జగన్ పెద్ద గీత గీసారు కానీ...!?
ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సగటున 83 శాతం కంటే ఎక్కువగా మేలు చేశారని ఆయన గుర్తు చేశారు.
By: Tupaki Desk | 27 Feb 2024 8:16 PM GMTఏపీ సీఎం జగన్ వై నాట్ 175 అని అంటున్నారు. అలాగే పాతిక ఎంపీ సీట్లు వైసీపీవే అని బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఆ పార్టీ వర్క్ షాప్ లో జగన్ అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రభుత్వం దేశంలో చేయని విధంగా వైసీపీ ప్రజలకు మేలు చేసిందని ఇంత మేలు చేసిన ప్రభుత్వాన్ని ఎవరు ఎందుకు వదులుకుంటారు అని ఆయన పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తూ సూటిగా ప్రశ్నించారు.
ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సగటున 83 శాతం కంటే ఎక్కువగా మేలు చేశారని ఆయన గుర్తు చేశారు. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో అయితే ఆ సంఖ్య కాస్తా 93 శాతానికి కూడా వెళ్ళిందని ఆయన అంటుననరు. ఇంత మంచి చేసిన మనకు జనాలు తప్పకుండా ఓటు వేస్తారు అని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అక్షరాలా రెండున్న లక్షల కోట్ల రూపాయల పై దాటి సంక్షేమానికి ఖర్చు చేశామని నగదు బదిలీగా ఇంత పెద్ద మొత్తం ప్రజల ఖాతాలలో వెళ్లడం చరిత్రలో ఎన్నడూ లేదని ఆయన అంటున్నారు.
తాను అయిదేళ్ల పాలన తరువాత ఏ రాజకీయ పార్టీ ఇవ్వని ఆయుధాలను ఎమ్మెల్యేలకు అభ్యర్ధులకు ఇచ్చానని జగన్ చెప్పుకొచ్చారు. ఇక గెలుపు మీ చేతులలో ఉందని వారికి చెప్పేశారు. నేను చేయాల్సింది అంతా చేశాను కీలకమైన ఈ నలభై అయిదు రోజులలో జనంలోకి వెళ్ళడం అటు పార్టీని మొత్తంగా ఆర్గనైజ్ చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగాలని చెప్పి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పేశారు.
కుప్పంలోనే ఏకంగా 45 వేల కుటుంబాలకు న్యాయం చేశామని అలాగే అక్కడే 1400 కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాలో నగదు బదిలీ కింద వేశామని కుప్పం ఎందుకు గెలవమని జగన్ ప్రశ్నించారు. విశ్వసనీయత అన్నది దేశంలో ఉన్న ఏకైక పార్టీ వైసీపీ అని జగన్ స్పష్టం చేశారు. మీరు జనంలోకి వెళ్లి వైసీపీ చేసిన కార్యక్రమాలు చెబితే చాలు ఓట్ల పంట పండుతుందని జగన్ అంటున్నారు.
అంతే కాదు పేదలకు అవసరం అయిన ప్రభుత్వం వైసీపీది అని అన్నారు. వైసీపీ గెలుపులోనే పేదల జీవితాలు ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు. వైసీపీ ఓడినా లేక టీడీపీ వచ్చినా పేదలే తీవ్రంగా నష్టపోతారు అని ఆయన హెచ్చరించారు. వాలంటీర్ల వ్యవస్థతో పాటు పల్లెలలో ప్రతీ కుటుంబానికి కనెక్ట్ అయ్యే వైసీపీ ప్రభుత్వం కావాలో జన్మభూమి పేరుతో అరాచకం కావాలో ప్రజల వద్దకు వెళ్ళి విడమరచి చెప్పి వారిని వైసీపీకి ఓటేసేలా చూడాలని జగన్ కోరారు.
ప్రతీ గ్రామంలో వైసీపీకి మెజారిటీ రావాలని అది మండలంలో కలవాలని, మండలం నుంచి నియోజకవర్గం లో ఆ మెజారిటీ కూడితే వైసీపీ జెండా మొత్తం 175 సీట్లలో ఎగురుతుందని జగన్ విశ్లేషించారు. మొత్తం మీద జగన్ చెప్పేది ఏంటి అంటే 2019లో 151 సీట్లు వచ్చాయి కానీ ఈసారి తనకు అవి చాలవని 175 కావాలని, అలాగే అపుడు వచ్చిన 22 ఎంపీ సీట్లకు అదనంగా మూడు ఎంపీలు రావాలని.
ఇన్ని చెప్పిన జగన్ ఒక విషయం కూడా చెప్పారు. అఫ్ కోర్స్ క్యాస్ట్ వార్ అని చిన్న విషయాలను విపక్షాలు ముందుకు తెస్తాయని ఆయన అంటున్నారు. కానీ ఏపీలో క్లాస్ వార్ తప్ప మరో వార్ జరగడం లేదని ఆయన అంటున్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇదని అందువల్ల ఈ మధ్యలో కులాలు లేవు అన్నట్లుగా మాట్లాడారు. ఉన్నది పేదలు పెత్తందారులే అంటూ జగన్ పెద్ద గీత గీసేశారు.
ఆ పెద్ద గీతలోకి కనుక పేదలంతా వస్తే పెత్తందారులు చిన్న గీతలో ఉండిపోతారు అపుడు విజయం వైసీపీదే అవుతుంది అన్నది జగన్ ధీమా. కానీ ఏపీ అంటేనే కులాల సంకుల సమరం. కులం అనే గీతను దాటి ఓటు వేసే పరిస్థితి దాదాపుగా ఎక్కడా లేదు అని అంటున్నారు. కానీ జగన్ ఈసారి ట్రెడిషనల్ పాలిటిక్స్ కి భిన్నంగా వెళ్తున్నారు. కులాలు లేవు ఉన్నది వర్గ పోరు మాత్రమే అని ఆయన అంటున్నారు.
అవతల విపక్షం అంతా పెత్తందారుల వర్గంగా ఉంటే పేదల వర్గంగా వైసీపీ ఉంది. ఇందులో కులాలు మతాలు అన్నీ కూడా ఏమీ కాకుండా ఒదిగిపోతాయని జగన్ చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే అలా జరుగుతుందా జగన్ నమ్మకం నిజం అవుతుందా. పేదలంతా జగన్ వైపు ఉంటారా.
జగన్ భావిస్తున్నట్లుగా నూటికి 83 శాతం పైగా ఉన్న పేదలు జగన్ కే ఓటేస్తే దేశంలోనే ఎన్నడూ చూడని తీర్పు అంటే టోటల్ గా 175 కి 175 సీట్లు వైసీపీ పరం అవుతాయా అన్నది చూడాలి. నిజానికి ఇది కలలో కూడా ఊహించని సాహసం. ఎవరూ పెట్టుకోని నమ్మకం. వాస్తవానికి దగ్గరగా ఉందా దూరంగా ఉందా అంటే జనాలే తీర్పు ఇవ్వాలి. అయితే ఇంత ధీమాగా చెబుతున్న జగన్ మాటలను నమ్మడానికి కూడా ఒక లెక్క ఉంది. జగన్ జనాలను బాగా చదువుతారు అన్నదే ఆ లెక్క. ఆయనకు జనంతో ఉన్న ఆ కనెక్షన్ తో ఈ మాటలు అంటున్నారు కాబట్టి ఈసారి ఎన్నికలు చాలా ఆసక్తిగా మారబోతున్నాయని అంటున్నారు.