Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబూ.. నీకు-నాకు తేడా ఇదీ: జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఈ స‌మ‌యంలో ఆయ‌న చిన్న సింగమల ప్రాంతానికి చెందిన‌ ఆటో, టిప్పర్ డ్రైవర్లతో ముఖా ముఖి సమావేశమయ్యారు.

By:  Tupaki Desk   |   4 April 2024 4:30 PM GMT
చంద్ర‌బాబూ.. నీకు-నాకు తేడా ఇదీ:  జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

టీడీపీ అధినేత‌, విపక్ష నాయ‌కుడు నారా చంద్ర‌బాబుపై వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``చంద్ర‌బాబూ.. నీకు-నాకు తేడా ఇదీ!`` అంటూ వ్యాఖ్యానించారు. గురువారం సీఎం జ‌గ‌న్‌.. తిరు పతి జిల్లాలో `మేమంతా సిద్ధం` పేరుతో వైసీపీ నిర్వ‌హిస్తున్న ఎన్నిక‌ల ప్ర‌చార బస్సు యాత్ర లో పాల్గొన్నారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న చిన్న సింగమల ప్రాంతానికి చెందిన‌ ఆటో, టిప్పర్ డ్రైవర్లతో ముఖా ముఖి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ అనంతపురం జిల్లా శింగనమల ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్యర్థిగా బ‌రిలో నిలిచిన వీరాంజనేయులు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివాడని, చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోవడంతో టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని సీఎం జగన్ వెల్లడించారు. ఒక సాధారణ టిప్పర్ డ్రైవర్ ను చట్టసభకు పంపించేందుకు తాము టికెట్ ఇచ్చామని, దీనిపై టీడీపీ నేతలు అవహేళన చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా చంద్ర‌బాబు వేలి ముద్ర‌గాడంటూ.. రామాంజ‌నేయుల‌ను విమ‌ర్శించార‌ని అన్నారు.

ఇక‌, ఈ అంశంపైనే సీఎం జగన్ సోషల్ మీడియాలోనూ స్పందించారు. "జగన్ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశారు. అంతటితో ఆగకుండా... వేలిముద్రగాడంటూ వీరాంజనే యులును అవమానించారు. చంద్రబాబూ... నువ్వు కోట్లకు కోట్లు డబ్బులు ఉన్న పెత్తందార్లకు టికెట్లు ఇచ్చావు. నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా. నాకు-నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ!" అంటూ ట్వీట్ చేశారు.

కాగా, నాలుగు రోజుల కింద‌ట‌.. ఉమ్మ‌డి అనంత‌పురంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. శింగ‌న‌మ‌ల ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన‌.. రామాంజ‌నేయులుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ``ఇక టిప్ప‌ర్ డ్రైవ‌ర్‌కు ఇక్క‌డ టికెట్ ఇచ్చారు. ఇలాంటి వేలిముద్ర‌గాళ్లుంటే.. అలాంటి(జ‌గ‌న్) వాళ్ల ఆట‌లు సాగుతాయి. ఎక్క‌డ వేలి ముద్ర వేయ‌మంటే అక్క‌డ వేస్తారు. అందుకే రామాంజ‌నేయులుకు జ‌గ‌న్ టికెట్ ఇచ్చారు`` అని చంద్ర‌బాబు అన్నారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ప్ర‌స్తుతం శింగ‌మ‌న‌లలో టీడీపీ త‌ర‌ఫున మ‌హిళ బ‌రిలో నిలిచారు.