Begin typing your search above and press return to search.

మళ్ళీ జగనే ఫస్ట్... లిస్ట్ ఎపుడూ...!?

అలా వైసీపీ ఆనాడు ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. తొందరగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల కలిగే రాజకీయ లాభం ఏంటో నూరు శాతం వైసీపీ చూసింది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 3:30 PM GMT
మళ్ళీ జగనే ఫస్ట్... లిస్ట్ ఎపుడూ...!?
X

ఇప్ప్పటికి సరిగ్గా అయిదేళ్ల క్రితం జరిగిన ఎన్నికలలో విపక్షంలో ఉన్న వైసీపీ ఒకేసారి మొత్తం 175 సీట్లకు తన అభ్యర్ధులను ప్రకటించేసింది. ఒక్క దెబ్బతో ఎన్నికల ప్రచారానికి తెర తీసింది. అలా వైసీపీ ఆనాడు ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. తొందరగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల కలిగే రాజకీయ లాభం ఏంటో నూరు శాతం వైసీపీ చూసింది. ఫలితం కూడా పొందింది.

ఇపుడు చూసినా వైసీపీయే తమ పార్టీ పోటీ చేసే అభ్యర్ధుల జాబితాలను ఏడు విడతలుగా రెడీ చేసి మరీ రిలీజ్ చేస్తోంది. నిజానికి అధికార పార్టీకి తొందరగా అభ్యర్ధులను ప్రకటించడం ఒక సవాల్. ఎందుకంటే అప్పటికే ఆ సీటులో సిట్టింగులు ఉంటారు. వారిని కాదని కొత్త వారిని తెస్తే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అయినా ఎన్నికలకు రెండు మూడు నెలల నుంచి ఈ రకమైన కసరత్తు చేస్తూ వైసీపీ తానే ఫస్ట్ అని నిరూపించుకుంది.

ఆ పార్టీ తరఫున కన్ ఫర్మ్ చేసిన అభ్యర్ధులు అంతా జనంలోకి వెళ్లిపోతూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇక రకంగా అది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారింది. అయితే ఇపుడు చూస్తే విపక్ష టీడీపీ కూటమి మాత్రం అభ్యర్ధుల లిస్ట్ ని ప్రకటించకుండా ఇంకా లేట్ చేస్తోంది. టీడీపీ జనసేన కూటమి కట్టాయి. ఈ రెండు పార్టీల మధ్యనే సీట్ల సర్దుబాటు ఎలా అనుకుంటూంటే మధ్యలోకి బీజేపీ వస్తుంది అని వార్తలు వినిపిస్తునాయి.

బీజేపీతో ఒకసారి ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు చర్చలు జరిపారు. అది జరిగి మూదు వారాలు అవుతున్నా ఇంకా ఒక్క అడుగూ ముందుకు పడడం లేదు. అసలు టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అన్నది కూడా తెలియడం లేదు. మరో వైపు చూస్తే ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే సీట్ల పంపకాలే అతి పెద్ద సమస్యగా మారుతాయని అంటున్నారు. దాంతో ముందు పొత్తుకు రావాలి ఆ తరువాత సీట్ల పంపకాలు పూర్తి అవాలి.

అపుడు అభ్యర్ధులను ఎంపిక చేసుకుని లిస్ట్ ని రిలీజ్ చేయాలి. చూడబోతే చాలా పెద్ద కధ ముందర ఉంది. టైం చూస్తే గిర్రున తిరిగేస్తోంది. ఫిబ్రవరి నెల కొద్ది రోజులలో ముగుస్తోంది. మార్చిలో నోటిఫికేషన్ వస్తే ఎన్నికల నిబంధలను అమలు అవుతాయి. అపుడు అభ్యర్థులు విచ్చలవిడిగా బాహాటంగా ఖర్చు చేయలేరు. వారు ఏ ఖర్చు పెట్టినా కూడా ప్రతీ దానికీ లెక్క చెప్పాలి.

ప్రతీదీ ఎన్నికల సంఘం నిఘాలో ఉంటుంది. పైగా అప్పటికి అన్ని పార్టీలు జోరు మీద ఉంటాయి. జనంలోకి వెళ్తే గుంపులో గోవిందంగానే ఉంటుంది. ముందే వచ్చారు అని చెప్పుకునే అవకాశం పోతుంది. ఇలా లిస్ట్ తొందరగా రిలీజ్ చేయకపోవడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా చూస్తే కనుక ఏపీలో అందరి కంటే అధికార వైసీపీయే ముందు ఉందని అంటున్నారు.

ప్రధాన ప్రతిపక్షం తనకు ఉన్న వెసులుబాటుని ఈసారి ఎన్నికల్లో తీసుకోవడం లేదు అని కూడా అంటున్నారు. ఇక వైసీపీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సిద్ధం సభలను వరసబెట్టి రీజియన్ల వారీగా చేస్తున్నారు. తొందరలో టోటల్ లిస్ట్ ని రిలీజ్ చేసి పూర్తి ప్రచారంలోకి జగన్ దిగిపోతున్నారు. మరి విపక్షాల అభ్యర్ధులు ఎవరు, కూటమి తరఫున గెలుపు గుర్రాలు ఎవరు అన్నది ఆయా పార్టీ శ్రేణులు తమ అధినాయకత్వాన్ని అడుగుతున్నాయి.

ఇప్పటికే సమయం మించిపోయిందని, ఇకనైనా అభ్యర్ధుల లిస్ట్ రిలీజ్ చేయకపోతే రాజకీయంగా నష్టం కలుగుతుందని సగటు కార్యకర్తలు అంటున్నారు. వారు అన్నారు అని కాదు కానీ చరిత్ర చెబుతున్న సత్యం కూడా ఇదే. మరి టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల ప్రకటనతో పాటు, కూటమి అభ్యర్ధులు ఎపుడు ఫైనలైజ్ చేస్తారు అంటే వేచి చూడాల్సిందే.