పగలు బీజేపీతో.. రాత్రి కాంగ్రెస్‌తో చంద్రబాబు కాపురం: జగన్
ఏపీలో వైసీపీని అధికారం నుంచి దించేసేందుకు రేవంత్‌తో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
By: Tupaki Desk | 10 May 2024 4:54 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పగలు బీజేపీతోను, రాత్రి కాంగ్రెస్‌తోనూ కాపురం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చంద్రబాబు మనిషేనని.. రాత్రి పూట వీరిద్దరూ రహస్యంగా చర్చలు జరుపుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీపీని అధికారం నుంచి దించేసేందుకు రేవంత్‌తో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబును గెలిపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. దీనిలో భాగంగానే ఆయన సహకారం అందిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు ప్రోద్బలంతోనే కాంగ్రెస్‌లో చేరిన షర్మిల.. తనపై లేనిపోని మాటలతో విమర్శలు చేస్తున్నట్టు జగన్ చెప్పారు. వీరం తా చంద్రబాబు గూటి పక్షులేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తనను, తన కుటుంబాన్ని నానా తిప్పలు పెట్టిందన్న జగన్.. అకారణంగా తనను 16 నెలలు జైలు పాలు చేసిందని, తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ పేరును చార్జిషీటులో చేర్చింది కూడా.. కాంగ్రెసేనని.. కానీ, ఎన్నికల నేపథ్యంలో నాలుక మడత మాటలు మారుస్తూ.. దీనిని కూడా తనకే అంటగడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు తమ కుటుంబాన్ని కూడా విడదీసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్‌కు ఓటే స్తే.. చంద్రబాబుకు వేసినట్టేనని జగన్ చెప్పారు. నోటాకు కూడా రాని ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏదో చెప్పి.. ప్రజలను మభ్యపుచ్చి.. వైసీపీ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌కు ఓటే స్తే.. మన కళ్లను మన చేతులతో మనమే పొడుచుకుంటామన్న సంగతిని ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇది టీడీపీకి ఓటేసినట్టేనని చెప్పారు. ''ఎన్నికల సమయంలో ఎవరో వస్తారు. ఏదో కల్లబొల్లి కబుర్లు చెబుతారు. కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరుతారు. ఇలా చేస్తే.. వైసీపీని ఓడించడమే. చంద్రబాబును గెలిపించడమే'' అని జగన్ చెప్పారు. రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చిన కాంగ్రెస్‌ను బతికి బట్టకట్టనిస్తే.. రాష్ట్రానికి ఇంతకన్నా తీరని ద్రోహం లేదన్నారు.
తాజాగా కడప జిల్లాలో పర్యటించిన జగన్.. ఇక్కడ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి.. వైఎస్ సమాధిని ముట్టుకునే ప్రయత్నం చేస్తే.. ఇక్కడివారే ఎదిరించాలని పిలుపునిచ్చారు. ఆయనకు ఏం అర్హత ఉందని వైఎస్‌కు నివాళులర్పిస్తారని ప్రశ్నంచారు. ఎంపీ అవినాష్ తనకంటే..చిన్నవాడని.. అతను అమాయకుడు కాబట్టే తాను మద్దతిచ్చానని.. అవినాష్ ఎలాంటి వాడో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. అతనిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాగా, షర్మిల కోసం రేవంత్ శనివారం కడపలో పర్యటించనున్నట్టు తెలిసింది. తొలుత ఆయన వైఎస్ సమాధికి నివాళులర్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.