Begin typing your search above and press return to search.

జగన్ నోట ఆ మాట...వైసీపీకి షాకిచ్చేలా !?

జగన్ అంటే ఒక ఫైటర్ అని చెబుతారు. అది అందరూ అనుకునేదే కూడా. నెతి మీద పిడుగు పడినా జంకని తొణకని క్యారెక్టర్ అని కూడా అంటారు

By:  Tupaki Desk   |   7 May 2024 3:29 AM GMT
జగన్ నోట ఆ మాట...వైసీపీకి షాకిచ్చేలా !?
X

జగన్ అంటే ఒక ఫైటర్ అని చెబుతారు. అది అందరూ అనుకునేదే కూడా. నెతి మీద పిడుగు పడినా జంకని తొణకని క్యారెక్టర్ అని కూడా అంటారు. అటువంటి జగన్ తన పదిహేనేళ్ల పొలిటికల్ కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లను చూశారు. ఆయన ఏకంగా పదహారు నెలలు జైలు జీవితమూ గడిపారు. ఇక ఆయన 2014లో అధికారంలోకి రావడం గ్యారంటీ అని భావించినా తృటిలో తప్పిపోయింది. అపుడు కూడా నెక్స్ట్ టైం బెటర్ లక్ అని రిజల్ట్స్ వచ్చిన వెను వెంటనే మీడియాతో మాట్లాడుతూ లైట్ తీసుకున్నారు.

అలాంటి జగన్ నోటి వెంట వచ్చిన ఆ మాటలు ఇపుడు వైసీపీకి షాకింగ్ గా మారాయి. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. విపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి. నాకు నమ్మకం సన్నగిల్లుతోంది అన్న మాట జగన్ నోటి వెంట వచ్చింది. అది కూడా చాలా జోరుగా సాగుతున్న ఎన్నికల సభా వేదిక నుంచి. మచిలీపట్నం సభలో జగన్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా బేలతనం చూపించారు అని కామెంట్స్ వస్తున్నాయి.

ఏపీలో ఎన్నికలు సాఫీగా సాగుతాయన్న నమ్మకం లేదు అంటూ జగన్ మాట్లాడిన మాటలను విపక్షాలు పట్టుకున్నాయి. ఎన్నికలకు ముందే చేతులెత్తేసింది వైసీపీ అని విపక్ష కూటమి ఘాటు కామెంట్స్ చేస్తోంది. అసలు జగన్ ఎందుకు ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు అన్నది పక్కన పెడితే ఆయన సింగిల్ గా వస్తున్నా నేను ఒక్కడినే అని చెబుతూ వచ్చారు. పైన ఉన్న దేవుడు ఎదురుగా ఉన్న ప్రజలు తన అండదండ అని ఆయన అన్నారు.

అటువంటిది ఒక్కసారిగా ఎందుకు ఇలా ఓపెన్ అయ్యారు అన్నదే చర్చగా ఉంది. ఈసీ ఏపీలో ఆన్ గోయింగ్ స్కీంలకి నిధులు ఇవ్వవద్దు అని షాక్ ఇచ్చేసింది. అంతే కాదు ఒక్క రోజు వ్యవధిలో కీలక స్థానాలలో అధికారుల మీద బదిలీ వేటు పడింది. ఏకంగా డీజీపీనే బదిలీ చేసేశారు. ఇక ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని మోడీ కూడా ఎన్నడూ లేని విధంగా జగన్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.

ఇవన్నీ కూడా చకచకా జరిగిన పరిణామాలే. దాంతో జగన్ సోమవారం మాచర్ల తొలి సభకు వస్తూనే ఎందుకో డల్ గా కనిపించారు. ఆయన స్పీచ్ లో కూడా ఎక్కడా జోష్ కనిపించలేదు. నెల్లూరు స్పీచ్ లో కనిపించిన దూకుడు జోరు మాచర్ల సభలో మచ్చుకైనా లేదు అన్న మాట ఉంది. అది ఆయన తొలి సభ ఆ తరువాత చివరి సభ మచిలీపట్నంలో జరిగింది. అక్కడికి వచ్చేసరికి జగన్ బరస్ట్ అయిపోయారు. ఇష్టారాజ్యంగా అధికారులను మార్చేస్తున్నారు. నా మీద కూటమి కుట్రలు చేస్తోంది. కొనసాగుతున్న పధకాలకూ నిధులు పంపిణీ చేయవద్దా పేదలకు అన్యాయం కాదా అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వేదిక మీద నుంచే షాకింగ్ కామెంట్స్ చేశారు.

జగన్ విపక్ష కూటమిని నిందించవచ్చు. అలాగే తీవ్రంగా విమర్శలు చేయవచ్చు కానీ ఒక అధినేతగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఎన్నికల మీద నమ్మకం లేదూ అని ఆయనే అంటే వైసీపీ క్యాడర్ మొత్తం డీ మోరలైజ్ కాదా అని అంటున్నారు. డూ ఆర్ డై అని గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తున్న పార్టీ శ్రేణులకు ఏ రకమైన సందేశం వెళ్తుంది అని అంటున్నారు. అసలే అమిత్ షా ఏపీకి వచ్చిన నాటి నుంచి విపక్ష కూటమి ఫుల్ జోష్ లో ఉంది. వరస పెట్టి గుడ్ న్యూస్ లన్నీ ఒక్కోటిగా అందుతున్నాయి.

మోడీ నోటి వెంట జగన్ ని గట్టిగా విమర్శింపచేశామని వారంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈ నేపధ్యంలో జగన్ ఈ వైపున నిలబడి నమ్మకం సన్నగిల్లుతోంది అని అంటే అది విపక్షానికి ఆయుధంగానే మారుతుంది అని అంటున్నారు. కేంద్రం దన్నుగా ఉంటుందని జగన్ భావించారా ఎక్కడ బదిలీ జరిగినా డీజీపీ బదిలీ జరగదని ధీమాగా ఉన్నారా అన్న చర్చ కూడా ఇపుడు వస్తోంది. రాజకీయం ఇది. ఎపుడు ఏమి జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. ఇక్కడ గెలుపు కోసం వ్యూహాలు మాత్రమే ఉంటాయని అంటున్నారు.

కేంద్రానికి వైసీపీ బాసటగా అయిదేళ్ల పాటు నిలిచింది. రాజ్యసభలో మద్దతు ఇచ్చింది. కీలక బిల్లులు అలా పాస్ అయ్యాయి. ఆనాడు బీజేపీ పెద్దలు ఫోన్ చేసి మరీ మద్దతు ని కోరి తీసుకున్నారు. కానీ ఇపుడు ఎన్నికల రణక్షేత్రంలో వారు ప్రత్యర్థి కూటమిలో ఉన్నారు. అలాగే చేస్తారు.

కానీ ఇవన్నీ వైసీపీ అధినాయకత్వం ఊహించుకోలేదా అంతలా కేంద్ర పెద్దలను నమ్మేసిందా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా సోమవారం జగన్ స్పీచులలో తేడా స్పష్టంగా కనిపించిందని డల్ గా సాగడమే కాకుండా డీ మోరలైజ్ చేసేలా కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. ప్రచారానికి అయిదు రోజులు మాత్రమే వ్యవధి ఉన్న వేళ జగన్ ప్రచారం ఏ విధంగా సాగనుంది అన్నది చూడాల్సి ఉంది.