బాబు కోసం జగన్.. జగన్ కోసం బాబు.. ఈ వెయిటింగ్ ఎందుకంటే..!
జగన్ జాబితా కోసం.. చంద్రబాబు, చంద్రబాబు జాబితా కోసం జగన్ ఎదురు చూస్తున్నట్టు పార్టీల వర్గాలు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 31 July 2023 2:30 PM GMTఇది కొంత ఆశ్చర్యంగాను.. అయోమయంగానూ అనిపించినా.. నిజమేనని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు కోసం.. సీఎం జగన్, సీఎం జగన్ కోసం.. చంద్రబాబు ఎదరు చూస్తున్నారని చెబుతున్నారు. వాస్తవానికి ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. అయితే. దీనికి మించిన వ్యక్తిగత వివాదాలు.. విభేదాలు కూడా ఉన్నాయి. గతం లో తన పై కాంగ్రెస్ కేసులు పెట్టినప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్న ఎర్రన్నాయుడు కేంద్రంలో సహకరించారనే వాదనను జగన్ విశ్వసిస్తారు.
ఇక, 2019లో జరిగిన వివేకా హత్య కేసును కూడా.. టీడీపీ సీరియస్ గా తీసుకోవడాన్ని జగన్ అస్సలు సహించడం లేదు. ఇక, దీనికి తోడు ఒకే రాష్ట్రం లో రాజకీయ అధికారం కోసం .. టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య యుద్ధం ఎలానూ ఉంది. ఇక, స్వవిషయాలను కూడా కలుపుకొంటే.. రాజకీయ వైరానికి తోడు.. వ్యక్తిగత విభేదాలు.. కక్షలు కూడా ఉన్నాయి. మరి ఈ పరిణామాల మధ్య ఇద్దరూ కూడా ఒకరికోసం ఒకరు ఎదురు చూడడం అనే మాట ఎందుకు వుంటుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అంతేకాదు.. 2019 తర్వాత.. జగన్ అదికారం చేపట్టిన తర్వాత.. మూడు సందర్భాల్లోనే చంద్రబాబు, జగన్ లు ఎదురు పడ్డారు. ఒకటి అసెంబ్లీలోను, రెండు గవర్నర్ ఇచ్చిన విందులోను, తర్వాత.. ఇటీవల జరిగిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమంలోను, అయినప్పటికీ.. ఇద్దరూ కూడా పలకరించుకోలేదు. కనీసం కన్నెత్తి కూడా చూసుకోలేదు. మరి అలాంటి వారు ఎందుకు ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తున్నారనే ప్రశ్న సహజంగానే ఉంటుంది.
ఎందుకంటే.. రాజకీయంగా ప్రత్యర్థులు కావడంతో ఎవరి ఎత్తులు ఎలాఉంటాయో.. దానిని పై ఎత్తులు ఎలా వేయాలో అనేది సందేహమే కదా! అదేవిధంగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ను ఖరారు చేస్తే.. దానికి ప్రతిగా.. బలమైన అభ్యర్థులను ఇప్పుడు ప్రత్యర్థి పక్షం రంగం లోకి దింపాల్సి ఉంటుంది. సో.. ఈ పరిణా మాల నేపథ్యం లోనే జగన్ జాబితా కోసం.. చంద్రబాబు, చంద్రబాబు జాబితా కోసం జగన్ ఎదురు చూస్తున్నట్టు పార్టీల వర్గాలు చెబుతున్నాయి.
గత ఎన్నికల సమయం లో జగన్ జాబితా కన్నా ముందుగానే చాలా నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేసి.. చేతులు కాల్చుకున్నారని సీనియర్లు చెబుతుండడాన్ని బట్టి.. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పక్షాన్ని దెబ్బకొట్టాలంటే.. ఆ పార్టీ జాబితా తెలిస్తే తప్ప.. క్లారిటీ ఉండదని భావిస్తున్నట్టు వైసీపీలోనూ చర్చ జరుగుతోంది. అందుకే ఈ వెయిటింగ్ అంటున్నారు పరిశీలకులు.