Begin typing your search above and press return to search.

బాబు గ్రాఫ్ పడిపోతోందా...జగన్ డిమాండ్ ఓకేనా ?

ఇచ్చిన హామీలు ఏవీ చంద్రబాబు నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు. చంద్రబాబు అమ్మ ఒడిని తల్లిని వందనంగా మార్చారు కానీ అది ఎక్కడా అమలు చేయలేదని అన్నారు.

By:  Tupaki Desk   |   7 Aug 2024 1:30 AM GMT
బాబు గ్రాఫ్ పడిపోతోందా...జగన్ డిమాండ్ ఓకేనా ?
X

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు. ఇంతలోనే గ్రాఫ్ పడిపోతోంది అని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. తమ పార్టీకి చెందిన నేత ఒకరిని టీడీపీ వారు కొట్టి హత్యాయత్నం చేశారంటూ ఆయన విమర్శించారు. విజయవాడలోని ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం మీద వ్యతిరేకత వెల్లువెత్తుతోందని తనదైన సర్వే నివేదిక వెల్లడించారు.

మామూలుగా అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద కొంత కాలం వరకూ మోజు ఉంటుందని కానీ చంద్రబాబు చేస్తున్న తప్పుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని దారుణంగా పరిస్థితి తయారైందని జగన్ విమర్శించారు.

ఇచ్చిన హామీలు ఏవీ చంద్రబాబు నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు. చంద్రబాబు అమ్మ ఒడిని తల్లిని వందనంగా మార్చారు కానీ అది ఎక్కడా అమలు చేయలేదని అన్నారు. రైతు భరోసాను ఇరవై వేల రూపాయలకు పెంచారని కానీ అది కూడా ఇవ్వలేదని 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు ఏవీ అని అడుగుతున్నారని అలాగే సున్నా వడ్డీకి డ్వాక్రా రుణాలు ఇవ్వలేదని ఇలా ప్రతీ హామీ బాబు పక్కన పెట్టారు అని ఆయన ద్వజమెత్తారు.

దీంతో ఎక్కడ హామీలు అడుగుతారో అని టీడీపీ వారు ఘర్షణలు ఎక్కడికక్కడ లేవనెత్తుతూ వైసీపీ వారి మీద దాడులు చేస్తున్నారు అని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇలాగే హత్యా రాజకీయాలను కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మీరే ఎల్ల కాలం అధికారంలో ఉండరని ఆయన బాబుని హెచ్చరించారు.

మరోసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని అపుడు తన పార్టీ క్యాడర్ కూడా టీడీపీ వారి మీద దాడులు చేస్తే తాను ఆపినా ఆగేది ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ విష బీజాలు నాటడాన్ని బాబు ఆపాలని అన్నారు.

ఏపీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉందని చిన్న పిల్లలను మహిళలను వదలకుండా అత్యాచారాలు చేస్తున్నారు అని అన్నారు. దీని మీద తాము ఇక ఉపేక్షించేది లేదని హైకోర్టు సుప్రీం కోర్టు తలుపులు తడతామని న్యాయం కోసం అర్ధిస్తామని అన్నారు.

అలాగే రాష్ట్ర గవర్నర్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఏపీలో అరాచకాలు జరుగుతూంటే ప్రభుత్వాన్ని వివరణ కోరాలని ఆయన అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే పదే పదే రాష్ట్రపతి పాలన అని జగన్ అనడమే విచిత్రంగా ఉందని అంటున్నారు. ఈ డిమాండ్ ఇపుడు పెట్టడం వల్ల బూమరాంగ్ అవుతుందని అంటున్నారు.

ఏపీలో వైసీపీ క్యాడర్ మీద దాడులు జరిగితే దాని మీద పోరాటం చేయడం వరకూ ఓకే కానీ రాష్ట్రపతి పాలన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద ఎవరు పెడతారు అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. దానికి ఊపిరిగా టీడీపీ ఎంపీలు ఉన్నారు. ఇలా రాజకీయంగా బలమైన బంధం కొనసాగుతున్న నేపధ్యంలో రాష్ట్రపతి పాలన పెట్టగలుగుతారా అన్నది కూడా ఆలోచించాలని అంటున్నారు.

ఇక బాబు గ్రాఫ్ ప్రభుత్వం గ్రాఫ్ తగ్గుతోందని జగన్ చెబుతున్నారు కానీ బొత్తిగా రెండు నెలలు కాకుండానే దీని మీద ఎలా అంచనాకు వస్తారని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. వైసీపీ తన పోరాటం పార్టీ కోసం చేసినా తప్పు లేదు, అలాగే హామీలు అమలు చేయమని ఒక విపక్షంగా కోరవచ్చు కానీ ప్రభుత్వం పని అయిపోయిందని రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరడం వల్ల వైసీపీకే ఇబ్బంది అని అంటున్నారు.