Begin typing your search above and press return to search.

సీనియర్లను కట్టడి చేసేలా జగన్ వ్యూహం

వైసీపీలో సీనియర్లు స్తబ్దుగా ఉన్నారు. వారు గత రెండు నెలలుగా మీడియా ముఖం చూడటం లేదు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 3:47 AM GMT
సీనియర్లను కట్టడి చేసేలా జగన్ వ్యూహం
X

వైసీపీలో సీనియర్లు స్తబ్దుగా ఉన్నారు. వారు గత రెండు నెలలుగా మీడియా ముఖం చూడటం లేదు. అలాగే వారి మీద ప్రచారం కూడా వైసీపీ అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. కొందరు సీనియర్లు పార్టీ మారుతారు అని కూడా అంటున్నారు.

ఈ నేపధ్యంలో పార్టీని పటిష్టం చేయడం సీనియర్లను కట్టడి చేయడం అనన్ రెండు అంచెల వ్యూహానికి జగన్ పదును పెడుతున్నారు అని అంటున్నారు. ఓటమి పాలు అయ్యాక ముఖం చాటేస్తున్న సీనియర్లతో చర్చలు జరిపి దారికి తెచ్చుకోవడంతో పాటు వారికే కీలకమైన పార్టీ బాధ్యతలు అప్పగించాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు.

మొత్తం 26 జిల్లాలలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆయన చూస్తున్నారు. జిల్లా అధ్యక్షులుగా సీనియర్లను నియమించాలని చూస్తున్నారు. అందులో మాజీ మంత్రులకు పెద్ద పీట వేయాలని ఆలోచిస్తున్నారుట. వారు అయితే అనుభవంతో పాటు పార్టీని నడిపిస్తారు అని భావిస్తున్నారుట.

ఇందులో కూడా సామాజిక సమీకరణలను చూసుకుంటూ అన్ని విషయాలూ బేరీజు వేసుకుంటూ జగన్ సంచలన నిర్ణయాలే తీసుకుంటారు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నారని తెలుసోంది. తొందరలోనే ఏపీలోని మొత్తం ఇరవై ఆరు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాలని జగన్ సన్నద్ధమవుతున్నారు.

దీని వల్ల పార్టీకి కొత్త ఊపు రావడమే కాకుండా మరో నాలుగు నెలల సమయం ఇచ్చి టీడీపీ కూటమి మీద ప్రజా పోరాటానికి తెర తీయడానికి కూడా వీలు చిక్కుతుందని లెక్క వేస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా ప్రస్తుతం ఉన్న ధర్మాన క్రిష్ణదాస్ స్థానంలో ప్రసాదరావుని నియమిస్తారు అని అంటున్నారు.

ఆయన రాజకీయాలు వద్దు అని అనుకుంటున్నారు. అయితే ఆయనకు నచ్చ చెప్పి పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా సిక్కోలులో వైసీపీని గాడిన పెట్టాలని అనుకుంటున్నారుట. అలాగే విజయనగరం జిల్లా పార్టీ పగ్గాలను మజ్జి శ్రీనివాసరావుకే ఇస్తూ ఆయననే కొనసాగిస్తారా లేక కొత్త పేరుని తెర మీదకు తెస్తారా అన్న చర్చ ఉంది.

ఇక పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడిగా పీడిక రాజన్నదొరను నియమిస్తారని అంటున్నారు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాధ్ లేదా అవంతి శ్రీనివాసరావు పేర్లను పరిశీలిస్తున్నారు అని తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బూడి ముత్యాలనాయుడు పేరుని ముందు పెడుతున్నారు.

అల్లూరి జిల్లాకు ప్రస్తుతం పాడేరు మాజీ ఎమ్మెల్యే కె భాగ్యలక్షి అధ్యక్షురాలిగా ఉన్నారు. అక్కడ ఒక బలమైన నేతను బరిలోకి దింపి పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు. కాకినాడ జిల్లాకు కురసాల కన్నబాబు లేదా దాడిశెట్టి రాజాకు బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారుట. ఏలూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలకు మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా చేయడంతో కొత్త వారిని తేవాలని చూస్తున్నారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా బాధ్యతలు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకి ఇవ్వాలని చూస్తున్నారుట.

గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ గా జోగి రమేష్ కి బాధ్యతలు దక్కనున్నాయి. మచిలీపట్నం జిల్లా అధ్యక్ష బాధ్యతలు కొత్త ముఖానికి ఇస్తారని అంటున్నారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమిస్తారని అంటున్నారు. నెల్లూరు బాధ్యతలు మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి ఇస్తారని తెలుస్తోంది.

అలాగే తిరుపతి జిల్లా బాధ్యతలు దళిత వర్గానికి చెందిన నేతకు చిత్తూరు బాధ్యతలు బీసీ వర్గానికి ఇస్తారని టాక్ నడుస్తోంది. ఇక కడప కర్నూల్, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల బాధ్యతలను కూడా సీనియర్లకు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.

ఇక ఈ బాధ్యతలు అప్పగించడంతో ప్రాధాన్యతలు ఏమిటి అంటే అధినాయకత్వం పట్ల విధేయత, దూసుకుని పోయే విధంగా పనిచేసేవారు గా ఉండడం, జిల్లా స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యమైన వారుగా ఉండడం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లా అధ్యక్షులను వైసీపీ హై కమాండ్ తొందరలో నియమిస్తుందని అంటున్నారు.