అన్నా తప్పుకోండి... గౌరవంగా....!
దాంతో జగనే స్వయంగా పెద్ద నేతలను కీలకమైన వారిని పిలిచి అన్నా మీరే తప్పుకోండి. గౌరవంగా తప్పుకుంటే బాగుంటుంది.
By: Tupaki Desk | 15 Dec 2023 1:15 AM GMTగౌరవం పెరగాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగంలో యజమాని తనను తీసేస్తారు అని ముందే ఊహించి తానే రాజీనామా చేయడం గౌరవనీయమైన విధానం. అలాగే రాజకీయ పార్టీలలో కూడా అవకాశాలు రావు అని భావించినపుడు కొందరు ముందే పసిగట్టి తప్పుకుంటారు. మరి కొందరు మాత్రం అధినాయకత్వం తప్పించేంతవరకూ చూసి ఆ మీదట నానా యాగీ చేస్తారు.
ఇది కూడా రాజకీయ వ్యూహంలో భాగం. బయట సానుభూతి దొరుకుతుందని, ఇతర పార్టీలలో చాన్సులు ఉంటాయని కూడా ఆలోచించి ఇలా చేస్తారు. అయితే ఈ వ్యూహంలో ఫలితాలు ఎలా ఉన్న టికెట్ కి టిక్కు పడింది అన్న మచ్చ పడుతుంది. మరోవైపు అధినాయకత్వం తో బాగా చెడుతుంది.
అయితే వైసీపీలో మాత్రం ఏకంగా అధినాయకత్వమే ఇలాంటి వాతావరణం వద్దు అనుకుంటోంది. అందరూ తనకు కావాల్సిన వారే అని వైసీపీ ఎమ్మెల్యేల వర్క్ షాప్ లో జగన్ పదే పదే చెప్పారు. తాను అయితే ఎవరినీ వదులుకోదలచుకోలేదు అని అంటున్నారు. ఇక పనితీరు బాగాలేని వారిని కొనసాగించి అల్టిమేట్ గా పార్టీకి నష్టం కలిగించడం కంటే ఎంతటి సీనియర్ నేతలు అయినా జనాదరణ లేకపోతే టికెట్ ఇవ్వకూడదు అన్న కఠిన నిబంధనను వైసీపీ అధినాయకత్వం పెట్టుకుంది. దాంతో ఇపుడు వన్ టూ వన్ భేటీలు వేసి మరీ అదే విషయం టికెట్ ఇవ్వలేని వారికి చెబుతోంది అంటున్నారు.
సుమారుగా నలభై నుంచి యాభై మంది దాకా ఎమ్మెల్యేలు మంత్రులు సీనియర్లకు ఈసారి టికెట్లు దక్కవని ప్రచారం అయితే ఉంది. ఒక విధంగా చూస్తే అదే నిజం కూడా. దాంతో జగనే స్వయంగా పెద్ద నేతలను కీలకమైన వారిని పిలిచి అన్నా మీరే తప్పుకోండి. గౌరవంగా తప్పుకుంటే బాగుంటుంది. మీరు వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు అని ప్రకటన చేయండి అని చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది
దీని వల్ల వారికీ పార్టీకి కూడా ఇబ్బందులు లేకుండా గౌరవంగా ఉంటుంది అన్నది అధినాయకత్వం ఆలోచన. అయితే దీనికి కొంతమంది సానుకూలంగా ఉంటే మరికొంతమంది మాత్రం అదెలా అని మధనపడుతున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా సీనియర్లు అయినా మరొకరు అయినా కూడా వారికి అంటూ ఒక క్యాడర్ ఉంటుంది. అలాగే వారి అనుచరగణం ఉంటుంది.
వారు తాము ఎన్నికల్లో పోటీ చేయడంలేదు అని తప్పుకుంటే కచ్చితంగా వారు వచ్చి వత్తిడి చేస్తారు. అపుడు వారు జవాబు ఎక్కడో ఒక చోట చెప్పుకోవాల్సి ఉంటుంది. అసలు విషయం అది అని తెలిస్తే వారు ఊరుకోరు, వేరే పార్టీకి పోదామని కూడా సతాయిస్తారు. ఇలాంటి పేచీలు గ్రౌండ్ లెవెల్ లో ఉంటాయి.
ఇవన్నీ కొందరు సీనియర్లు ఆలోచించి మౌనంగా ఉంటున్నారుట. మొత్తానికి అయితే ఒక విషయం స్పష్టంగా ఉంది అని అంటున్నారు. వైసీపీలో చాలా మంది నేతలకు టికెట్లు రావు. ఆ సంగతి వారికి ఎలా చెప్పాలో అలా చెప్పి వైసీపీ అధినాయకత్వం వారికి సందేశం ఇచ్చేసింది. పైగా ఒక ఆప్షన్ కూడా ఇచ్చింది. గౌరవంగా తప్పుకోమని. మరి దాన్ని ఎంతమంది పాటిస్తారు అన్నది చూడాలి.
ఇప్పటికే తొలి దశలో మంత్రులు ముగ్గురుకి స్థాన చలనం అయింది అందులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఉన్నారు. ఆమెకు చిలకలూరి పేట నుంచి గుంటూరు వెస్ట్ ని మార్చారు. మేరుగ నాగార్జునకు ఆదిమూలపు సురేష్ కి ప్లేస్ మర్చారు. అయితే ఈ ఇద్దరూ జగన్ డెసిషన్ కి ఓకే అన్నారు. కానీ విడదల రజని మాత్రం బయటపడలేదు.
మరి ఇక మీదట వచ్చే తరువాత జాబితాలో మరింతమంది కీలక నేతలు మంత్రుల వివరాలు ఉంటాయని అంటున్నారు. వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏది ఏమైనా వైసీపీలో పెద్ద నంబర్ లో టికెట్లు నిరాకరిస్తున్నా చాలా మందికి ఆప్షన్లు ఇతర పార్టీలలో ఉన్నాయా అన్నదే చర్చగా ఉంది మరి.