విలన్లకు హీరోలు బచ్చాల్లానే కనిపిస్తారు.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన జగన్!
అయితే.. ఇప్పటి వరకు కొంత సంయమనం పాటించిన జగన్.. తాజాగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
By: Tupaki Desk | 20 April 2024 4:07 PM GMTప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు మాటల తూటాలు పేల్చుతున్నారు. సీఎం జగన్‌ను ఆయన 'బచ్చా'తో పోల్చుతూ.. పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. సైకో జగన్ అంటున్నారు. దుర్మార్గుడిగా పేర్కొంటున్నారు. నిజానికి చాలా రోజులుగా ఈ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు కొంత సంయమనం పాటించిన జగన్.. తాజాగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తనను బచ్చా అనడంపై ఆయన నిప్పులు చెరిగారు. గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
"విలన్లకు హీరోలు ఎప్పుడూ బచ్చాలుగానే కనిపిస్తారు" అని సీఎం జగన్ అన్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా చింతలపాలెంలో నిర్వహించిన ``మేమంతా సిద్ధం` పేరుతో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేస్తున్న బచ్చా వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. విలన్లకు హీరోలు ఎప్పుడూ బచ్చాలుగానే కనిపిస్తారని.. మహాభారతం లో శ్రీకృష్ణుడు.. కంసుడికి బచ్చాగానే కనిపించాడని.. చివరకు ఏమైందో అందరికీ తెలిసిందేనని చెప్పారు. రామాయణంలో రాముడిని బచ్చా అనుకున్న మారీచుడు, సుబాహుడు చివరకు ఏమయ్యారో తెలిసిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. రామాయణంలో హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణాసుడి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసునని సీఎం జగన్ అన్నారు. పోయే కాలం వచ్చినప్పుడు విలన్లకు .. హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారని విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబు చెబుతున్నట్టుగా.. తాను బచ్చానే అయినప్పుడు.. ఇంత మంది(బీజేపీ-జనసేన)తో కలిసి ఎన్నికలకు ఎందుకు వస్తున్నట్టని నిలదీశారు. తాను ఒంటరిగానే వస్తున్నానని.. చంద్రబాబే పదిమందితో ఎందుకు వస్తున్నారని నిలదీశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి.
మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి. గతంలో చంద్రబాబును సీఎం జగన్ "అరుంధతి" సినిమాలో విలన్ పశుపతితో పోల్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన దానిని సమర్ధించుకున్నారు. గరళం కంఠంలో భరించిన శివుడిగా తాను పశుపతినేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. ఏదేమైనా వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఎన్నికల సమయం(మే 13) వరకు ఇవి కొనసాగనున్నాయి.