ఉద్యోగుల మద్దతు మళ్లీ తమకే దక్కుతుంది అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. కానీ జగన్ ఓపీఎస్ విషయంలో అంత తీవ్రంగా ఆలోచించానని చెప్పడం మాత్రం ఉద్యోగులలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది అని అంటున్నారు.