Begin typing your search above and press return to search.

జగన్‌ బెంగళూరులో ఉంటోంది ఇందుకేనా?

మళ్లీ ఇప్పుడు బెంగళూరు వెళ్లిపోయారు. మొత్తం మీద నాలుగుసార్లు ఆయన బెంగళూరు నివాసానికి వెళ్లారు.

By:  Tupaki Desk   |   5 Aug 2024 5:40 AM GMT
జగన్‌ బెంగళూరులో ఉంటోంది ఇందుకేనా?
X

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎక్కువగా బెంగళూరు నివాసంలో ఉండటానికే ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన మూడుసార్లు బెంగళూరు వెళ్లి అక్కడ ఇంటిలో కొన్ని రోజులు గడిపి వచ్చారు. మళ్లీ ఇప్పుడు బెంగళూరు వెళ్లిపోయారు. మొత్తం మీద నాలుగుసార్లు ఆయన బెంగళూరు నివాసానికి వెళ్లారు.

వైఎస్‌ జగన్‌ రాజకీయాల్లోకి రాకముందు అంటే 2009కి ముందు ఎక్కువగా బెంగళూరులోని నివాసంలోనే తన భార్య, పిల్లలతో ఉండేవారు. 2009లో తొలిసారి రాజకీయాల్లోకి ప్రవేశించి కడప ఎంపీగా గెలిచాక ఆయన హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌ లో ఉన్న నివాసంలో ఉండేవారు.

2009 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు కూడా అంటే దాదాపు పదేళ్లు హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌ నివాసంలోనే ఉన్నారు. 2019 ఎన్నికలకు కొన్నాళ్లు ముందు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం నిర్మించుకుని అందులోకి మారారు.

ఇక 2019 ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయే వరకు తాడేపల్లి నివాసంలోనే ఉన్నారు. ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆయన బెంగళూరు నివాసానికి వెళ్లలేదు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, ఏకైక రాజధానిగా అమరావతి ఉండనుండటంతో వైఎస్‌ జగన్‌ రాజధాని ప్రాంతంలోనే ఉన్న తాడేపల్లిలో ఉండటానికి ఇష్టపడటం లేదని అంటున్నారు.

ఇటీవల ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే జగన్‌ తన నివాసాన్ని విశాఖకు మార్చుకునేవారు. విశాఖ రుషికొండలో సముద్రానికి అభిముఖంగా రూ.500 కోట్లకు పైగా నిర్మించిన విలాసవంతమైన సౌధాలు ఆయన నివాసానికేనన్న అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ఓడిపోవడంతో జగన్‌ విశాఖ కల నెరవేరలేదు.

కాగా తాడేపల్లికి బెంగళూరుతో పోలిస్తే హైదరాబాదే దగ్గర. తాడేపల్లికి కూతవేటు దూరంలోనే ఉన్న గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ కు బెంగళూరుతో పోలిస్తే ఎక్కువ విమానాలు కూడా తిరుగుతున్నాయి. అయినప్పటికీ జగన్‌ హైదరాబాద్‌ లో ఉండకుండా బెంగళూరులోనే ఉండటానికి మొగ్గుచూపడం వెనుక ఆసక్తికర కారణం ఉందని తెలుస్తోంది.

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రస్తుతం హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌ నివాసంలో ఉంటున్నారు. ప్రస్తుతం జగన్, షర్మిల మధ్య సంబంధాలు ఉప్పూనిప్పుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లో ఉండటం జగన్‌ కు ఇష్టం లేదని.. అందుకే ఆయన భార్యతో కలిసి బెంగళూరు నివాసంలో ఉంటున్నారని టాక్‌ నడుస్తోంది.

వాస్తవానికి లోటస్‌ పాండ్‌ నివాసాన్ని వైఎస్సార్‌ జీవించి ఉన్నప్పుడే నిర్మించారు. దానిపై అటు జగన్‌ కు, ఇటు షర్మిలకు ఇద్దరికీ హక్కులు ఉన్నాయని తెలుస్తోంది. జగన్‌ గత ఐదేళ్లు తాడేపల్లిలోనే నివాసం ఉండటంతో లోటస్‌ పాండ్‌ లో షర్మిల తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. వైఎస్‌ విజయమ్మ కూడా అక్కడే ఉంటున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జగన్‌ బెంగళూరు నివాసాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు. ఈ ఐదేళ్లు ఆయన ఎక్కువ కాలం ఇందులోనే ఉండొచ్చని అంటున్నారు. రాజకీయ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాల నిమిత్తమే అప్పుడప్పుడు తాడేపల్లి వెళ్లి రావచ్చని పేర్కొంటున్నారు.