ఏ రాయి తో కొట్టుకున్నా పళ్ళు ఊడడం కాయం ?
ఇద్దరూ తమ గొప్పతనం గురించి చెబుతూనే ప్రత్యర్ధి తప్పులనూ ఎత్తి చూపుతున్నారు.
By: Tupaki Desk | 29 March 2024 3:51 AM GMTఏపీ ఇంకా వెనక్కి పోతుందని ఇద్దరు ప్రధాన పార్టీలకు చెందిన నేతలూ అంటున్నారు పైగా ఇద్దరూ తమ సొంత గడ్డ మీద నిలబడి మరీ కఠిన సత్యాలనే చెబుతున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు తీవ్రంగానే చేసుకుంటున్నారు. ఒకరి గుట్టు మరొకరు విప్పుతున్నారు. ఇద్దరూ తమ గొప్పతనం గురించి చెబుతూనే ప్రత్యర్ధి తప్పులనూ ఎత్తి చూపుతున్నారు.
రాయలసీమ గడ్డ మీద గత రెండు రోజులుగా రసవత్తరమైన రాజకీయం సాగుతోంది. మేమంతా సిద్ధం పేరుతో జగన్ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అదే టైం లో చంద్రబాబు ప్రజాగళం పేరుతో రోడ్ షోలు సభలతో హడావుడి చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఇద్దరు నేతల ఉపన్యాసాలలో ఉన్నది ఒక్కటే. ఆత్మ స్తుతి, పరనింద. తమ గురించి బాగా చెప్పుకోవడం, ఎదుటి పక్షాన్ని ఘాటుగా విమర్శించడం. ముందుగా చంద్రబాబునే తీసుకుంటే ఆయన జగన్ అయిదేళ్ళ పాలనను చీకటి పాలనగా అభివర్ణించారు. ఒక్క చాన్స్ అంటూ ఇస్తే ఏకంగా ముప్పయ్యేళ్ళ పాటు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారు అని నిందించారు.
ఏపీ పాతాళానికి వెళ్ళిపోయింది అని బాబు ప్రతీ సభలో చెబుతున్నారు. పరిశ్రమలు లేవు, అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, ఏమీ లేదు, మరో చాన్స్ అంటూ ఇస్తే కనుక ఏపీని ఎవరూ బాగు చేయలేరు అని బాబు తేల్చేశారు. ఆ మీదట మీ ఇష్టం. ఈ రాష్ట్రం బాగుపడాలని ఉంటే కనుక వైసీపీని ఓడించండి అని బాబు గంభీరంగానే పిలుపు ఇస్తున్నారు.
ఇక జగన్ విషయానికి వస్తే తన కంటే వయసులో ఎంతో పెద్ద వారు అయిన చంద్రబాబు ఏలుబడిలో ఏపీ బాగుపడిందా అని ప్రశ్నిస్తున్నారు. అయిదేళ్ల కాలంలో తాను ఏపీలో ప్రతీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చాను అని ఆయన అంటున్నారు.
తాను తెచ్చిన ప్రతీ మార్పూ పల్లెలలో కనిపిస్తోందని ఆయన అన్నారు. నేను వయసులో చాలా చిన్నవాడిని, అయినా చాలా అభివృద్ధి చేసి చూపించాను. కానీ నాకన్నా పెద్దాయన అని చెప్పుకునే 75 ఏళ్ల ముసలాయన ఇన్నేళ్లుగా ఏం చేసాడు అని బాబు మీద సెటైర్లు వేశారు.
అంతే కాదు ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో, మీ కుటుంబ సభ్యులతో ఒకసారి మనస్ఫూర్తిగా మాట్లాడి అందరూ కలిసికట్టుగా ఓ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ ఎన్నికలు మీ తలరాతను మార్చబోతున్నాయి అని జగన్ హెచ్చరించారు. టీడీపీకి ఓటు వేస్తే కరవుని ఆహ్వానించినట్లే అని జగన్ అన్నారు. ఆ పార్టీ అవినీతిని దళారుల వ్యవస్థ ను ప్రోత్సహించినట్లే అన్నారు. జన్మభూమి కమిటీలు కోరుకున్నట్లే అని చెబుతున్నారు.
నేరుగా నగదు బదిలీ అన్నది ఉండదని పధకాలు కూడా ఉండవని ఆయన హెచ్చరిస్తున్నారు. అంతే కాదు ప్రతీ గ్రామంలో తాము వేసిన పునాది ప్రగతికి సంబంధించిన పనులు అన్నీ ఆగిపోతాయని ఏపీ మరో పదేళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోతుందని కూడా జగన్ అంటున్నారు. ఏపీ బాగుపడాలన్నా ఇదే మార్పు కొనసాగాలన్నా వైసీపీని మరోసారి గెలిపించి తీరాల్సిందే అని బాబు ప్రజలను కోరుతున్నారు.
ఇలా ఇద్దరు నేతల ప్రసంగాలు సాగుతున్నాయి. ఇద్దరూ ఒకే విషయం చెబుతున్నారు. ప్రత్యర్థికి ఓటేస్తే ఏపీ వెనక్కి పోతుందని అది కూడా దశాబ్దాల పాటు వెళ్తుందని కోలుకోలేని విధంగా దెబ్బ పడుతుందని. ఏపీలో చూస్తే రెండే పార్టీలు ఉన్నాయి. ఈ ఇద్దరిలో ఒకరు సీఎం అవుతారు. మరి ఆ విధంగా చూసుకుంటే ఎవరు గెలిచినా ఏపీ ఇంకా వెనక్కి పోవడం ఖాయమన్న సందేశాని ప్రత్యర్ధులుగా మారి ఇస్తున్నట్లే ఉంది కదా అని అంటున్నారు.
ఏపీ ప్రగతి మీద జనాలకు ఏమి ఆలోచనలు ఉన్నాయో తెలియదు కానీ ఈసారి ఎన్నికల్లో మేము గెలవకపోతే ఏపీ చీకటే అని అంటున్నారు. టీడీపీ వైసీపీ అధినేతలు. అంటే ఏ రాయి తో కొట్టుకున్నా పళ్ళు ఊడడం ఖాయమని చెబుతున్నారని సెటైర్లు పడుతున్నాయి. చూడాలి మరి జనం విజ్ఞత ఏపాటిదో వారి తీర్పు ఎలా ఉంటుందో.