అక్కడ జగన్ లెక్క తప్పిందా.. అందుకేనా మళ్లీ మార్పు!
అయితే జగన్.. ఇటీవల వైసీపీలో చేరిన ఈవూరు గణేశ్ కు సీటు ఇచ్చారు.
By: Tupaki Desk | 26 Jan 2024 6:11 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నాలుగు విడతల్లో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా కొందరు సిట్టింగు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సీట్లు గల్లంతయ్యాయి. వీరి స్థానాల్లో కొత్త అభ్యర్థులకు సీట్లు ఇచ్చారు. మరికొందరి స్థానాలను ఒక చోట నుంచి మరొకచోటకు మార్చారు.
ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక స్థానాల్లో ఒకటైన రేపల్లెకు ఇంచార్జిగా ఉన్న మోపిదేవి వెంకట రమణారావును తప్పించి ఆ స్థానంలో కొత్త అభ్యర్థి ఈవూరు గణేశ్ ను ప్రకటించారు. దీనిపై మోపిదేవి వెంకట రమణ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాగా ప్రముఖ వైద్యుడిగా పేరున్న డాక్టర్ ఈవూరు గణేశ్ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున రేపల్లె నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయన 26 వేలకు పైగా ఓట్లు సాధించారు. గణేశ్.. గౌడ సామాజికవర్గానికి చెందినవారు.
కాగా మోపిదేవి వెంకట రమణ 2009 ఎన్నికల్లో రేపల్లె నుంచి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్సార్ మంత్రివర్గంలో పెట్టుబడులు, ఓడరేవులు, మౌలిక సదుపాయాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో మోపిదేవి జైలుపాలయ్యారు. తన మంత్రి పదవిని కూడా పోగొట్టుకున్నారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి రేపల్లెలో బరిలోకి దిగి మోపిదేవి వెంకట రమణ ఓటమి పాలయ్యారు. ఈ రెండు పర్యాయాలు టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు.
తనవల్లే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మోపిదేవి మంత్రి పదవి పోగొట్టుకున్నారని.. జైలుపాలయ్యారని వైఎస్ జగన్ కు ఓ కన్సర్న్ ఉంది. దీంతో 2019లో మోపిదేవి వెంకట రమణారావు రేపల్లెలో ఓడిపోయినప్పటికీ ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీగా ఆయనను ఎంపిక చేశారు. ఆ తర్వాత శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మోపిదేవి వెంకట రమణారావును రాజ్యసభకు పంపారు.
ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో రేపల్లె నుంచి వాస్తవానికి మోపిదేవి వెంకట రమణ వైసీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల్సి ఉంది. అయితే జగన్.. ఇటీవల వైసీపీలో చేరిన ఈవూరు గణేశ్ కు సీటు ఇచ్చారు. అయితే జగన్ చేయించుకున్న సర్వేల్లో ఈవూరు గణేశ్ పట్ల అంత సంతృప్తి వ్యక్తం లేదని, గెలుపు అవకాశాలు కూడా లేవని తేలినట్టు సమాచారం.
దీంతో మళ్లీ రేపల్లెకు మోపిదేవి వెంకట రమణారావునే అభ్యర్థిగా ప్రకటించొచ్చని అంటున్నారు. అయితే 2020లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవికి 2026 వరకు పదవీ కాలం ఉంది. ఈ నేపథ్యంలో 2024లో అసెంబ్లీకి పోటీ చేస్తే రెండేళ్లు ముందుగానే తన ఎంపీ పదవిని పోగొట్టుకునే అవకాశం ఉంది. మరోవైపు 2019లో వైసీపీ గాలిలోనే రేపల్లెలో గెలవలేకపోయిన మోపిదేవి 2024లో ఎంతవరకు గెలుస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న!