Begin typing your search above and press return to search.

ఆ జీవితం తనకు ఇవ్వాలంటూ జగన్ కొత్త డిమాండ్ !

రాజకీయాల్లో ఎమోషనల్ టచ్ ఎపుడూ గట్టిగానే పనిచేస్తూ ఉంటుంది. ప్రజలకు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   11 May 2024 3:32 AM GMT
ఆ జీవితం తనకు ఇవ్వాలంటూ జగన్ కొత్త డిమాండ్ !
X

రాజకీయాల్లో ఎమోషనల్ టచ్ ఎపుడూ గట్టిగానే పనిచేస్తూ ఉంటుంది. ప్రజలకు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఏపీలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవడానికి చూస్తోంది. పోయిన చోటనే వెతుక్కోవడం రాజకీయ ధర్మం. ఆ విధంగా ఆలోచిస్తే ఏపీ లో పాపులర్ పొలిటికల్ ఫ్యామిలీ కాంగ్రెస్ ని ఒ నాడు కాపు కాసి రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్ ఫ్యామిలీని చీల్చి మరీ షర్మిలను హస్తం పార్టీ తన వైపు తిప్పుకుంది.

అలా సీఎం జగన్ సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ వైపు ఉంది. ఆమె పీసీసీ చీఫ్ గా ఉన్నారు. ఆమె ఆ పదవిలో ఉండడంతో వైఎస్సార్ మా వాడు అని గట్టిగా మరోసారి అనుకుంటూ జనం ముందుకు వచ్చేందుకు కాంగ్రెస్ కి ఆస్కారం ఏర్పడింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏపీకి వస్తున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున ఆయన ఏపీలోని కడప జిల్లాలో బహిరంగ సభలో పాలు పంచుకుంటారు.

దానికంటే ముందు ఆయన ఇడుపులపాయ వెళ్ళి దివంగత వైఎస్సార్ సమాధి వద్ద ఘన నివాళీ అర్పిస్తారు అలా వైఎస్సార్ అభిమానులను వైసీపీ ఓట్లను తన వైపునకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ స్కెచ్ నే గీసింది. సరిగ్గా ఈ పాయింటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని మండించేలా చేసింది. ఆయన రాహుల్ కంటే ఒక రోజు ముందు కడపలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ మీద నిప్పులే చెరిగారు.

తన తండ్రి మరణించి పదిహేనేళ్ళు కావస్తూంటే ఆయన సమాధి సందర్శించడానికి ఇప్పటిదాకా తీరిక లేదా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు కాంగ్రెస్ ఏపీలో అడుగుపెట్టింది తాను గెలవడానికి కాదని టీడీపీని గెలిపించడానికి అంటూ ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబు పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తున్నారు అని మండిపడ్డారు.

తన తండ్రి చనిపోయిన తరువాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని అన్ని పాపాలకు కాంగ్రెస్ మూల కారణం అని ఆయన అన్నారు. అడ్డగోలుగా ఏపీని విభజించిన కాంగ్రెస్ ని ఏపీ ప్రజలు ఏనాడో సమాధి చేశారు అని కూడా నిప్పులు చెరిగారు. అంతటితో ఆగని జగన్ తనను అకారణంగా పదహారు నెలలు జైలులో పెట్టించిన కాంగ్రెస్ పెద్దలు ఏమీ ఎరగనట్లుగా ఏపీకి వస్తున్నారని ఇడుపుల పాయలో వైఎస్సార్ కి నివాళి అంటున్నారని ఫైర్ అయ్యారు.

తప్పులు ఎన్నో చేసి వైఎస్సార్ కుటుంబాన్ని రాజకీయ తెర పైన లేకుండా చేయాలని చూసిన కాంగ్రెస్ పాపాలను జనాలు ఎప్పటికీ క్షమించరు అని ఆయన అన్నారు. అంతే కాదు తనను జైలులో పెట్టించిన పాపం కాంగ్రెస్ ది అని తనకు పోయిన ఆ విలువైన కాలాన్ని తిరిగి కాంగ్రెస్ తెచ్చి ఇవ్వగలదా అని జగన్ ఎమోషనల్ టచ్ తో కూడిన ఒక భారీ డిమాండ్ నే చేశారు.

నిజంగా జగన్ నిర్దోషి అయితే ఆయన విలువైన కాలం ఏదీ తిరిగి ఇవ్వలేరు. ఆయన విషయంలోనే కాదు ఎవరి విషయంలో అయినా విలువైన కాలం జైలుకు అంకితం అయి వారు తప్పు చేయలేదని తరువాత రుజువు అయినప్పటికీ పోయిన కాలం తెచ్చి ఇవ్వలేరు. నిజంగా అది బాధాకరం. అందుకే జగన్ ఈ రకంగా జనాలకు కనెక్ట్ కావాలనే ఈ డిమాండ్ చేశారు అని అంటున్నారు.

అంతే కాదు తన చెల్లెలు చాలా సులువుగా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయి అన్నీ మరచి పోవడం పట్ల ఆయన బాధతో కూడా ఈ కామెంట్స్ చేశారు అనుకోవాలి. కాంగ్రెస్ చేసిన తప్పులు దిద్దబడలేనివి అని వాటికి క్షమ కూడా ఉండదని చెప్పడానికే జగన్ ఈ విధంగా డిమాండ్ చేశారు అని అంటున్నారు. అంటే కాంగ్రెస్ ని ఎప్పటికీ తాను క్షమించను అని ఆయన ఒక స్థిరమైన రాజకీయ అభిప్రాయంతోనే ఉన్నారని అంటున్నారు.