ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయి.. జగన్ ట్వీట్
ప్రస్తుతం ఆ:ద్రప్రదేశ్ కు అపధ్దర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 8 Jun 2024 4:03 AM GMTప్రస్తుతం ఆ:ద్రప్రదేశ్ కు అపధ్దర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఆయన తన సోషల్ పోస్టు ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని.. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వచ్చినట్లుగా ఆయన పోస్టు చేశారు. ఎన్నికల్లో విజయం తర్వాత తెలుగుదేశం పార్టీ వర్గాలు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారని.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆటవిక పరిస్థితులు తలెత్తినట్లుగా పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపైన దాడులు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా చెప్పిన ఆయన.. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దాడులకు జరిగిన ప్రాంతాలకు వెళ్లి కార్యకర్తలకు భరోసా కల్పించేలా జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అదే సమయంలో రాష్ట్ర గవర్నర్ ఈ దాడులపై స్పందించాలని.. జోక్యం చేసుకోవాలని కోరారు.
అయితే.. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పోస్టు చేసిన వైఎస్ జగన్.. తనకు తానుగా బయటకు వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడితే మరింత బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ దాడులపై గవర్నర్ తక్షణమే జోక్ం చేసుకోవాలని జగన్ కోరారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు పలువురిని గవర్నర్ వద్దకు పంపారు. తాజాగా ఏపీలోని పరిస్థితి గురించి వివరిస్తూ..తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి మరీ దాడులకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు.
ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని.. టీడీపీ వర్గాలు ఉన్మాదంగా వైసీపీ వర్గాల మీద దాడులకు పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఉన్నత చదువులకు కేంద్రాలైనా వర్సిటీల్లో ఆచార్యులపైనా దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
గడిచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు.. పేదలను ఆదుకునే ప్రోగ్రాంలో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటిని కేవలం మూడు రోజుల్లోనే దారుణంగా దెబ్బ తీస్తున్నారని మండిపడుతున్నారు. హింసాయుతంగా పరిస్థితుల్ని మార్చి ప్రజాస్వామ్యానికి.. పౌర స్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతున్నట్లుగా పేర్కొన్నారు. దీనిపై గవర్నర్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.