అప్పుడు గెలిచాక ఐప్యాక్ వద్దకు.. నేడు రిజల్ట్ కు ముందే.. జగన్ కాన్ఫిడెన్స్
ఈ ఎన్నికల సందర్భంగానూ వైసీపీ సర్కారుపై సానుకూలత వచ్చేలా భారీగా ప్రచారం చేసింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో పాజిటివ్ వేవ్ కల్పించింది.
By: Tupaki Desk | 18 May 2024 12:11 PM GMTఏపీలో ఎన్నికల అంకం పూర్తయి.. ఫలితాలకు అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4 ఎప్పుడు వస్తుందా? అని వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు. రాజకీయ నేతలందరూ రెస్ట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ప్రజలు మాత్రం పందేలు కాస్తూ మా నాయకుడు గెలుస్తాడంటే మా నాయకుడు గెలుస్తాడంటూ బెట్టింగ్ లు వేసుకుంటున్నారు. ఇక అధికార వైసీపీ అధినేత, సీఎం జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లారు. ఆయన జూన్ 1 తర్వాతే ఏపీకి తిరిగి రానున్నారు. ఎన్డీఏ కూటమి పార్టీలు కావడంతో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వారాణసీలో ప్రధాని మోదీ నామినేషన్ కు హాజరయ్యారు. పవన్ తన భార్యతో ఆలయాల్లో పూజలు చేసిన ఫొటోలు వచ్చాయి. ఇక చంద్రబాబు ఎక్కడ ఉన్నారన్నది తెలియాల్సి ఉంది.
అప్పట్లో ఫలితాలు వచ్చాక..
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో ఐ ప్యాక్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2017లో ఐప్యాక్ ఎంట్రీ అనంతరం జగన్ పాదయాత్ర కలగలిసి రాజకీయమే మారిపోయింది. ఇక 2019లో వైసీపీ అఖండ విజయంతో ఐ ప్యాక్ పేరు దేశమంతటా ఊగిపోయింది. ఫలితాల అనంతరం జగన్ నేరుగా హైదరాబాద్ లోని ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లి ఆ సంస్థ అప్పటి అధినేత ప్రశాంత్ కిశోర్ తో పాటు సిబ్బందిని ఆప్యాయంగా అభినందించారు.
ఇప్పుడు ఫలితాలకు ముందే..
వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రశాంత్ కిశోర్ విభేదించారు. అయినప్పటికీ ఆయన నెలకొల్పిన సంస్థ ఐ ప్యాక్ మాత్రం వైసీపీకి సేవలందించింది. ఈ ఎన్నికల సందర్భంగానూ వైసీపీ సర్కారుపై సానుకూలత వచ్చేలా భారీగా ప్రచారం చేసింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో పాజిటివ్ వేవ్ కల్పించింది. దీంతోనే జగన్ ఎన్నికల అనంతరం విజయవాడ బెంజి సర్కిల్ లోని ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని అభింనందించారు. ఈసారీ మనమే గెలుస్తున్నాం అనే ధీమా వ్యక్తం చేశారు.
లండన్ పర్యటనతోనేనా?
జగన్ శుక్రవారం లండన్ వెళ్లారు. జూన్ 1 వరకు అక్కడే ఉంటారు. ఏపీలో 13న పోలింగ్ పూర్తయింది. ఈలోగానే ఐ ప్యాక్ సిబ్బందిని అభినందించారు. లండన్ వెళ్తే మరీ ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి ముందుగానే ఈ క్యార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ ఫలితాల వెల్లడి తర్వాత మళ్లీ గెలిచాక అభినందించినా అప్పటికే చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి ముందుగానే అభినందించేశారు. దీనివెనుక మళ్లీ గెలుస్తున్నామనే ఆయన ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉన్నదో తెలుస్తోంది.