కొత్త సీఎం కి ముందుంది ముళ్ళ బాటే !
జూన్ 4న ఈవీఎంలను తెరిస్తే చాలు రాజకీయ పార్టీల జాతకాలు బయట పడతాయన్నది వాస్తవం.
By: Tupaki Desk | 18 May 2024 5:17 PM GMTఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అయిదేళ్ళ పాటు సాగే కొత్త ప్రభుత్వాన్ని జనాలు ఎన్నుకోబోతున్నారు. ఎవరు నూతన ముఖ్యమంత్రి అవుతారు అన్నది ప్రజలు తీర్పు ఇప్పటికే ఇచ్చేశారు. అది ఈవీఎంలలో భద్రంగా ఉంది. జూన్ 4న ఈవీఎంలను తెరిస్తే చాలు రాజకీయ పార్టీల జాతకాలు బయట పడతాయన్నది వాస్తవం.
ఏపీ వరకూ చూస్తే రెండే పేర్లు కొత్త సీఎం రేసులో ఉన్నాయి. ఒకరు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్. రెండవ వారు మాజీ సీఎం చంద్రబాబు. ఈ ఇద్దరిలో ఒకరికి కచ్చితంగా చాన్స్ ఉంది. ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగితే కొత్త పేరు రావచ్చేమో కానీ నూటికి తొంబై తొమ్మిది శాతం ఈ ఇద్దరిలోనే ఒకరు సీఎం అవుతారు.
ఈ ఇద్దరిలో ఒకరు అయిదేళ్ళ పాటు సీఎం గా చేసిన అనుభవం ఉన్న వారు అయితే మరొకరు పద్నాలుగేళ్ళ పాటు సీఎంగా చేసిన వారు. ఇక ఈ ఇద్దరికీ విభజన ఏపీ ఆర్ధిక పరిస్థితి బాగా తెలుసు. ఆదాయం ఎంత అప్పులు ఎంత అనేది బాగా తెలుసు. 2014 నుంచి 2019 దాకా పాలించిన చంద్రబాబు అప్పులు తన పరిధిలో చేశారు.
దాని కోసం ఆయన తనదైన మార్గాలను ఎన్నుకున్నారు. ఇక అప్పులు పుట్టవని కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉంచి మరీ అప్పటి ప్రభుత్వం దిగిపోయింది. జగన్ వచ్చాక అప్పులను ఎలా చేయాలో సరికొత్త దారులు అన్వేషించారు. దాంతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ పోయారు అన్న టాక్ ఉంది.
విపక్షాలు చెప్పే మాట పదమూడు లక్షల కోట్ల రూపాయలు పై చిలులు ఏపీ అప్పు ఉందని, అధికార వైసీపీ అయితే తక్కువ అప్పులే చేశామని అన్నీ కలిపి ఏడెనిమిది లక్షలు ఉంటాయని. ఎవరెన్ని చెప్పినా ఏపీ అప్పులు అక్షరాలా పది లక్షల కోట్లకు మించే ఉంటాయన్నది ఒక మాటగా ఉంది.
ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే చేయాల్సిన తక్షణ పనులు చాలా ఉన్నాయి. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి. అది అయిదారు వేల కోట్ల దాకా ఉంటుంది. సామాజిక పెన్షన్లు జగన్ వస్తే మూడు వేల రూపాయలు వంతున అనుకున్న జూన్ నెలకు అయిదు వేల కోట్లు, అదే చంద్రబాబు అయితే నాలుగు వేల రూపాయలు అంటే అది ఆరేడు వేల కోట్ల రూపాయలు అవుతాయి. ఇక సంక్షేమ పధకాలకు నిధులు జగన్ ప్రభుత్వం బటన్ నొక్కి పెండింగులో పెట్టింది. దానిని తక్షణం రిలీజ్ చేయాలి. ఆ సొమ్ము పదివేల కోట్ల రూపాయలు గా ఉంది. ఇంకా ప్రభుత్వ పాలనా పరమైన దైనందిన వ్యవహారాల కోసం చాలా ఖర్చులు ఉన్నాయి.
వీటికి డబ్బు అర్జంటుగా తేవాల్సిందే. అంటే అప్పులు తీసుకుని రావాల్సిందే. ఇక ఈ ఏడాది అంతా కూడా అప్పులు ఇంకా ఇబ్బడి ముబ్బడిగా చేయాల్సి ఉంది. రానున్న నెలలలో చూస్తే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు వేలల్లో రిటైర్ అవుతున్నారు. ఒక్కొక్కరికీ కనీసంగా యాభై లక్షలకు తక్కువ లేకుండా డబ్బులు చెల్లించి మరీ ఇంటికి పంపించాలి. అంతే కాదు ఓల్డ్ పెన్షన్ స్కీం ప్రకారం వారు రిటైర్ అవుతున్నారు.
వారికి లాస్ట్ శాలరీలో సగం తొలి పెన్షన్ గా వస్తుంది. అలా చెల్లిస్తూ పోవాలి. మరో వైపు చూస్తే డీయేలు కూడా పెండింగులో చాలా ఉన్నాయి. కొత్త పీఆర్సీ వేసి మంచి ఫిట్ మెంట్ తో ఉద్యోగులకు ఇవ్వాలి. దాంతో ఉద్యోగుల జీతాలకు ఏటా మరో పది నుంచి పదిహేను వేల కోట్లు అదనంగా అవుతుంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పధకాలకే జగన్ కంటే రెట్టింపు సొమ్ము కేటాయించి ఇవ్వాల్సి ఉంటుంది.
చంద్రబాబు మెగా డీఎస్సీ మీద తొలి సంతకం అన్నారు. అలా రెండు లక్షల మంది కొత్త టీచర్ల నియామకాలు అంటే ఖజనాకు అది వేల కోట్ల రూపాయల భారంగానే ఉంటుంది. ఉద్యోగ వర్గాలతో పాటు ఇక కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన మొత్తాల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి.
అదే విధంగా అభివృద్ధి చేసి చూపించాలి. రోడ్లు వంటివి వేయాలన్నా ఇబ్బండి ముబ్బడిగా సొమ్ము ఖర్చు అవుతుంది. పాలన గాడిలో పెట్టాలంటే కూడా దానికి తగిన ఖర్చు వేరే ఉంటుంది. అసలు వీటన్నింటి కంటే కూడా ఏపీకి ఉన్న అతి పెద్ద సమస్య అప్పులు తేవడం. రోజు వారీ వ్యవహారాలకే అప్పులు తెచ్చి నడుపుతున్న భాగోతం ఉందని విమర్శలు ఉన్నాయి.
దాంతో నెత్తిన పెట్టుకున్న అనేక కొత్త హామీల అమలుతో పాటు చాలా వాటి కోసం ఎలా సొమ్ములు తెస్తారు అన్నది పెద్ద ప్రశ్న. జగన్ సైతం రెండోసారి అధికారంలోకి వచ్చినా పూర్వం మాదిరిగా పధకాలకు ఠంచనుగా నిధులు ఇవ్వలేరు అన్న మాట కూడా ఉంది. ఎవరు అధికారంలోకి వచ్చినా కేవలం నెలల వ్యవధిలోనే వ్యతిరేకత మూటకట్టుకుంటారు అన్న ప్రచారమూ ఉంది. బీజేపీ కేంద్రంలో ఉంది కానీ ఏపీ విషయంలో ఎవరు అధికారంలో ఉన్నా వారి సాయం పరిధి మేరకే ఉంటుంది సో ఏపీలో కొత్త సీఎం కి అంతా ముళ్ళ బాటే అని అంటున్నారు.