మోడీకి ప్రశ్నలను సంధించిన జగన్!
సోమవారం పరామర్శకు విజయనగరం వచ్చిన జగన్ ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడారు. అనంతరం ఆయన ట్విట్టర్ కి పని చెప్పారు. కేంద్రానికి ఈ ఘోర రైలు ప్రమాదం మీద కొన్ని ప్రశ్నలను జగన్ సంధించారు.
By: Tupaki Desk | 30 Oct 2023 4:39 PM GMTఒక విధంగా ఇది ఆసక్తికరమైన విషయంగా చూడాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ బాహాటంగా ఏ విషయంలోనూ కేంద్రాన్ని వేలెత్తి విమర్శించిన సందర్భం అయితే గడచిన నాలుగున్నరేళ్ళ కాలంలో లేనే లేదు అని చెప్పాలి. దానికి భిన్నంగా ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ట్విట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
విజయనగరం రైలు ప్రమాదం విషయంలో పరామర్శకు వచ్చిన ఆయన ఒక విధంగా చూసి చలించిపోయారు. ఏకంగా పదమూడు మంది దాకా ఈ ప్రమాదంలో మరణించారు. యాభైకి పై బడి గాయాల పాలు అయ్యారు ఇది చాలా పెద్ద ప్రమాదంగానే ఉంది. ఆగి ఉన్న రైలుని అదే దారిలో ఉన్న మరో రైలు ఢీ కొట్టడంతో ఆదివారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.
సోమవారం పరామర్శకు విజయనగరం వచ్చిన జగన్ ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడారు. అనంతరం ఆయన ట్విట్టర్ కి పని చెప్పారు. కేంద్రానికి ఈ ఘోర రైలు ప్రమాదం మీద కొన్ని ప్రశ్నలను జగన్ సంధించారు. ప్రమాద సమయంలో బ్రేకింగ్ సిస్టమ్ అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు అన్నది జగన్ మొదటి ప్రశ్న. అలాగే, సిగ్నలింగ్ ఎందుకు విఫలమైంది అని రెండవ ప్రశ్నను వేశారు. ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా విఫలమైందని ఆయన నిలదీశారు. ఈ ప్రశ్నలను వేసిన జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి ట్యాగ్ చేసారు.
ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలని కూడా జగన్ కోరడం విశేషం. తాను లేవనెత్తిన ప్రశ్నలతో పాటు అనేక అంశలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాలని ఆయన కోరారు. అందుకోసం ఒక ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలని జగన్ కోరడం విశేషం.
అదే విధంగా ఘోర రైలు ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆ బాధ తట్టుకునే ధైర్యం అందించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నట్టుగా ట్విట్టర్ వేదికగా జగన్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్యం అందించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
జగన్ లేవనెత్తిన ప్రశ్నలు సబబే అని అంతా అంటున్నారు. ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. మూడు నెలలకు ముందే ఒడిషా వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇపుడు మరొకటి. ప్రమాదం జరిగిన సమయంలో హడావుడి తప్ప ఆ తరువాత రైల్వే శాఖ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవని ఫిర్యాదులు ఉన్నాయి. దేశంలో బలమైన అతి పెద్దదైన వ్యవస్థగా రైల్వేస్ ఉన్నాయి.
అలాంటి రైల్వే వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు సాంకేతికంగా ఇంకా ముందుకు తీసుకుని వెళ్లాల్సిన నేపధ్యంలో ప్రతీ సారి ప్రమాదాలు జరగడంతో రైలు ప్రయాణం అంటే సగటు జనంలో భయం మొదలైంది అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ ఈ విషయంలో మోడీకి కేంద్ర రైల్వే మంత్రికి సంధించిన ప్రశ్నలకు సానుకూలంగా రియాక్షన్ వస్తుందా అని అంతా చూస్తున్నారు ఉన్నత స్థాయి దర్యాప్తు ఆడిటింగ్ ఉండాల్సిందే అన్న డిమాండ్లు వస్తున్నాయి.