Begin typing your search above and press return to search.

సర్వే ఫలితాలు, అసలు ఫలితాలు... జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అవును... ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు.

By:  Tupaki Desk   |   13 Jun 2024 4:55 AM GMT
సర్వే ఫలితాలు, అసలు ఫలితాలు... జగన్  ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ఏపీలో వచ్చిన ఎన్నికల ఫలితాలను వైసీపీ అధినేత, నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారని తెలుస్తుంది! 151 నుంచి 11 కి పడిపోవడంపై వారి విశ్లేషణలు ఓ కొలిక్కి వస్తున్నట్లు లేదని అంటున్నారు. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉంటే మాత్రం ఇలా జరుగుతుందా అంటే... ఆ వ్యతిరేకతను జగన్ చేయించుకున్న సర్వే సంస్థలు గుర్తించలేదా అనే చర్చ తెరపైకి వస్తుంది.

అవును... ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. తాజా ఎన్నికల్లో ఓటమిపాలైన ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ సందర్భంగా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఎన్నికలకు ముందు ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించలేదని.. కానీ ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయని వ్యాఖ్యానించిన పరిస్థితి.

ఇదే క్రమంలో... పోలింగ్ కు ముందు, పోలింగ్ తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించామని.. ఇందులో భాగంగా 17 లక్షల శాంపిల్స్ తీసుకున్నామని జగన్ తెలిపారు. దీంతో... జగన్ ఏమి చెప్పాలనుకుంటున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. కేవలం 17 లక్షల శాంపుల్సేనా అనలేని పరిస్థితి. కారణం... ఈ నెంబర్ చిన్నదేమీ కాదు!

అయితే... ఇన్ని లక్షల శాంపుల్స్ తీయించినా కూడా ప్రభుత్వ వ్యతిరేకతను సర్వే సంస్థలు గుర్తించలేకపోవడం గమనార్హం. నిజంగానే సర్వే సంస్థలు ఆ విషయాన్ని గుర్తించలేదా.. లేక, జగన్ ఆ వ్యతిరేకతను తీసుకోలేరని సర్వే సంస్థలే కావాలనే హైడ్ చేశాయా అనే చర్చా తెరపైకి వచ్చింది.

అయితే... ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం తెలుసుకోవడం కోసం పూర్తిగా సర్వే ఫలితాలపైనే ఆధారపడకుండా.. రెగ్యులర్ గా తమ ఎమ్మెల్యేలతో జగన్ టచ్ లోకి వెళ్లి ఉంటే ఈ ప్రమాదం సంభవించేది కాదనే వారూ లేకపోలేదు! జగన్ కూ ఎమ్మెల్యేలకూ మధ్య అడ్డుగా అన్నట్లుగా ఉన్న కోర్ కమిటీ... ప్రజలకు - ప్రభుత్వానికీ కూడా అడ్డుగా నిలిచినట్లున్నారని ఇప్పుడు అనుకున్న ప్రయోజనం ఏముందనేది మరో కామెంట్.

ఏది ఏమైనా... ఓటమిని హుందాగా తీసుకోవడమే కాకుండా... ప్రజల్లో బలంగా నిలబడాల్సిన బాధ్యత కూడా జగన్ ఉందనేది పలువురు చెబుతున్న మాట. మరో విషయం ఏమిటంటే... ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎప్పుడూ కనబడదని, కనబడనివ్వరనే విషయం కూడా పెద్దలు గ్రహించాలని అంటున్నారు.