వాలంటీర్లకు జగన్ 'రిటన్' గిఫ్ట్ ఇదే!
అవును... సీఎం జగన్ మానస పుత్రిక అయిన వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పనవసరం లేదు.
By: Tupaki Desk | 21 Dec 2023 5:55 AM GMTఏపీలో వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది వాలంటీర్లు నిరంతరం ప్రజలకు ప్రభుత్వం తరుపున సేవలు అందిస్తుంటారు. వీరంతా నాలుగేళ్లుగా నెలకు 5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వాలంటీర్లకు వేతనాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెంచిన జీతం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
అవును... సీఎం జగన్ మానస పుత్రిక అయిన వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పనవసరం లేదు. జగన్ ప్రభుత్వానికి వెన్నెముఖ అన్న స్థాయిలో వీరి పెర్ఫార్మెన్స్ ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో... విపక్షాల నుంచి వీరిపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ జగన్ వీరిని తన సొంత సైన్యంగా భావిస్తుంటారని వైసీపీ నేతలు చెబుతుంటారు.
ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు కానుకగా ప్రభుత్వం వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఓ ప్రకటన చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ.5 వేలకు అదనంగా మరో రూ.750 చొప్పున పెంచబోతున్నట్లు తెలిపారు. జగన్ పుట్టినరోజు కానుకగా ఈ పెంపు నిర్ణయం అమలు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ తాజా పెంపు నిర్ణయం 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో వచ్చే నెల నుంచి వాలంటీర్లకు రూ.5750 గౌరవవేతనంగా అందనుంది. వాస్తవానికి ఏపీలో పనిచేస్తున్న సుమారు 3 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం నెలకు రూ.5 వేల చొప్పున ఇస్తున్న గౌరవ వేతనం పెంచాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే! దీంతో... జగన్ బర్త్ డే కానుకగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
కాగా... ఏపీలో తన మానసపుత్రిక అయిన వాలంటీర్ వ్యవస్థపై జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రభుత్వ పథకాల్ని ఇంటింటికీ తీసుకెళ్లడం, పెన్షన్ సొమ్మును నేరుగా లబ్దిదారులకు అందజేయడంతోపాటు.. ప్రభుత్వ పథకాలు రాని వారికి అధికారులతో చెప్పి అవి అందేలా చేయడం వంటి కార్యక్రమాలతో వాలంటీర్లు మంచి పేరే తెచ్చుకున్నారు.