జగన్ దిశానిర్దేశం.. హెచ్చరికలు.. బ్రతిమాలుకోడాలు..!
రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయింది. ఇదే సమయంలో టీడీపీ కూటమి అధికారం దక్కించుకుంది.
By: Tupaki Desk | 18 Jun 2024 5:42 AM GMTరాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయింది. ఇదే సమయంలో టీడీపీ కూటమి అధికారం దక్కించుకుంది. అయితే.. నిన్న మొన్నటి వరకు వైసీపీతోనే ఉన్న నాయకులు.. ఇప్పుడు జంపింగులుగా మారేందుకు రెడీ అవుతున్నారన్న గుసగుస వినిపిస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్ పసిగట్టారు. అంతేకాదు.. ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కూడా. నాయకులకు ఆశలు రేపుతున్నారు. వారి ఆశలకు తన ఆలోచనలు కలిపి.. పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల జరిగిన కార్యక్రమంలో జగన్ ఇదే విషయాన్ని తన పార్టీ నాయకులతో ప్రస్తావించారు. ఒకటి ఓడిపోయిన వారు.. రెండు గెలిచిన వారు. ఈ ఇద్దరికీ కూడా జగన్ కీలక విషయాలు చెప్పారు. పార్టీమీకు ఎంతో ఇచ్చింది. అనేక మంది పదవుల కోసం ఆశలు పెట్టుకున్నా.. వారిని కూడా కాదని.. మీకు అందలం పరిచింది. కాబట్టి ఇప్పుడు మీకు ఆఫర్లు వస్తున్నాయని.. పదవులు ఇస్తామని చెపితే వెళ్లిపోతారా? అనేది మీరు ఆలోచించుకోవాలి అన్నారు.
ఇది ఒక రకంగా సెంటిమెంటును నూరిపోయడమే. ఇక, ఇదేసమయంలో టీడీపీ-జనసేన-బీజేపీ ఎక్కువ కాలం మనలేవని కూడా అంచనా వేసుకున్నారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు కూడా చెప్పారు. ఇప్పుడు బాగున్నంత ఈజీగా రెండేళ్ల తర్వాత.. పార్టీల మధ్య సఖ్యత ఉంటుందని అనుకోవడం లేదన్నారు. పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన పార్టీలు చివరి వరకు కూడా మనగలిగిన పరిస్తితి లేదన్నారు. దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలని ఆయన సూచించారు.
మరో కీలక విషయం జగన్ చెప్పింది ఏంటంటే.. పదవులు కొత్తకాదని.. రేపు ప్రజుల వైసీపీని ఆదరిస్తారని! ఈ రెండు కూడా జరుగుతాయని అన్నారు. చంద్రబాబు ప్రకటించిన అధిక పింఛను, ఆర్టీసీ బస్సుల ప్రయాణం వంటివి ప్రజలను ఆకర్షించాయని చెప్పారు. ఇవి ఆర్థికంగా రాష్ట్రానికి ఇబ్బందికర వాతావరణమని అన్నారు. దీంతో చంద్రబాబుకు పార్టీ నేతలకు మధ్య గ్యాప్ పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. ఈ నేపథ్యంలో కూటమిని నమ్ముకుని జంప్ చేయొద్దని తనదైన శైలిలో వారికి చెప్పుకొచ్చారు.