Begin typing your search above and press return to search.

జగన్‌ బ్యాటింగ్‌, బైరెడ్డి బౌలింగ్‌, రోజా కీపింగ్‌... వీడియో వైరల్!

ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధర్థ్ రెడ్డి బౌలింగ్ చేయగా.. మంత్రి ఆర్కే రోజా వికెట్ కీపింగ్ చేయగా.. జగన్ బ్యాట్ ఝులిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

By:  Tupaki Desk   |   26 Dec 2023 7:34 AM GMT
జగన్‌  బ్యాటింగ్‌, బైరెడ్డి బౌలింగ్‌, రోజా కీపింగ్‌... వీడియో వైరల్!
X

యువతలో క్రీడా నైపుణ్యాలను మరింత వెలికితీసే ఉద్దేశ్యంతో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆణిముత్యాలను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా.. ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమాల్లో ఒకటైన "ఆడుదాం ఆంధ్ర" కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం కాసేపు బ్యాటింగ్ చేసి అందరినీ అలరించారు.

అవును... గుంటూరు జిల్లాలో "ఆడుదాం ఆంధ్ర" కార్యక్రమాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్ కాసేపు బ్యాట్ పట్టారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధర్థ్ రెడ్డి బౌలింగ్ చేయగా.. మంత్రి ఆర్కే రోజా వికెట్ కీపింగ్ చేయగా.. జగన్ బ్యాట్ ఝులిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

అంతకంటే ముందు ఆటగాళ్లను పరిచయం చేసుకున్న ముఖ్యమంత్రి.. వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే మైలురాయని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్... ఈరోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజులపాటు.. అంటే ఫిబ్రవరి 10వ తేదీ వరకూ ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుందని తెలిపారు.

ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన అందరి జీవితాల్లో క్రీడలు ఎంతో అవసరం అని తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం ఒక క్యాంపెయిన్‌ గా ఉపయోగపడుతుందని చెప్పిన జగన్... క్రమం తప్పకుండా కచ్చితంగా వ్యాయమం చేయడం వల్ల బ్లడ్‌ ప్రజర్‌ లాంటివి కంట్రోల్‌ లో ఉంచగలుగుతామని.. టైప్‌2 డయాబెటిస్‌ లాంటివి నిరోధించ గలుగుతామని తెలిపారు!

ఇదే సమయంలో ఈ కార్యక్రమం వెనుక ఉన్న మరో ప్రధాన ఉద్దేశ్యం... గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను వెతకడమే అని జగన్ తెలిపారు. ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి లేకుండా.. ఆ ఆణిముత్యాన్ని బాగా సానబెట్టి వజ్రంగా మలచి దేశానికి పరిచయం చేయడం అని వెల్లడించారు. ఇలా ఆణిముత్యాలను వెతికేందుకు ప్రొఫెషనల్‌ లీగ్‌ లో ఉన్న టీములన్నీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తాయని తెలిపారు.

కాగా... నేటి నుంచి ఫిబ్రవరి 10వతేదీ వరకు 47 రోజుల పాటు నిర్విరామంగా రాష్ట్రమంతటా "ఆడుదాం ఆంధ్ర" పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా... తొలి దశలో జనవరి 9వతేదీ నాటికి గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. అనంతరం జనవరి 10 - 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 - 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 - ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6 -10 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి.