Begin typing your search above and press return to search.

బీజేపీ మనసు తెలిసిందా...ఢిల్లీ నుంచి వస్తూనే జగన్...?

ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చిన తరువాత జగన్ రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. తన పార్టీనిఎన్నికల యుద్ధానికి సమాయత్తం చేయబోతున్నారు.

By:  Tupaki Desk   |   7 Oct 2023 11:54 AM GMT
బీజేపీ మనసు తెలిసిందా...ఢిల్లీ నుంచి వస్తూనే జగన్...?
X

ఏపీలో బీజేపీ రోల్ ఏంటి అన్నది సొంత పార్టీ నేతలకే అర్ధం కావడం లేదు. జనసేనతో పొత్తు నాలుగున్నరేళ్ళుగా ఉన్నా ఫలితం మాత్రం శూన్యం. ఇపుడు పవన్ టీడీపీతో జట్టు కట్టి బీజేపీని రమ్మని పిలుస్తున్నారు. ఒక విధంగా రోడ్ మ్యాప్ పవన్ ఇస్తున్నారు. ఇది బీజేపీ కేంద్ర పెద్దలకు ఎంత మేరకు రుచిస్తుందో తెలియదు.

ఈ నేపధ్యం ఇలా ఉంటే పవన్ ఒక వైపు ఎన్డీయేతో ఉంటాను అని చెబుతున్నారు. మరో వైపు బయటకు వచ్చాను అని అంటున్నారు. ఈ రకమైన స్టేట్మెంట్స్ తో ఆయన గందరగోళ పరుస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాల మీద బీజేపీ స్టాండ్ ఏంటి, పొత్తుల ఎత్తుల కధ ఏంటి అన్నది ఎవరికీ తెలియదు.

అయితే చంద్రబాబు అరెస్ట్ తరువాత తొలిసారి ఢిల్లీ వెళ్ళిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గంటకు పైగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. ఆయన ఈ భేటీలో ఏపీకి సంబంధించిన సమస్యలను ప్రస్తావించారని తెలుస్తోంది. అలాగే రాజకీయ అంశాలు ఇద్దరు నేతల మధ్యన కచ్చితంగా వచ్చాయని అంటున్నారు.

ఇక రాజకీయాల విషయానికి వస్తే బీజేపీ మనసు ఏపీ సీఎం కి తెలిసిందా అలా ఆయన ఎంతో కొంత అంచనా కట్టగలిగారా అన్న చర్చ అయితే వస్తోంది. జగన్ ఏపీలో మరోసారి సీఎం అవుతారని, అలాగే ఎంపీ సీట్లు ఎక్కువగా ఆయన పార్టీకే వస్తాయని జాతీయ సర్వేలు అనేకం వెల్లడిస్తున్నాయి. అదే విధంగా కాంగ్రెస్ కి ఇండియా కూటమికి జగన్ బహు దూరం అన్నది బీజేపీ పెద్దలకు బాగా తెలుసు.

బీజేపీకి కాంగ్రెస్ ఎంత దూరమో జగన్ కి కూడా అంతే దూరం అన్న సంగతి వారికి ఏపుడో అర్ధమైంది. ఇది ఒక రకంగా చూస్తే రాజకీయ భావ సారూప్యత అంటున్నారు. ఇక ఏపీలో టీడీపీ అయితే కాంగ్రెస్ తో జట్టు కట్టింది. 2018లో తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఇక లేటెస్ట్ గా చూస్తే కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ బాబు కేసులను సుప్రీం కోర్టులో వాదించిన సందర్భం కూడా ఉంది.

ఇలాంటి పరిణామాల నేపధ్యం నుంచి చూసినపుడు చంద్రబాబు తో పవన్ పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని చూస్తున్న వేళ రేపటి రోజున అంటే 2024 ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారం కోసం బీజేపీకి తగిన మెజారిటీ రాకపోతే నమ్మదగ్గ మిత్రుడిగా జగనే ఉంటారు అని అంటున్నారు. ఇక ఈ టూర్ లో ఎన్డీయేలో చేరకపోయినా వైసీపీ ఆ పార్టీకి సన్నిహితమే అన్నది మరింత బలంగా జగన్ చెప్పి ఉంటారనే అంటున్నారు.

మొత్తానికి చూస్తే జగన్ ఢిల్లీ టూర్ తరువాత ఏపీ రాజకీయ పరిణామాల మీద అందులో బీజేపీ పాత్ర మీద ఎంతో కొంత స్పష్టత అయితే ఆయనకు వచ్చి ఉంటుందనే అంటున్నారు. రేపటి రోజున బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్నది పక్కన పెడితే జగన్ని దూరం చేసుకోదు అనే ఢిల్లీ వర్గాలు అంటున్నారు. ఆయన అవసరం బీజేపీకి చాలా ఎక్కువ అని అంటున్నారు. అది ఈ లోక్ సభ కాల పరిమితితో మాత్రమే కాదు 2024 తరువాత ఏర్పడే కొత్త సభలోనూ ఏపీలో అందునా సౌతిండియాలో ఎక్కువ ఎంపీ సీట్లు అందిచే మిత్రుడిగా జగన్ని చూస్తున్నారు అని అంటున్నారు.

ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చిన తరువాత జగన్ రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. తన పార్టీని ఎన్నికల యుద్ధానికి సమాయత్తం చేయబోతున్నారు. దాదాపుగా పదివేల మంది మండల వైసీపీ నేతలతో ఆయన భారీ మీటింగ్ ఒకటి ఈ నెల 9న విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండవసారి గెలవాలని జగన్ పంతం మీద ఉన్నారు. కేంద్ర బీజేపీ మనసు ఏమిటి అన్నది జగన్ కి మాత్రమే తెలుసు. సో ఏపీ రాజకీయాల్లో రానున్న రోజుల్లో వైసీపీ వాడి వేడి ఎలా ఉంటుంది అన్న దానిని బట్టి బీజేపీ పాత్ర ఏ రకంగా ఉంటుంది అన్నది కూడా అంచనా వేయవచ్చు అని అంటున్నారు.