Begin typing your search above and press return to search.

బాబులో భయం... మెడలు వంచారు...జగన్ పవర్ ఫుల్ కామెంట్స్ !

వైసీపీ ఓటమి పాలు అయి రెండున్నర నెలలు అయింది. ఓటమి బాధ నుంచి ఇంకా కోలుకోలేదు.

By:  Tupaki Desk   |   14 Aug 2024 2:03 PM GMT
బాబులో భయం... మెడలు వంచారు...జగన్ పవర్ ఫుల్ కామెంట్స్ !
X

వైసీపీ ఓటమి పాలు అయి రెండున్నర నెలలు అయింది. ఓటమి బాధ నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ నేపధ్యంలో విశాఖ జిల్లా ఎమ్మెల్సీ సీటుకు ఉప ఎన్నిక వచ్చిపడింది. మామూలుగా అయితే ఈ సీటు టీడీపీ కూటమి ఖాతాలోనే అని అంతా అనుకున్నారు. కానీ వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకోవడంతో పాటు సీనియర్ నేత బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపడంతో కూటమి ఆలోచనలో పడింది అన్న టాక్ వినిపించింది.

ఒక విధంగా చూస్తే కూటమి విజయావకాశాలు ఏ మేరకు ఉంటాయన్న దానితో పాటే పోటీ మాత్రం ఢీ అంటే ఢీ అన్న పరిస్థితికి వైసీపీ తెచ్చింది అని అంటున్నారు. ఇక జగన్ సైతం ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో నేరుగా సమావేశాలు నిర్వహించడం కూడా ఉపయోగపడింది అని అంటున్నారు. అధినేత వారిని పిలిపించుకుని మాట్లాడడం దిశా నిర్దేశం చేయడంతో వారిలో కూడా ఒక రకమైన ఆత్మ విశ్వాసం ఏర్పడింది.

మరో వైపు టీడీపీకి కూడా ఎక్కువ మందిని ఫిరాయింపులకు గురి చేయడం వల్ల చెడ్డ పేరు మూటకట్టుకోవడం అవుతుంది అన్న ఆలోచనలో ఎక్కడో తట్టినట్లుంది. మొత్తానికి కూటమి పోటీ నుంచి తప్పుకుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ సహజంగానే వైసీపీకి ఈ కష్ట సమయంలో ఎమ్మెల్సీ సీటు దక్కింది కాబట్టి ఆ విజయోత్సాహం ఒక రేంజిలో ఉంటుంది.

అదే జగన్ విషయంలోనూ కనిపించింది. ఆయన తాజాగా తాడేపల్లిలోని విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ పార్టీ నేతలు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యల్ చేశారు. ఈ రోజున మననంతా ఒక త్రాటి మీదకు వచ్చాం కాబట్టే ఆయన మెడలు వంచక తప్పలేదు అని జగన్ వ్యాఖ్యానించారు. ఆయన అంటే ఇక్కడ చంద్రబాబు. సహజంగానే మనకు బలం ఉంది. ఆరు వందల చిల్లర ఓట్లు మనకు ఉన్నాయి. వారికి రెండు వందల చిల్లర ఓట్లు ఉన్నాయి.

అయినా పోటీ పెట్టడం అన్యాయం కదా అని జగన్ కామెంట్స్ చేశారు. అంటే ఏదో విధంగా ప్రలోభపెట్టి గెలవాలని చూశారని కానీ మనం ఒక్కటిగా నిలబడడంతో ఇది కుదరలేదని జగన్ అన్నారు. వైసీపీ క్యాడర్ బలంగా ఉంది అన్న సంకేతాలను పంపించామని కూడా ఆయన అన్నారు.

మనం ఐక్యంగా ఉండడంతో చంద్రబాబులో భయం మొదలైంది అని అన్నారు. మనం చేసిన మంచి ప్రతీ ఇంట్లో ఈ రోజుకూ ఉందని ఆయన గుర్తు చేశారు. మేనిఫెస్టోను విశ్వసనీయతతో అమలు చేశామని చెప్పారు. మనం అయిదేళ్ల పాటు ఏ నెలా క్రమం తప్పకుండా పధకాలు అమలు చేశామని అన్నారు.

దాని కోసం సాకులు అయితే వెతుక్కోలేదని అన్నారు. చంద్రబాబు ఇపుడే రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉని అని ప్రచారం చేస్తున్నారని నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చినపుడే చంద్రబాబు చేసిన అప్పులు అనేకం ఉన్నాయని వాటికి వడ్డీలు కడుతూ కూడా వైసీపీ సంక్షేమ పధకాలు అమలు చేసిందని జగన్ వివరించారు. ఆ సమయంలోనే కరోనా లాంటి ప్రపంచ విపత్తు కూడా వచ్చిందని అన్నారు

దాంతో ఒక్కసారిగా ఖర్చు పెరిగిందని అన్నారు. అయినా సరే ఎలాంటి శ్వేతపత్రాలు వైసీపీ ప్రభుత్వం రిలీజ్ చేయలేదని పధకాలను ఎగ్గొట్టే కార్యక్రమం అంతకంటే చేయలేదని ఆయన అన్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం మీద రెండున్నర నెలల వ్యవధిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఇది గతంలో ఎపుడూ చూడనిది అని జగన్ అన్నారు.ఈ రోజుకు జగన్ సీఎం గా ఉంటే ప్రతీ ఇంటికీ పధకాలు వచ్చేవి అన్న మాటలు జనం నుంచి వినిపిస్తున్నాయని జగన్ అన్నారు.

ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో టోఫెల్ పీరియడ్ ని ఎత్తేశారని, ఇంగ్లీష్ మీడియం కూడా నడుస్తుంది అన్న ఆశ లేదని అన్నారు. మధ్యాహ్న భోజన పధకం ప్రశ్నర్ధకం అయింది అని జగన్ చెప్పారు. వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా దెబ్బ తిందని ఆరోగ్యశ్రీ బకాయిలు 1800 కోట్ల పై దాటాయని ఆయన అన్నారు. రైతులను మళ్లీ క్యూ లైన్లలో నిలబెడుతున్నారని, విత్తనాల కోసం ఈ క్రాప్ ని పక్కన పెట్టారని ఉచిత పంటల బీమా పథకాన్ని వదిలేశారని బియ్యానికి డోర్ డెలివరీ లేదని అన్నారు.

ఇక పధకాలు కాదు కదా ప్రతీ పని కోసం తెలుగుదేశం నాయకుల చుట్టూ జన్మ భూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులను తెస్తున్నారని అన్నారు. మొత్తం మీద ఒక వైపు చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతి రేకత ఉందని జగన్ అంచనా వేస్తూనే వైసీపీకి మంచి రోజులు వస్తున్నాయని అంటున్నారు. చంద్రబాబులో భయం ఉండాలంటే వైసీపీ ఐక్యంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు నొక్కి చెప్పారు.