ఓట్లు అడగడానికి వస్తే.. చంద్రబాబు, లోకేష్‌లను నిలదీయండి: జగన్
ప్రతిపక్షాలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని చెప్పిన జగన్.. మంచి చేసిన ప్రభుత్వానికే ఓటు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా తమ మేనిఫెస్టోపైనా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 13 April 2024 8:40 AM GMT''మంగళగిరి నియోజకవర్గంలో ఓట్లు అడగడానికి వస్తే.. ఇక్కడ మన ప్రభుత్వం పేదలకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన 54 వేల ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని కోర్టులకు వెళ్లి ఎందుకు అడ్డుకున్నారో చంద్రబాబు, లోకేష్‌లను నిలదీయండి''- అని సీఎం జగన్ పిలుపునిచ్చారు. 'మేమంతా సిద్ధం' ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బస్సు యాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీలతో(చేనేతలు) సీఎం జగన్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చేనేతల కష్టాలు.. ప్రభుత్వం వారిని ఆదుకున్నతీరును అడిగి తెలుసుకున్నారు. అర్హు లుగా ఉంది పథకాలు అందకపోతే.. తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు. పలువురు చేనేతల నుంచి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మంగళగిరి ప్రాంతంలో పేదలకు 54 వేల మందిని ఎంపిక చేసి.. వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అయితే.. దీనిని చంద్రబాబు, నారా లోకేష్‌లు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని, దీంతో పేదలకు మంచి చేయాలన్న తమ సంకల్పం ఆపేశారని వ్యాఖ్యానించారు.
'వైఎస్సార్ చేయూత' పథకం ద్వారా చేనేతలకు ఆర్థికంగా సాయం చేశామని జగన్ చెప్పారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హులైన అందరికీ ప్రభుత్వం సంక్షేమాన్ని అందించిందని తెలిపారు. పేదలకు మంచి చేయాలనే ప్రభుత్వం ఒకవైపు ఉందని.. ఏదో ఒకరకంగా.. ఈ మంచిని అడ్డుకునేందుకు చంద్రబాబు మరోవైపు ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలు.. అందరూ ఒక్కటయ్యారని, ఓట్ల కోసం రేపో మాపో డబ్బులు కూడా పంచుతారని చెప్పారు.
ప్రతిపక్షాలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని చెప్పిన జగన్.. మంచి చేసిన ప్రభుత్వానికే ఓటు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా తమ మేనిఫెస్టోపైనా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసేదే చెబుతామని.. అబద్ధాలను మేనిఫెస్టోలో చేర్చేది లేదన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశామన్నారు.
ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మేనిఫెస్టోను రూపొందిస్తామన్నారు. విపక్షాలు.. సూపర్ సిక్స్, సెవన్ అంటూ.. రంగురంగుల మేనిఫెస్టోను తీసుకువస్తాయని.. కానీ, వాటిని తర్వాత.. కనిపించకుండా చేస్తారని విమర్శలు గుప్పించారు. ఇక్కడనుంచి మురుగుడు లావణ్య అనే బీసీ నాయకురాలికి టికెట్ ఇచ్చామని.. కానీ, టీడీపీ తరఫున చంద్రబాబు కుటుంబమే పోటీ చేస్తోందని వ్యాఖ్యానించారు.